చంద్రబాబుకు క్షమాపణలు.. ఇలా చేయొచ్చా?!
ముఖ్యంగా వైసీపీ హయాంలో ఉన్న డీజీపీ(ఎవరనేది చెప్పలేదు) కారణంగా.. పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైపోయిందని.. అయిన దానికీ కాని దానికీ టీడీపీ నేతలను టార్గెట్ చేయాలని తమకు టార్గెట్ పెట్టారని అన్నారు.
ఏపీ పోలీసులు సంగం నేతలు యూటర్న్ తీసుకున్నారు. గతంలో వైసీపీ సర్కారు చెప్పినట్టు వ్యవహరించామని.. తమను క్షమించాలని చంద్రబాబును వారు వేడుకున్నారు. తాజాగా ఏపీ పోలీసు అధికారుల సంఘం నేతలు టీడీపీ కార్యాలయానికి వచ్చారు. ఈ సమయంలో పార్టీ సీనియర్ నాయకులు మాత్రమే ఉన్నారు. ఈ సమయంలో వారు ఓ వినతి పత్రాన్నివారికి అందించారు. చంద్రబాబును కలిసేందుకు అప్పాయింట్మెంట్ ఇప్పించాలని సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కోరారు. దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని పార్టీ నాయకులు తెలిపారు.
ఈ సందర్భంగా పలువురు పోలీసు అధికారుల సంఘం నాయకులు మాట్లాడుతూ.. గతంలో కొందరు ఉన్నతాధికారులు తమపై ఒత్తిళ్లు తెచ్చారని. తాము విధి నిర్వహణలో నిష్పక్ష పాతంగా పనిచేసుకునే వాతావరణం గత ప్రభుత్వం కల్పించలేదన్నారు. అందుకే.. అలా ప్రవర్తించాల్సి వచ్చిందన్నారు. తమకు టీడీపీపై ఎలాంటి ద్వేషం లేదన్నారు. గత పరిణామాల కారణంగా ఇప్పుడు చింతి స్తున్నామని.. అందుకే చంద్రబాబుకు క్షమాపణలు చెప్పుకొనేందుకు వచ్చామని వివరించారు. తమను పెద్దమనసు చేసుకుని క్షమించాలని కోరుతున్నామని అన్నారు.
ముఖ్యంగా వైసీపీ హయాంలో ఉన్న డీజీపీ(ఎవరనేది చెప్పలేదు) కారణంగా.. పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైపోయిందని.. అయిన దానికీ కాని దానికీ టీడీపీ నేతలను టార్గెట్ చేయాలని తమకు టార్గెట్ పెట్టారని అన్నారు. అందుకే.. కొన్ని కొన్ని సందర్భాల్లో తాము రూల్స్‌ను పక్కన పెట్టి `తప్పులు` చేయాల్సి వచ్చిందన్నారు. తమకు గత ప్రభుత్వం పావులుగా వాడుకుందన్నారు. ఇప్పుడు ఎంతో చింతిస్తున్నామని తెలిపారు. తమకు క్షమించగల మనసు చంద్రబాబుకు ఉందని అభిప్రాయపడుతున్నామన్నారు. త్వరలోనే చంద్రబాబును కలిసి.. ఆయనకే తమ క్షమాపణలు చెబుతామని అన్నారు.
ఇలా చేయొచ్చా!
పోలీసు అధికారుల సంఘం గతంలో తప్పులు చేసిందా చేయలేదా? అనేది పక్కన పెడితే.. అప్పుడైనా.. ఇప్పుడైనా.. ఇలా రాజకీయ పార్టీ కార్యాలయానికి వచ్చి వినతి పత్రం ఇచ్చి.. వేడుకునే సంప్రదాయం ఎక్కడా లేదు. అసలు రాజకీయాలకు అతీతంగా ఉంటామని ఖాకీ వేసుకునేముందే ప్రమాణం చేస్తారు. దీనిని బట్టి.. మరి వైసీపీ హయాంలో వారు ఆ పార్టీతో అంటకాగడం.. ఒక తప్పయితే.. ఇప్పుడు నేరుగా టీడీపీ కార్యాలయానికి వచ్చి.. `క్షమాపణలు` కోరడం.. ఎలా చూడాలి. అసలు ఏపీలో పోలీసు వ్యవస్థ ఎటు పోతోంది? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ప్రజలకు విశ్వనీయత ఎలా ఇస్తారు? అనేది మరో ప్రశ్న. ఏదేమైనా.. అప్పుడు వైసీపీ మాట విన్నారు. ఇప్పుడు టీడీపీ మాట వింటారు.. మరి ప్రజల మాట ఎప్పుడు వింటారు? ప్రజలు కడుతున్న పన్నులతో వేతనాలు దండుకుంటున్న దండధరులు.. ఇలాగేనా ప్రవర్తించేది?!! ఒక్కసారి ఆత్మ విచారణ చేసుకుంటే ఎవరు ఎవరికోసం పనిచేస్తున్నారో తెలుస్తుంది.