నిన్న రాజస్థాన్ సీఎం సన్.. ఎల్లుండు ఢిల్లీ సీఎం!
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తాజాగా ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసు ఎంత హాట్ టాపిక్ గా మారిందో.. దేశవ్యాప్తంగా ఢిల్లీ మద్యం కుంభకోణం అదేస్థాయిలో చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. పైగా ఈ లిక్కర్ స్కాం లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజాప్రతినిధుల పేర్లు ప్రముఖంగా వినిపించడంతో... సౌత్ గ్రూప్ పేరు హాట్ టాపిక్ గా మారడంతో.. ఈ స్కాం కేసుపై తీవ్ర చర్చ నడిచింది. ఈ సమయంలో సోమవారం ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది.
అవును... దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తాజాగా ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా... ఈ కేసు దర్యాప్తులో భాగంగా తమ ఎదుట హాజరు కావాలంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు సమన్లు జారీ చేశారు. దీంతో నవంబరు 2న న ఢిల్లీ సీఎం ఈడీ ముందు హాజరవ్వనున్నారని తెలుస్తుంది.
ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్‌ఏ) నిబంధనల కింద ఈ నోటీసులు ఇచ్చినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. 2021-22లో ఢిల్లీ మద్యం విధానం రూపొందించే క్రమంలో, దాని అమలు సమయంలో ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ ను నిందితులు సంప్రదించారని ఈడీ ఛార్జిషీటులో పేర్కొంది. దీనికి సంబంధించి కేజ్రీవాల్ ను దర్యాప్తు సంస్థ ప్రశ్నించి, ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేయనుంది.
అయితే ఇదే కేసులో ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిన సంగతి తెలిసిందే. అలా నిరాకరించిన కొన్ని గంటల వ్యవధిలోనే సీఎం కేజ్రీవాల్ కు ఈడీ సమన్లు జారీ చేయడం చర్చనీయాంశం అవుతుంది. ఇప్పటికే... మద్యం డీలర్లకు భారీ ప్రయోజనం కలిగించేలా కొత్త మద్యం పాలసీని రూపొందించారని, ఫలితంగా... వారి నుంచి భారీ మొత్తంలో కమీషన్లు పొందారని దర్యాప్తు సంస్థ అభియోగాలు మోపింది!
దీంతో ఆప్ ను నిర్మూలించేందుకే కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుందని ఆ పార్టీ నేతలు ధ్వజమెత్తారు. ఇందులో భాగంగానే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పై బూటకపు కేసులు పెట్టి జైలుకు పంపించేందుకు ఈడీ సమన్లు జారీ చేసిందని ఢిలీ మంత్రి, ఆప్ సీనియర్ నేత సౌరభ్ భరద్వాజ్ విమర్శించారు. మరి.. 2వ తేదీన కేజ్రీవాల్ ఈడీ ముందు హాజరవుతారా లేదా అన్నది వేచి చూడాలి!
ఢిల్లీ ముఖ్యమంత్రి సంగతి అలా ఉంటే... రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ కుమారుడు వైభవ్ గహ్లోత్... ఈడీ విచారణకు హాజరయ్యారు. ఫారిన్ ఎక్స్ ఛేంజ్ మేనేజ్ మెంట్ యాక్ట్ (ఫెమా) నిబంధనల ఉల్లంఘన కేసులో ఆయనను ఈడీ విచారించింది. దీంతో... తనకూ, తన కుటుంబసభ్యులకు విదేశీ లావాదేవీలతో ఎటువంటి సంబంధం లేదని.. రాష్ట్రంలో ఎన్నికల తేదీని ప్రకటించిన తర్వాత తనకు సమన్లు ఇచ్చారని వైభవ్ ఫైరవుతున్నారు.
కాగా త్వరలో జరగబోయే ఐదురాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా రాజస్థాన్ లో నవంబర్ 25న ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే!