తెలంగాణ టీడీపీలో ‘అరవిందం’.. ఆయనే అధ్యక్షుడు.. పార్టీకీ మంచి రోజులు

ఏపీలో ఎంత బలంగా ఉందో చెప్పలేం కానీ.. తెలంగాణలో మాత్రం టీడీపీ ప్రజల గుండెల్లో ఉందని అంటారు.

Update: 2024-07-29 07:45 GMT

ఏపీలో ఎంత బలంగా ఉందో చెప్పలేం కానీ.. తెలంగాణలో మాత్రం టీడీపీ ప్రజల గుండెల్లో ఉందని అంటారు. దీనికి ఓ కారణం ఉంది. తెలంగాణలో అత్యధికంగా ఉన్న బీసీ జనాభాకు గుర్తింపును, పదవులను ఇచ్చింది తెలుగుదేశం పార్టీనే. ఎన్టీఆర్ తెలుగుదేశం స్థాపించి సీఎం అయ్యాకే బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాయి. దీంతో తెలంగాణలో బీసీలు తెలుగుదేశానికి ఎప్పటికీ అభిమానులుగానే ఉంటారు. జీహెచ్ఎంసీ సహా ఏ ఎన్నికల్లోనూ విస్మరించలేని పాత్ర టీడీపీది.

ఆరేళ్ల తర్వాత పునరుజ్జీవం..

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినా తెలంగాణలో టీడీపీకి బలం ఉందనేలా 2014, 2018 ఎన్నికల ఫలితాలు వచ్చాయి. అయితే, బీఆర్ఎస్ అనుసరించిన విధానాలతో క్రమంగా ఆ పార్టీ నాయకులను కోల్పోయింది. మరీ ముఖ్యంగా 2018 తర్వాత. అప్పటినుంచి తెలంగాణలో టీడీపీ ఎన్నికలకు దూరంగా ఉంటోంది. అయితే, ఇటీవల ఏపీలో చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ-జనసేన- బీజేపీ కూటమి ఘన విజయం సాధించడంతో తెలంగాణ తెలుగుదేశం పార్టీకి జీవం వచ్చింది. అంతేగాక.. ఇటీవల తెలంగాణ పర్యటనలో టీడీపీకి పూర్వ వైభవం తెస్తానని చంద్రబాబు ప్రకటించారు. దీంతో చంద్రబాడు కుమారుడు లోకేష్ సతీమణి బ్రాహ్మణికి తెలంగాణ టీడీపీ పగ్గాలు అప్పగిస్తారని జోరుగా ఊహాగానాలు వినిపించాయి. దీనికి చంద్రబాబు, లోకేష్, బ్రాహ్మణి తండ్రి బాలక్రిష్ణ లూ లు ఆమోదం తెలిపారన్న కథనాలు వచ్చాయి. కానీ, ఇవేమీకాకుండా వేరొక నాయకుడికి తెలంగాణ టీడీపీ పగ్గాలు దక్కనున్నాయి.

బీసీ నేత.. టీడీపీకి వీర విధేయుడు..

నాగం జనార్దన్ రెడ్డి నుంచి దేవేందర్ గౌడ్ వరకు తెలంగాణ టీడీపీలో ఎందరో నాయకులు వెళ్లిపోయారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు సహా ఇలాంటివారు ఎందరో. ఆఖరికి రావుల చంద్రశేఖర్ రెడ్డి కూడా ఇటీవల ఎన్నికల ముంగిట పార్టీ మారారు. కానీ, ఒక్క నాయకుడు మాత్రం పెద్ద పదవులు అనుభవించకున్నా టీడీపీని అన్ని కాలాల్లోనూ అంటిపెట్టుకుని ఉన్నారు. ఆయనే.. అరవింద్ కుమార్ గౌడ్. ఇప్పుడు ఆ విధేయతకు బహుమానం దక్కనుంది. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా బీసీ సామాజికవర్గానికి చెందిన అరవింద్ కుమార్ గౌడ్ కు పగ్గాలు అప్పగించాలని చంద్రబాబు నిర్ణయించినట్లు చెబుతున్నారు. రెండు రోజుల క్రితం అమరావతిలో తనను కలిసిన అరవింద్ కు సూచనప్రాయంగా అంగీకారం తెలిపినట్లు సమాచారం. అరవింద్ కుమార్ గౌడ్ ప్రస్తుతం టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు. ఆయన ఎవరో కాదు.. ఉమ్మడి ఏపీలో హోం మంత్రిగా పనిచేసిన తూళ్ల దేవేందర్ గౌడ్ కు స్వయానా మేనల్లుడు. అరవింద్ గతంలో అసిఫ్ నగర్ అసెంబ్లీ స్థానికి పోటీ చేసి ఓడిపోయారు. తెలంగాణలో టీడీపీని అందరూ వీడినా అరవింద్ మాత్రం చెక్కుచెదరకుండా ఉన్నారు.

మాటల మాంత్రికుడికి టీడీపీలో చోటు

తెలంగాణలో టీడీపీకి ఉన్న మరో మంచి నాయకుడు నన్నూరి నర్సిరెడ్డి. తనదైన శైలిలో అనర్గళంగా మాట్లాడే నర్సిరెడ్డి టీడీపీకి ఏపీ ఎన్నికల్లో ప్రచారం చేశారు. మహానాడులోనూ ఆయన ప్రసంగాలకు విపరీతమైన స్పందన ఉంటుంది. నన్నూరితో పాటు మరొకరికి టీటీడీ బోర్డు సభ్యులుగా అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది. టీటీడీపీ మాజీ అధ్యక్షుడు బక్కని నర్సింహులు, మాజీ మంత్రి కాట్రగడ్డ ప్రసూన, కూకట్ పల్లి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన నందమూరి సుహాసినిలకూ కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. ఏపీలో అధికారంలోకి రావడం తెలంగాణ టీడీపీకి మంచి రోజులను తెచ్చింది.

Tags:    

Similar News