లడ్డూపై వివాదం... స్పందించిన ఏఆర్ డెయిరీ!
దీంతో... ఒక్కసారిగా ఈ విషయం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. రాజకీయ దుమారం రేపింది.
ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో.. ప్రసిద్ధి చెందిన తిరుపతి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడారని.. పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప నూనె మొదలైన వాటినీ ఉపయోగించారంటూ ఆరోపణలు తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని చంద్రబాబే స్వయంగా మిత్రపక్షాల మీటింగ్ లో చెప్పారు.
దీంతో... ఒక్కసారిగా ఈ విషయం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. రాజకీయ దుమారం రేపింది. ఈ సమయంలో... ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వం ఆలయ వైభవన్ని పునరుద్ధరిస్తుందని, పవిత్ర ప్రసాదాల నాణ్యతను కొనసాగిస్తుందని లోకేష్ హామీ ఇచ్చారు. ఈ వివాదం తారాస్థాయికి చేరుకుంటున్న వేళ ఏఆర్ డెయిరీ స్పందించింది.
అవును... తిరుమల లడ్డూ ప్రసాదానికి ఉపయోగించే నెయ్యి విషయంలో తీవ్ర వివాదం జరుగుతున్న వేళ ఏఆర్ డెయిరీ స్పందించింది. ఇందులో భాగంగా... ఈ విషయం జూన్, జూలైలోనే వెలుగులోకి వచ్చిందని తెలిపింది. అయితే తాము సరఫరా చేసే నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదని వెల్లడించింది.
తాము ప్రస్తిద్ధ ఎన్.ఏ.పీ.ఎల్. ల్యాబ్ లో పరీక్షించి.. అగ్మార్క్ ద్వారా అధికారికంగా ధృవీకరించబడిన తర్వాత మాత్రమే నెయ్యి ట్యాంకర్లను పంపుతున్నట్లు తెలిపింది. అయితే.. కొంతమంది ఈ వ్యవహారాన్ని కావాలనే రాజకీయం చేస్తున్నారని చెప్పుకొచ్చింది. ఇదే సమయంలో తాజాగా విడుదలైన నివేదికలో ఇతర కారణాలనూ ప్రస్థావించినట్లు తెలిపింది.
ఇందులో భాగంగా... తాజాగా విడుదలైన నివేదికలో పశుగ్రాసం లేదా జంతువుల ఔషదం వల్ల కూడా ఇది జరగవచ్చు అని.. ఆ ల్యాబ్ రిపోర్ట్ ను జాగ్రత్తగా చదవాలని తెలిపింది. ఆ రిపోర్ట్ లో ఎక్కడా తమ సంస్థ పేరు లేదని స్పష్టం చేసింది! ఇదే సమయంలో తాజాగా విడుదలైన నివేదికను సవాల్ చేసినట్లు తెలిపింది!
మరోపక్క ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలంటూ వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది! ఈ మేరకు టీటీడీ మాజీ ఛైర్మన్, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి హైకోర్టులో పిల్ వేశారని అంటున్నారు. వచ్చే బుధవారం ఈ కేసు గురించి హైకోర్టులో విచారణ జరగనుందని తెలుస్తోంది.