ప్రిపేర్ కాకుంటే ఎలా? సిల్క్ కేసులో అర్ణాబ్ క్వశ్చన్లు.. నీళ్లు నమిలిన ఎమ్మెల్యే!

సంచలనం.. అంతకు మించిన షాకింగ్ గా మారిన ఒక ముఖ్యమైన కేసుకు సంబంధించి మాట్లాడేందుకు పార్టీ తరఫున వెళ్లే వ్యక్తి ఎంతలా ప్రిపేర్ కావాలి

Update: 2023-09-13 05:00 GMT

సంచలనం.. అంతకు మించిన షాకింగ్ గా మారిన ఒక ముఖ్యమైన కేసుకు సంబంధించి మాట్లాడేందుకు పార్టీ తరఫున వెళ్లే వ్యక్తి ఎంతలా ప్రిపేర్ కావాలి. అలాంటిదేమీ లేకుండా ఆవేశంతో చర్చకు వెళితే.. ఇలాంటి అనుభవమే ఎదురవుతుంది. స్కిల్ ట్రైనింగ్ కేంద్రాలకు సంబంధించిన కేసులో ఏపీ విపక్ష నేత చంద్రబాబు అరెస్టు కావటం తెలిసిందే. దీనికి సంబంధించిన బోలెడన్ని ప్రశ్నలు తెర మీదకు వస్తున్నాయి. వీటికి సంబంధించిన సమాధానాల్ని తెలుగుదేశం పార్టీకి చెందిన వారు సమాధానాలు చెప్పలేక కిందా మీదా పడుతున్నారన్న విమర్శ ఉంది. ఇప్పటివరకు చోటు చేసుకున్న పరిణామాల్ని చూసినప్పుడు.. అధికార వైసీపీకి చెందిన నేతలు స్పష్టమైన విధానాన్నిఅనుసరిస్తున్నారు.

ఇలాంటివేళ.. ఒక ప్రముఖ జాతీయ చానల్ లో జరిగే చర్చా కార్యక్రమానికి వెళ్లిన వైసీపీ ఎమ్మెల్యే తీరును పలువురు తప్పు పడుతున్నారు. స్కిల్ కేసుకు సంబంధించిన ప్రముఖ జర్నలిస్టు అర్ణాబ్ గోస్వామి నిర్వహించిన చర్చకు హాజరైన నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే రవిచంద్ర కిశోర్ రెడ్డి తీరును పలువురు తప్పు పడుతున్నారు. ప్రశ్నలు సూటిగా ఉన్నప్పుడు.. అంతే సూటిగా సమాధానాలు ఇవ్వకుంటే తేలిపోవటం ఖాయం. ఒకవేళ అనూహ్యమైన ప్రశ్నలు ఎదురైనప్పుడు.. వాటికి సమాధానాలు చెప్పలేని వేళలో.. కనీసం కవర్ చేసేలా అయినా చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ.. అలాంటిదేమీ చేయని తీరు ఇప్పుడు చర్చగా మారింది.

రిపబ్లికన్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్ణబ్ గోస్వామి నిర్వహించిన చర్చా కార్యక్రమంలో నైపుణ్య శిక్షణ కేంద్రాలకు సంబంధించి సంధించిన ప్రశ్నలు ఇలా ఉన్నాయి.

- స్కిల్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు సీమెన్స్ సంస్థ లంచం ఇచ్చినట్లుగా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా?

- రాష్ట్ర ప్రభుత్వం రూ.371 కోట్లు ఖర్చు చేసిందని.. 90 శాతం నిధులు వెచ్చించాల్సిన సీమెన్స్ ఒక్క రూపాయి కూడా పెట్టలేదని మీరు అంటుననారు. ఈ కేసులో ఆర్థికపరమైన లావాదేవీలు జరిగినట్లుగా మీ దగ్గర ఆధారాలు ఏమున్నాయి?

- సీమెన్స్ నుంచి చంద్రబాబు ఒక్క రూపాయి తీసుకున్నట్టుగా కూడా రిమాండ్ కాపీలో ఎందుకు లేదు?

- ఒకవేళ చంద్రబాబుకు సీమెన్స్ లంచం ఇచ్చిందన్న మీ ఆరోపణ నిజమైతే.. మీ దగ్గర ఆధారం ఉందా? లాంటి ప్రశ్నల్ని సంధించారు. దీనికి చర్చలో పాల్గొన్న నంద్యాల ఎమ్మెల్యే రవిచంద్ర కిశోర్ రెడ్డి సరైన సమాధానాలు చెప్పలేకపోయారు. ఆధారాలపై అదే పనిగా ప్రశ్నించిన అర్ణబ్ ప్రశ్నలకు బదులిచ్చే క్రమంలో.. 'అదే సీఐడీ చూస్తోంది. దాన్నే నిరూపించాలని అనుకుంటుంది. దాని కోసమే విచారణ సాగుతోంది. చంద్రబాబు సహకరించటం లేదు' అంటూ అతకని సమాధానాలు చెప్పిన వైనంతో చర్చలో వీక్ గా కనిపించారు.

సిల్క్ కేంద్రాల విషయంలో చంద్రబాబు కేబినెట్ లో ఎజెండా లేకుండా చివరి నిమిషంలో పెట్టి ఆమోదించారని.. అంత హడావుడిగా చేయాల్సిన అవసరం ఏమిటి? అని ప్రశ్నించిన నంద్యాల ఎమ్మెల్యే వ్యాఖ్యలకు అర్ణబ్ స్పందిస్తూ.. ''హడావుడి నిర్ణయం అంటే మీ పార్టీకి చెందిన సభ్యులకు సంబంధం ఉందని ఆరోపణలు ఉన్న మద్యం స్కాంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నిర్ణయం తీసుకున్నట్టా? అక్కడ కూడా ఆయన అంతే హడావుడిగా నిర్ణయం తీసుకున్నారు' అంటూ ప్రశ్నించారు. దీనికి రవిచంద్ర సమాధానం ఇస్తూ.. ఆ స్కాం గురించి తనకు అంతగా తెలీదన్న వైనం చూసినప్పుడు.. సరిగా ప్రిపేర్ కాకుండా వెళితే ఇలానే ఉంటుందన్న మాట బలంగా వినిపిస్తోంది.

Tags:    

Similar News