విరాళాల‌ వివరాలు... ఏపీలో పార్టీల రాబడి లెక్కలివే!

అవును... 2022-23 ఆర్థిక సంవ‌త్సరంలో ఏ రాజకీయ పార్టీకి ఎన్ని విరాళాలు వచ్చాయనే వివ‌రాల‌ను కేంద్ర ఎన్నిక‌ల సంఘం తాజాగా వివ‌రించింది.

Update: 2023-11-24 06:45 GMT

గతకొంతకాలంలో పార్టీల విరాళాలు... వాటి వివరాలు తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందా... ఎలక్టోరల్ బాండ్లు అంటే ఏమిటి... ఏయ్యే పార్టీలు ఎలక్టోరల్ బాండ్లను స్వీకరించవచ్చు... వంటి మొదలైన అంశాలపై తీవ చర్చ జరుగుతుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా 2022-23 ఆర్థిక సంవ‌త్సరంలో ఏయే పార్టీకి ఎన్ని విరాళాలు వచ్చాయనేది తాజాగా వెలుగులోకి వచ్చింది!

అవును... 2022-23 ఆర్థిక సంవ‌త్సరంలో ఏ రాజకీయ పార్టీకి ఎన్ని విరాళాలు వచ్చాయనే వివ‌రాల‌ను కేంద్ర ఎన్నిక‌ల సంఘం తాజాగా వివ‌రించింది. ఇందులో భాగంగా ఏపీలో అధికార వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలకు ఈ ఆర్ధిక సంవత్సరంలో ఎన్నెన్ని విరాళాలు వచ్చాయనేది వెలుగులోకి వచ్చింది. ఈ జాబితాలో అధికార వైసీపీ మొదటి స్థానంలో ఉండగా.. ఆ తర్వాతి స్థానాల్లో టీడీపీ, జనసేనలు వరుసగా ఉన్నాయి.

2022-23 ఆర్థిక సంవ‌త్సరంలో ఏపీ అధికార వైసీపీకి ఎల‌క్టోర‌ల్ బాండ్ల ద్వారా రూ.52 కోట్లు అందాయి. ఇందులో ప్రుడెంట్‌ ట్రస్ట్‌ పేరుతో రాజకీయ పార్టీలకు విరాళం ఇచ్చే పద్దతి కూడా ఒకటుంది. దీనికి సంబంధించిన ట్రస్టు ఢిల్లీలో ఉంది. ఈ ట్రస్టుకు డబ్బు చెల్లించి, బాండ్లు కొనుగోలు చేసి, వాటిని రాజకీయ పార్టీలకు ఇవ్వొచ్చు. ఈ పద్దతిలో వైసీపీకి రూ.16 కోట్లు వచ్చాయి.

ఇక‌, టీడీపీ విష‌యానికి వ‌స్తే.. ఈ పార్టీకి ఎలక్టొరల్‌ బాండ్లు, ప్రుడెంట్‌ ట్రస్టు బాండ్ల ద్వారా విరాళాలూ అందనప్పటికీ... దాతల నుంచి నేరుగా సేక‌రించారు. ఇందులో... పార్టీ సానుభూతిపరులు, నేతలు, సాఫ్ట్‌ వేర్‌ సంస్థలు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు మొదలైనవారు మొత్తం కలిసి 193 మంది విరాళాలు ఇచ్చారు. ఇలా సుమారు 11 కోట్ల 92 ల‌క్షల రూపాయ‌లు టీడీపీకి అందాయి.

ఇక మిగిలిన పార్టీలలో క‌మ్యూనిస్టు పార్టీల‌కు 2 కోట్ల రూపాయ‌ల విరాళాలు అందగా.. జ‌న‌సేన పార్టీకి అత్యల్పంగా కోటీ 30 ల‌క్షల రూపాయ‌లు విరాళాలుగా అందాయ‌ని ఎన్నిక‌ల సంఘం తెలిపింది. ఇక ఏపీ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేకంగా విరాళాలు ఏమీ రాలేదు

అయితే ఆయా పార్టీలకు అందిన విరాల వివరాలను ఎల‌క్టోర‌ల్ బాండ్ల నియ‌మ నిబంధ‌న‌ల మేర‌కు ఎవరెవరి నుంచి వచ్చాయనేది ప్రశ్నించ‌లేర‌ని ఈసీ తెలిపింది. కాగా... గ‌తంలో బీజేపీకి కూడా ఇలానే 520 కోట్ల రూపాయ‌లు విరాళాలుగా రాగా.. కాంగ్రెస్ పార్టీకి 132 కోట్ల రూపాయ‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే.

Tags:    

Similar News