కేజ్రీవాలే 'కింగ్ పిన్‌': ఈడీ సంచ‌ల‌న అఫిడ‌విట్‌

ఈడీ అధికారులు అరెస్టు చేసిన అర‌వింద్ కేజ్రీవాల్‌.. తాజాగా స్పందించారు. ‘‘ఈ దేశానికి సేవ చేసేందుకు నా జీవితం అంకితం చేశా.

Update: 2024-03-23 04:09 GMT

మ‌ద్యం కుంభ‌కోణంలో గురువారం అరెస్టయిన‌.. ఢిల్లీ ముఖ్య‌మంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు ఈ కేసుతో సంబంధమే లేద‌న్న ఈడీ.. ఇప్పుడు గ‌ళం స‌వ‌రించుకుంది. అస‌లు మ‌ద్యం కుంభ‌కోణానికి క‌ర్త‌-క‌ర్మ‌-క్రియ‌(కింగ్‌పిన్‌) ఆయ‌నేన‌ని తేల్చి చెప్పింది. ఈ మేర‌కు తాజాగా అఫిడవిట్‌ను దాఖ‌లు చేసింది. ‘సౌత్ గ్రూప్’ సంస్థకు, నిందితులకు మధ్య ఆయన మధ్యవర్తిగా వ్యవహరించారని పేర్కొంది. మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో భారీ భద్రత నడుమ ఈడీ అధికారులు ఆయన్ను దిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు. 10 రోజుల రిమాండ్ కోరారు.

‘‘మద్యం కుంభకోణంలో అరవింద్ కేజ్రీవాల్ కింగ్‌పిన్‌. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పన, అమలుకు ‘సౌత్ గ్రూప్’ సంస్థ నుంచి రూ.కోట్ల ముడుపులు అందుకున్నారు. పంజాబ్ ఎన్నికల కోసం ఆ సంస్థకు చెందిన కొందరు నిందితుల నుంచి రూ.100 కోట్లు డిమాండ్ చేశారు. రూ.45 కోట్ల ముడుపులను గోవా ఎన్నికల్లో ఉపయోగించారు. అవి నాలుగు హవాలా మార్గాల నుంచి వచ్చాయి’’ అని ఈడీ తరఫు న్యాయవాదులు వాదించారు. దీంతో ఈడీ వాద‌న‌లు సంచ‌ల‌నంగా మారాయి. ఈ మేర‌కు త‌న వాద‌న‌ల‌తో కూడిన అఫిడ‌విట్‌ను ఈడీ అధికారులు కోర్టుకు స‌మ‌ర్పించారు.

దేశ సేవకే అంకితం!

ఈడీ అధికారులు అరెస్టు చేసిన అర‌వింద్ కేజ్రీవాల్‌.. తాజాగా స్పందించారు. ‘‘ఈ దేశానికి సేవ చేసేందుకు నా జీవితం అంకితం చేశా. జైల్లో ఉన్నా బయట ఉన్నా అది కొనసాగిస్తా’’ అని కోర్టు హాలుకు వెళ్తూ ఆయన మీడియాకు చెప్పారు. మ‌రోవైపు.. ఈ కేసులో కేజ్రీవాల్‌కు రిమాండ్‌ విధించినా జైలు నుంచే పాలన కొనసాగిస్తారని ఇప్పటికే ఆప్‌ నేతలు వెల్లడించారు. ఈ పరిణామాల నేపథ్యంలో కేజ్రీవాల్‌పై ఢిల్లీ హైకోర్టులో మ‌రో పిటిషన్‌ దాఖలైంది. అయనను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని పిటిషనర్‌ కోరారు.

ఆయ‌నొక సిద్ధాంతం: ఆప్‌

కేజ్రీవాల్ అరెస్టుపై ఆమ్ ఆద్మీ పార్టీ కీల‌క నాయ‌కుడు, పంజాబ్ సీఎం భగవంత్‌ మాన్ స్పందించారు. ``కేజ్రీవాల్ వ్య‌క్తి కాదు..ఆయ‌నొక శ‌క్తి.. సిద్ధాంతం`` అని వ్యాఖ్యానించారు. ఆప్‌ శ్రేణులు ఆయన వెంటే ఉన్నాయని చెప్పారు. ఇదిలావుంటే ఢిల్లీలోని బీజేపీ కార్యాలయం ఎదుట ఆప్ నాయ‌కులు ఆందోళన చేపట్టారు. ఈ నిర‌స‌న‌లోనూ ముఖ్య‌మంత్రి మాన్ పాల్గొన్నారు.

Tags:    

Similar News