జగన్ జోరు బాబు పవన్ పోరు... చెక్ పడేదెవరికి...?

అందుకే ఎన్నడూ లేని విధంగా వైసీపీ, టీడీపీ, జనసేన ఉత్తరాంధ్రా మీద ఫుల్ ఫోకస్ పెడుతున్నారు.

Update: 2023-08-15 02:45 GMT

ఉత్తరాంధ్ర ఏపీ రాజకీయాలలో అత్యంత కీలకమైనదిగా చెప్పాల్సి ఉంది. ఉత్తరాంధ్రా ఎపుడూ విపక్షాలకు అండగా ఉంటూ వచ్చింది. ఇక్కడ నుంచే ఎంతో మంది విపక్ష నేతలు ఆ రోజులలో తయారయ్యారు. సర్దార్ గౌతు లచ్చన్న అయినా తెన్నేటి విశ్వనాధం అయినా ఉత్తరాంధ్రా సీమ నుంచి వచ్చిన వారే. అలాగే ద్రోణం రాజు సత్యనారాయణతో పాటు పీవీజీ రాజు భాట్టం శ్రీరామమూర్తి వంటి యోధానుయోధులు ఉత్తరాంధ్రా నుంచే రాజకీయం చేసి రాటు తేలారు.

ఇదిలా ఉంటే ఉత్తరాంధ్రాలో మొత్తం 34 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇందులో 2024 ఎన్నికల్లో ఎవరిని ఎన్ని వస్తాయి. ఏ పార్టీ దూకుడు ఏంటి అన్నదే ఇపుడు ఆసక్తిగా మారుతోంది. ఉత్తరాంధ్రా అంటే వెనుకబాటుతనానికి మారుపేరుగా ఉంటోంది. దశాబ్దాల కాలంగా ఈ ప్రాంతాలు అభివృద్ధి లేమితో మగ్గిపోతున్నాయి. దాంతో ఉత్తరాంధ్రాలో చిరకాల డిమాండ్లు అలాగే ఉన్నాయి.

విశాఖ రైల్వే జోన్ అన్నది దశాబ్దాల నాటి డిమాండ్ గా ఉంది. అది ఈ రోజుకీ సాకారం కాలేదు. అలాగే ఉత్తరాంధ్రాలో ఉపాధి అవకాశాలు కల్పించాలన్న డిమాండ్ ఉంది. ప్రత్యేక ప్యాకేజి ఈ ప్రాంతానికి ప్రకటించాలని జనాలు కోరుతున్నారు. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ ఉత్తరాంధ్రాకు అతి ప్రధానంగా ఉంది దాన్ని కాస్తా ప్రైవేట్ పరం చేయడానికి కేంద్రం చూస్తున్నా ప్రధానంగా ఉన్న మూడు పార్టీలు నోరెత్తే సీన్ అయితే లేదు.

ఇక ఉత్తరాంధ్రా మీద జగన్ ఫోకస్ పెట్టి రాజధానిగా ప్రకటించారు. దీంతో తమ జీవితాలు ఏమైనా మారుతాయన్న ఆశ అయితే వెనకబడిన జిల్లాల ప్రజలలో ఉంది. నిజానికి 1953 ప్రాంతంలోనే విశాఖ రాజధాని కావాలన్న ఆలోచనలు ఆశలు ఉన్నాయి. ఇపుడు రాజధాని అన్నది పెండింగులో పడినా జగన్ విశాఖకు మకాం మార్చడం వల్ల వైసీపీకి పొలిటికల్ మైలేజ్ వస్తుంది అన్న ఆందోళన అయితే విపక్షాలలో ఉంది.

దాంతో పాటుగా చూసుకుంటే భోగాపురం ఎయిర్ పోర్టు కి శంకుస్థాపన చేయడం విశాఖ లో ఇంఫోసిస్, అదానీ సెంటర్, రహేజా ఇనార్పిట్ మాల్ వంటివి రావడం, బీచ్ కారిడార్ నిర్మాణం పనులు వీటితో పాటు విశాఖలో జరిగిన గ్లోబల్ సమ్మిట్ కూడా వైసీపీకి ఎంతో కొంత ప్లస్ అవుతున్నాయి.

అయితే విశాఖలో భూ కబ్జాలు అంటూ టీడీపీ జనసేన చేస్తున్న విమర్శలతో వైసీపీ జోరుకు ఎంత వరకూ బ్రేక్ పడుతుందో చూడాల్సి ఉంది. మరో వైపు చూస్తే విశాఖ రాజధాని అని వైసీపీ అంటూంటే దాన్ని కౌంటర్ చేయడానికి టీడీపీ జనసేనల వద్ద ఉన్న అస్త్రాలు ఏంటో అర్ధం కావడం లేదు. ఆ విషయం పక్కన పెట్టి విశాఖ అభివృద్ధి గురించి ఎంత మాట్లాడినా జనామోదం ఉంటుందా అన్నది ప్రశ్నగానే ఉంది. ఇక భూ కబ్జాలు అన్నవి టీడీపీ ఏలుబడిలో కూడా ఉన్నాయి. ఇపుడు వైసీపీ మీద ఆరోపణలు వస్తున్నాయి. ఇలా రెండు పార్టీల మధ్య పరస్పర ఆరోపణలుగానే ఈ అంశం సాగుతోంది.

ఏది ఏమైనా 34 అసెంబ్లీ సీట్లు అంటే మాటలు కాదు, వీటిని కనుక గెలుచుకుంటే రేపటి రోజున ఏపీలో అధికారం ఆ పార్టీదే. అందుకే ఎన్నడూ లేని విధంగా వైసీపీ, టీడీపీ, జనసేన ఉత్తరాంధ్రా మీద ఫుల్ ఫోకస్ పెడుతున్నారు. ఇక ఈ మార్చిలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఘనవిజయం సాధించింది. దాంతో ఆ పార్టీలో ఆశలు ఒక్కసారిగా పెరిగాయి.

పైగా ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు ఉత్తరాంధ్రా వాసి కావడం, బీసీ కావడంతో ఆ ప్రభావం కూడా ఉంటుందని ఊహిస్తోంది. ఇక జనసేనకు విశాఖలో కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో బలం పెరిగింది అని అంచనా కడుతున్నారు. దాంతో ఆ పార్టీ కూడా ఉత్తరాంధ్రా మీద పట్టు సాధించాలని చూస్తోంది. మొత్తానికి ఉత్తరాంధ్రాలో ఎవరి జోరుకు ఎవరు బ్రేకులు వేస్తారో తెలియదు కానీ ఇపుడు ఏపీలో రాజకీయం ఉత్తరాంధ్రా వైపు మళ్ళింది అని చెప్పాల్సి ఉంటుంది.

Tags:    

Similar News