ఎవరి వాదన వారిదే.. ఏపీలో ఏ మీడియాను నమ్మేది..?

స్థానికులకు ఇందులో వాస్తవం ఏమిటో తెలుస్తుందేమో గానీ.. ఆ ప్రాంతం దాటి బయటి నుంచి చూసేవారికి అసలు తప్పెవరిదో మాత్రం స్పష్టత రాదు.

Update: 2024-05-14 11:30 GMT

దాడులు, ప్రతిదాడులు, ఏదైనా ఘటనలు జరిగినప్పుడు అసలు బాధితులు ఎవరు అనేది ఎలా తెలుస్తుంది..? ఘటనలు జరిగిప్పుడు వాస్తవాలు ఎలా వెలుగులోకి వస్తాయి..? ప్రభుత్వ పథకాల్లోనో, కార్యక్రమాల్లోనే అక్రమాలు, అవినీతి చోటుచేసుకుంటే ఎలా తెలుస్తుంది..? వీటన్నిటినీ బయటపెట్టేది కేవలం మీడియా మాత్రమే. అలాంటి మీడియా ఆంధ్రప్రదేశ్ లో ఉందా? అంటే చెప్పడం కష్టమే.

అటు నాలుగు.. ఇటు నాలుగు ఏపీలో రాజకీయాలు అంటేనే హాట్ హాట్. రెండు బలమైన పక్షాలు టీడీపీ, వైసీపీ ఢీ అంటే ఢీ అనే స్థాయిలో ఉన్నాయి. ఆర్థిక, అంగ బలం వీటి సొంతం. అదనంగా చెప్పాలంటే మీడియా బలం కూడా వైసీపీ, టీడీపీకి దండిగా ఉన్నాయి. సైద్ధాంతికగా ఆయా పార్టీల విధానాలు, పథకాలను సమర్థించే మీడియాగా వీటిని భావించాలేమో? ఓ లెక్కన చెప్పాలంటే ప్రజాస్వామ్య నాలుగో స్తంభమైన మీడియాలో.. వైసీపీకి నాలుగు, టీడీపీకి నాలుగు మీడియా సంస్థలు మూలస్తంభాలుగా నిలిచాయి.

ఏం జరిగిందో తెలిసేదెలా?

పోలింగ్ నాడు సోమవారం ఏపీలో పలు విధ్వంసక ఘటనలు చోటుచేసుకున్నాయి. అయితే, ఇదంతా కేవలం వైసీపీ గూండాయిజం అని టీడీపీ వర్గపు మీడియా కథనాలు వేసేసింది. అంతా తూచ్.. టీడీపీ గూండాలు తమవారిపై దౌర్జన్యానికి దిగారని వైసీపీ మీడియా రాసుకొచ్చింది. స్థానికులకు ఇందులో వాస్తవం ఏమిటో తెలుస్తుందేమో గానీ.. ఆ ప్రాంతం దాటి బయటి నుంచి చూసేవారికి అసలు తప్పెవరిదో మాత్రం స్పష్టత రాదు. చివరకు ఎవరో దాడి చేశారులే అని సరిపెట్టుకునే పరిస్థితి బయటి ప్రజలది.

ప్రభుత్వాలనూ వెనకేసుకొస్తూ టీడీపీ ప్రభుత్వం ఉంటే దాని కార్యక్రమాలు, పథకాలను వెనకేసుకు రావడం ఆ వర్గపు మీడియా కార్యక్రమంగా ఉండేది. ఎన్నికల సమయంలో తాయిలాలు ప్రకటించినా దానిని సమర్థించేది. పార్టీ విధానాలను తలకెత్తుకునేది. ఇక వైసీసీ ప్రభుత్వం వచ్చాక ఆ వర్గం మీడియా ఇంతకు తగిన పాత్రనే పోషించింది. ప్రత్యర్థి పార్టీ మీడియా తమ తప్పులను ఎత్తిచూపితే నిజాలివిగో అంటూ కథనాలు ఇచ్చింది. టీడీపీ సర్కారు హయాంలో ఏం చేసింది? తాము ఏం చేసింది? చెప్పుకొంటూ పోయేది.

మరి స్వతంత్రులు ఎవరు?

రాజకీయ పార్టీలు మీడియాను ఆయుధంగా మార్చుకోవడంతో ఏపీలో స్వతంత్ర మీడియా ఏదీ లేదనేది స్పష్టం అవుతోంది. అవతలివారిపై దుమ్మెత్తి పోయడం, తమను తాము పూర్తిగా సమర్థించుకోవడంలో మునిగి తేలుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం, రాజకీయాలకు సంబంధించిన వాస్తవాలు ఏపీలో నిష్పక్షపాతంగా బయటకు వస్తాయని ఊహించడం కష్టమే.

Tags:    

Similar News