కౌశిక్ రెడ్డి ఇంటికి అరికెపూడి గాంధీ.. హైదరాబాద్‌లో టెన్షన్.. టెన్షన్

తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా హాట్‌హాట్‌గా మారిపోయాయి.

Update: 2024-09-12 07:40 GMT

తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా హాట్‌హాట్‌గా మారిపోయాయి. ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య నెలకొన్ని వివాదం తీవ్ర రచ్చకు దారితీసింది. ఒకరిపై మరొకరు బహిరంగ సవాళ్ల వరకూ వెళ్లారు. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో ఈ ఇద్దరి వివాదం ఒక్కసారిగా తీవ్ర చర్చకు దారితీసింది. ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ మధ్య ఈ వివాదం కొనసాగుతోంది.

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి స్పీకర్‌కు గతంలో ఫిర్యాదు చేశారు. అక్కడి నుంచి స్పందన లేకపోవడంతో కోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు. దాంతో ఈ మధ్య హైకోర్టు విచారణ చేపట్టి నాలుగు వారాల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో నిర్ణయం తీసుకోవాలంటూ హైకోర్టుకు స్పీకర్ కార్యాలయానికి ఆదేశాలు జారీ చేసింది.

కట్ చేస్తే.. ఇదే క్రమంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన అరికెపూడి గాంధీకి ప్రభుత్వం పీఏసీ చైర్మన్ పదవిని కట్టబెట్టింది.ఆయన గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. అయితే.. గాంధీ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారని అప్పట్లో ప్రచారం జరిగింది. ఈ వివాదంపై కౌశిక్ రెడ్డి నిన్న ప్రెస్‌మీట్‌ పెట్టి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అరికెపూడి గాంధీ ఇంటికి వెళ్లి బీఆర్ఎస్ కండువా కంప్పుతానని హాట్ కామెంట్స్ చేశారు. ఆయన ఇంట్లోన గులాబీ కండువా కప్పి ఇంటి ముందే పార్టీ జెండా ఎగురవేస్తానంటూ సవాల్ చేశారు.

దీనికి రియాక్షన్‌గా అరికెపూడి గాంధీ కౌంటర్ అటాక్ చేశారు. దమ్ముంటే తన ఇంటికి రావాలని.. లేని పక్షంలో తానే కౌశిక్ రెడ్డి ఇంటికి వస్తాను అంటూ ప్రతిసవాల్ చేశారు. ‘నీ దమ్ము ఏందో.. నా దమ్ము ఏందో తేల్చుకుందాం’ అంటూ అటాక్ చేశారు. దీంతో అటు కౌశిక్ రెడ్డి, ఇటు అరికెపూడి గాంధీ ఇళ్ల వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది.

అరికెపూడి గాంధీ ఇంటికి కౌశిక్ రెడ్డి రాకపోవడంతో.. గాంధీ తన అనుచరులతో కలిసి కౌశిక్ రెడ్డి ఇంటికి బయలుదేరారు. పెద్ద ఎత్తున కాన్వాయితో మద్దతుదారులతో గాంధీ కొడాపూర్‌లోని కౌశిక్ రెడ్డి ఇంటికి బయలుదేరడంతో ఏం జరగబోతోందా అన్న ఉత్కంఠ కనిపిస్తోంది.

Tags:    

Similar News