ఏపీలో రాజకీయం....మంత్రుల అంచనా ఇదీ ...!
ఆయన జూన్ లో తాను మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడం ఖాయమని అంటున్నారు.
ఏపీలో రాజకీయం ఎలా ఉంది అంటే ఏ పార్టీకి ఆ పార్టీ తమకే మొగ్గు ఉంటుందని చెబుతుంది. ఇపుడు ఏపీలో వైఎస్ జగన్ అయితే వై నాట్ 175 అంటున్నారు. ఆయన బస్సు యాత్రతో రాయలసీమలో పర్యటించి ప్రకాశం జిల్లా దాకా వచ్చారు. ఆయన జూన్ లో తాను మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడం ఖాయమని అంటున్నారు.
ఆయన ధీమా అలా ఉంటే వైసీపీ మంత్రులు అదే మాట అంటున్నారు. ఉత్తరాంధ్ర నుంచి గోదావరి జిల్లాల మంత్రులు అలాగే కోస్తా జిల్లాల మంత్రులు అదే అంటున్నారు. వైసీపీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని గుంటూరు జిల్లా మంత్రి అంబటి రాంబాబు ధీమా వ్యక్తం చేశారు.
చెప్పిన మాట మేరకు తాము అన్ని హామీలను అమలు చేశామని ఆయన చెబుతున్నారు. జూన్ 4న ఫలితాలు వస్తాయని చంద్రబాబు ఓటమి ఖాయమని అలాగే జగన్ మరోసారి సీఎం అవుతారని అంటున్నారు. అనంతరం జరిగే పరిణామాల క్రమంలో చంద్రబాబు జైలుకు వెళ్ళడం ఖాయమని కూడా అంబటి జోస్యం చెబుతున్నారు.
తాను సత్తెనపల్లిలో మంచి మెజారిటీతో గెలుస్తాను అని అంటున్నారు. తన మీద అభ్యర్ధి లేక వేరే పార్టీలో నుంచి కన్నా లక్ష్మీనారాయణను తెచ్చి పోటీకి పెట్టారు అని ఎద్దేవా చేశారు. చంద్రబాబుని కన్నా ఎన్నో మాటలు అన్నారని అవన్నీ మరచి బాబు ఆయనను పక్కన పెట్టుకుని గెలిపించాలని కోరడం విడ్డూరం అన్నారు.
ఇక విజయనగరం జిల్లాకు చెందిన మంత్రి బొత్స సత్యనారాయణ సైతం మరోసారి వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని అంటున్నారు. దేశంలోనే ఇన్ని రకాలైన సంక్షేమ పధకాలను అమలు చేసిన ప్రభుత్వం మరోటి లేదని ఆయన అన్నారు. అందువల్ల తమ ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకుంటారని బొత్స అంటున్నారు.
విపక్షాల ఎత్తులు జిత్తులు అన్నీ కేవలం నలభై రోజులు మాత్రమే అని ఆయన అంటున్నారు. ఆ మీదట జగన్ మరోసారి సీఎం అవుతారు అని జోస్యం చెప్పారు. కూటమిలో కొత్త కుట్రలు పురుడు పోసుకుంటున్నాయని బొత్స అన్నారు. అయినా వాటిని తాము భయపడే ప్రసక్తి లేదని అన్నారు అమలాపురం జిల్లాకు చెందిన మంత్రి పినిపె విశ్వరూప్ కూడా ఏపీలో అధికారంలోకి వచ్చేది వైసీపీ ప్రభుత్వమే అని అంటున్నారు.
ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి తాను అందించిన పథకాలు అందితేనే తనకు అండగా నిలబడండి అని ధైర్యంగా చెప్పగలుగుతున్నారంటే రాష్ట్రంలో ఏ స్థాయిలో సంక్షేమ పథకాలు అమలు జరిగిందో అర్ధం చేసుకోవచ్చనని ఆయన అంటున్నారు. తాను ఎక్కడికెళ్లినా ప్రభుత్వ పాజిటివ్ ఓటింగ్ కనిపిస్తుందని రానున్నది మళ్లీ జగనన్న ప్రభుత్వమేనన్నారు. పట్టణ, పల్లెలు అన్న వ్యత్యాసం లేకుండా అన్ని చోట్ల వైసీపీ పాలనకు మద్దత్తు కనిపిస్తుందని విశ్వరూప్ పేర్కొన్నారు.
ఇదే మాటను మరో మాత్రి కారుమూరి నాగేశ్వరరావు కూడా అంటున్నారు. కూటములు ఎన్ని కట్టినా గోదావరి జిల్లాలలో వైసీపీకి ఎదురు లేదని ఆయన చెబుతున్నారు. శ్రీకాకుళం మంత్రి ధర్మాన ప్రసాదరావు అయితే జిల్లాకు వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధి మరే ప్రభుత్వంలోనూ జరగలేదని అన్నారు. ఈసారి జగన్ సీఎం కావడం ఖాయమని ఆయన ధీమాగా చెబుతున్నారు. మొత్తం మీద మంత్రులు ఒక వైపు ధీమా వ్యక్తం చేస్తూంటే జగన్ కూడా అదే ధీమాతో ఉన్నారు. మరి కూటమికి జడిసే ప్రసక్తి లేదని వైసీపీ అంటోంది. వైసీపీని ఓడించే శక్తి ఏవరికీలేదు అంటోంది. చూడాలి మరి మంత్రుల అంచనాలకు ఫలితాలకు మధ్య ఏమి జరుగుతుందో.