ఆవేశానికి హద్దులు.. వైసీపీలో నేతల తర్జనభర్జన!
వైసీపీ అధిష్టానం సంచలన నిర్ణయం తీసుకుంటున్న నేపథ్యంలో నాయకులు కూడా మానసికంగా సిద్ధపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది.
కీలకమైన ఎన్నికల సమరం ముందు దాదాపు సగానికిపైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇంచార్జ్‌లను మారుస్తూ.. వైసీపీ అధిష్టానం సంచలన నిర్ణయం తీసుకుంటున్న నేపథ్యంలో నాయకులు కూడా మానసికంగా సిద్ధపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే.. విడతల వారీగా ఇస్తున్న ఈ షాకులు సహజంగానే నాయకులకు ఇబ్బందిగా మారాయి. ఇదే సమయంలో మార్పులకు సంబంధించి అధిష్టానం మాటలోనూ కొంత వాస్తవం ఉండే సరికి.. నాయకులకు తెలిసి వస్తోంది.
వాస్తవానికి.. తమదే ప్రాబల్యమని.. తమకు తిరుగులేదని అనుకున్న నాయకులు.. జనం నాడిని పట్టుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారనే వాదన ఉంది. అందుకే.. అంతర్గత కుమ్ములాటలు తెరమీదికి వచ్చా యి. సమన్వయం లేకుండా పోయింది. క్షేత్రస్థాయిలో కార్యకర్తలు కొన్నినియోజకవర్గాల్లో నాయకులకు ఎదురు తిరిగే పరిస్థితిని వారే కల్పించుకున్నారు. ఎక్కడికక్కడ.. నాయకులు గుత్తాధిపత్య ధోరణికి దిగారు. ఇలాంటి వారి విషయంలోనే ఇప్పుడు.. పార్టీ కీలక నిర్ణయాలు తీసుకుంది
ఇప్పుడు కొన్ని మాత్రమే తెరమీదికి వచ్చినా.. దాదాపు వచ్చే ఎన్నికల నాటికి 60కి పైగా నియోజకవర్గాల్లో మార్పులు తథ్యమనేది ఖాయంగా కనిపిస్తోంది. ఇక, ఈ మార్పుల వెనుక జగన్ కక్ష కట్టారనో.. ఎవరో చెప్పారనో అనుకునే పరిస్థితి లేదు. కేవలం ప్రజాభిప్రాయం.. జనాల నాడిని బేస్ చేసుకుని.. మార్పుల కు శ్రీకారం చుట్టారనేది ఇప్పుడిప్పడే... పార్టీలో చర్చ సాగుతోంది. నాయకులు కూడా ఆలోచన చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ముందు తొందరపడిన నాయకులు కూడా.. ఇప్పుడు చల్లబడుతున్నారు. అంతేకాదు.. అధిష్టానం తప్పులేదని.. మార్పు తప్పదని.. ప్రజల మధ్య గెలిస్తేనే.. మళ్లీ అధికారం దక్కుతుందని.. లేనిపోని పంతాలకు పోతే నష్టాలు తప్పవని.. నాయకులు తమలో తాము.. సమర్థించుకుని సర్దుబాటు ధోరణిలో ముందుకు సాగుతున్నారు. మొత్తానికి వైసీపీలో నాయకుల ఆవేశం నెమ్మది నెమ్మదిగా చల్లారుతుండడం గమనార్హం.