టికెట్ ఇస్తారా.. వచ్చేస్తాం.. నేతల కబుర్లు..!
వచ్చే ఎన్నికలకు సంబంధించి ఏపీలో రాయబారాలు.. జోరుగా సాగుతున్నాయా? ముఖ్యంగా వైసీపీలో చోటు దక్కదని భావిస్తున్న పలువురు నాయకులు.. పొరుగు పార్టీలపై ఆశలు పెట్టుకున్నారా?
వచ్చే ఎన్నికలకు సంబంధించి ఏపీలో రాయబారాలు.. జోరుగా సాగుతున్నాయా? ముఖ్యంగా వైసీపీలో చోటు దక్కదని భావిస్తున్న పలువురు నాయకులు.. పొరుగు పార్టీలపై ఆశలు పెట్టుకున్నారా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. వైసీపీలో యాక్టివ్‌గా ఉంటూ.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని చాలా మంది నేతలు ఆశలు పెట్టుకున్నారు. కానీ, వారికి టికెట్ దక్కడం కష్టమనే భావన ఉంది. దీనిపై పార్టీ కూడా ఏమీ తేల్చడం లేదు.
దీంతో ఇలాంటి నాయకులు పొరుగు పార్టీలవైపు చూస్తున్నారు. దర్శి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శిద్దా రాఘవరావు ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు. కానీ, వచ్చే ఎన్నికల్లో ఆయన కుమారుడు పోటీ చేయాలని భావిస్తున్నారు. కానీ, టీడీపీ నుంచి బయటకు వచ్చాక.. వైసీపీలో ప్రాధాన్యం లేకుండా పోయింది. దీనికి తోడు వచ్చే ఎన్నికల్లో టికెట్ కూడా దక్కే పరిస్థితి లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో మళ్లీ టీడీపీవైపు ఆశగా చూస్తున్నారు.
టికెట్ ఇస్తామంటే వచ్చేస్తామని కబురు చేస్తున్నారట. ఇక, అనంతపురంలో కొందరు నాయకులు.. వైసీపీ వైపు చూస్తున్నారు. కదిరి నుంచి 2014లో గెలిచిన నేత.. ఇప్పుడు టికెట్ కోసం.. ప్రయత్నాలు చేస్తు న్నారు. అయితే, ఆయనకు టీడీపీలో టికెట్ లభించే అవకాశం లేదు. దీంతో వైసీపీలో చక్రం తిప్పుతు న్న కీలక నాయకుడి ద్వారా మంతనాలు జరుపుతున్నారు. టికెట్ హామీ ఇస్తే.. వైసీపీలోకి వస్తానని ఆయన చెబుతున్నారు.
అదేవిధంగా గుంటూరు జిల్లాలో మాజీ ఎంపీ కుమారుడు ఒకరు టీడీపీలో నలిగిపోతున్నారనే టాక్ విని పిస్తోంది. ఈ కుటుంబం రెండు టికెట్ల కోసం పట్టుబడుతోంది. అయితే.. టీడీపీ ఒక్క టికెట్ విషయంపైనే ఇంకా తేల్చలేదు. దీంతో వీరు కూడా.. వైసీపీ వైపు చూస్తున్నారు. ఎంత ఖర్చయినా ఫర్లేదు... టికెట్ కావాలంటూ.. సలహాదారుకు కబురు పంపారని వైసీపీలో గుసగుస వినిపిస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇలాంటి నాయకులు 10 మంది వరకు ఉంటారని అంటున్నారు. ఎవరు టికెట్ ఇస్తే.. వారికి జై కొట్టేందుకు నాయకులు సిద్ధంగా ఉండడం గమనార్హం. మరి పార్టీలు ఏం చేస్తాయో చూడాలి.