ప‌థ‌కాలు-ప‌రేషాన్లు: కూట‌మి స‌ర్కారు.. స‌ర్క‌స్ ఫీట్లు..!

'తల్లికి వందనం' పథకానికి ఏడాది పాటు సమయం పడుతుందని శాసనమండలిలో మంత్రి నారా లోకేష్ చెప్పుకు రావడం విమర్శలకు దారి తీస్తోంది.

Update: 2024-07-25 07:30 GMT

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూట‌మి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేసే విషయంలో వెనకడుగు వేస్తోందా? అనేది చ‌ర్చ‌గా మారింది. అసలు ఎన్నికలకు ముందు కీలకమైన ప‌థ‌కాల‌ను సీఎం చంద్రబాబు ప్రకటించారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పింఛన్ పథకం తప్ప మిగిలిన వాటి విషయాన్ని ఆయన మర్చిపోయినట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇది రాష్ట్ర ప్రజలు నిశితంగా గమనిస్తున్నటువంటి విషయం. ఎందుకంటే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 15 రోజుల్లోనే పథకాలను అమలు చేశారు.

అదే సమయంలో కొన్ని పథకాలకు ఆయన నిర్దిష్ట గడువు విధించి ఆ గడుగులో అమలు చేశారు. జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి అమలు చేయకపోయినా, పథకాలకు సంబంధించి క్యాలెండర్ ఇచ్చారు. దాని ప్రకారమే పథకాలను అమలు చేశారు. కానీ ఇప్పుడు మాత్రం అసలు పథకాల గురించి ఎక్కడ కనిపించట్లేదు. వినిపించట్లేదు. 'తల్లికి వందనం' పథకానికి ఏడాది పాటు సమయం పడుతుందని శాసనమండలిలో మంత్రి నారా లోకేష్ చెప్పుకు రావడం విమర్శలకు దారి తీస్తోంది. నిజానికి ఎలాంటి నిబంధనలు లేకుండానే ఈ పథకాన్ని అమలు చేస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించాల్సి ఉంది.

ఎందుకంటే ఎన్నికలకు ముందు నిబంధనల విషయాలు గానీ ఆంక్షలు విషయాన్ని చంద్రబాబు ఎక్కడా ప్రస్తావించలేదు. ఈ రకంగా చూసుకున్నప్పుడు ఇప్పుడు ఆయా పథకాలను అమలు చేయడంలో ఎందుకు ఆల‌స్యం చేస్తున్నారు.. అనేది ప్రధాన అంశం. మరోవైపు రాష్ట్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది, అప్పులు చేశారు, ఖజానా ఖాళీ అయిపోయింది అని రోజుకో విధంగా చంద్రబాబు నాయుడు చెబుతుండడం.. దానికి అనుగుణంగా ప్రభుత్వ అనుకూల వర్గాల్లోనూ చర్చలు చేస్తుండడం తెలిసిందే.

వీటిని గమనిస్తే ప్రజలు తీవ్ర నిరాశలో కూరుకుపోయే పరిస్థితి ఏర్పడింది. ఖజానా ఖాళీగా ఉన్న విషయం ఎన్నికలకు ముందు చంద్రబాబుకు తెలిసిన విషయమే. ఇదే విషయాన్ని జగన్ మోహన్ రెడ్డి సైతం అంగీకరించారు. కూట‌మి పార్టీలు ఇస్తున్నట్టుగా తను హామీలు ఇవ్వ‌లేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి అంత ఆదాయం రావట్లేదని ఆయన నిశితంగా ఎన్నికలకు ముందే వివరించారు. దాని ప్రకారమే ఆయన మేనిఫెస్టోలో విడుదల చేశారు. వాస్తవానికి పింఛన్ 4000 రూపాయలకు పెంచాలని, అదేవిధంగా రైతులకు కనీసం లక్ష రూపాయలు చొప్పున రుణమాఫీ ప్రకటించాలని అప్పట్లో వైసీపీ నాయకులు జగన్ పై ఒత్తిడి చేశారు.

అయినా జగన్ ఎక్కడా వారి ఒత్తిడికి లొంగలేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని స్పష్టం చేశారు. ఫలితం గా ప్రజలు ఏకపక్షంగా కూట‌మి పార్టీలకు ముగ్గు చూపించారు. జగన్మోహన్ రెడ్డి పై సంపూర్ణ వ్యతిరేకత, జగన్మోహన్ రెడ్డి పాలనపై సంపూర్ణ వ్యతిరేకత ఉండి ఉంటే 11 సీట్లు కూడా వచ్చి ఉండేవి కావు. కానీ కూట‌మి పార్టీలు ఇచ్చిన హామీలు గ‌మ‌నిస్తే.. ముఖ్యంగా ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి 15 వేల రూపాయలు చొప్పున ఇస్తామన్నారు. అదేవిధంగా 20000 రూపాయలు చొప్పున రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామని చెప్పిన హామీ వంటివి ఎన్నికల్లో బాగా పనిచేశాయి.

ఇదే గ్రామీణ వర్గం ఓటు బ్యాంకు కూడా కూటమికి పడేలా చేసింది. ఇప్పుడు ఈ రెండు పథకాల విషయంలో కూడా ప్రభుత్వం స్పందించకపోవడం, తల్లికి వందనం పథకానికి ఏడాది పాటు సమయం పడుతుందని చెప్పేయడం వంటివి ప్రజల్లో వ్యతిరేక పెంచే అవకాశం ఉంద‌ని అంటున్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలు ఆలోచించుకునే పరిస్థితిని కల్పిస్తున్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని తీసుకుని స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని మేధావులు సైతం సూచిస్తున్నారు.

Tags:    

Similar News