మహిళా ఉద్యోగులకు ఏఐ శాపంగా మారనుందా?
ఏఐతో మహిళల ఉద్యోగాలకే అధికంగా ప్రమాదం ఉందని తాజాగా అమెరికాలో జరిగిన ఓ అధ్యయనంలో తేలింది
సాంకేతిక విప్లవం కృత్రిమ మేధ సాంకేతికతతో (ఏఐ) ఉద్యోగాల్లో కోత తప్పదన్న భయాందోళనలు సర్వత్రా వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చాట్ జీపీటీ రూపకర్త, ఓపెన్ ఏఐ సంస్థ సీఈఓ ఆల్ట్ మన్.. ఏఐ వల్ల ఉద్యోగాలు మాయం అవుతాయని అంగీకరించారు. అయితే ఈ విషయంలో మహిళలలే ఎక్కువ సమస్య అని తెలుస్తోంది.
అవును... ఆర్టిఫిషియల్ ఇంటిజిలెన్స్ వల్ల ఉద్యోగాలు తగ్గుతాయని అంటున్న నేపథ్యంలో... ఏఐతో మహిళల ఉద్యోగాలకే అధికంగా ప్రమాదం ఉందని తాజాగా అమెరికాలో జరిగిన ఓ అధ్యయనంలో తేలింది. 2030 నాటికల్లా మహిళలకు పరిమితమైన చిన్న చిన్న ఉద్యోగాల్లో మెజారిటీ ఏఐతో భర్తీ చేస్తారని జోస్యం చెప్పింది.
ఇందులో భాగంగా.. సంప్రదాయకంగా అత్యధిక శాతం మహిళలే నిర్వహించే సేల్స్ పర్సన్స్, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్స్, కాషియర్స్ వంటి ఉద్యోగాల్లోని బాధ్యతలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత సులువుగా చేసేస్తుందని అంటున్నారు. ఈ మేరకు మెకిన్సీ గ్లోబల్ ఇన్ స్టిట్యూట్ తన అధ్యయనంలో తేల్చింది.
ఇదే సమయంలో ప్రస్తుతం మహిళల కంటే పురుష ఉద్యోగులే అధికంగా ఉనప్పటికీ.. స్థూలంగా చూస్తే పురుషులకంటే మహిళలే 21 శాతం అధికంగా ఉద్యోగాలు కోల్పోతారని.. అమెరికాలో వారిపై పెను ప్రభావం పడుతుందని ఆ అధ్యయనం హెచ్చరించింది.
అయితే ఈ సమస్యకు పరిష్కారం కూడా చూపిస్తోంది తాజా అధ్యయనం. దీని ప్రకారం... ఆయా సంస్థలు ఉద్యోగులను ఎంపిక చేసే విషయంలో సర్టిఫికేట్ల కంటే నైపుణ్యాల అధారంగా ఎంపిక చేసుకోవాలని నివేదిక తేల్చింది.
ఇదే సమయంలో గ్రామీణ ప్రాంతాల వారు, వికలాంగులు, నిర్లక్ష్యానికి గురైన ఇతర వర్గాలకు తగిన శిక్షణ ఇచ్చి పనుల్లోకి తీసుకోవడంపై దృష్టి సారించాలని పేర్కొంది.
ఇలాంటి చర్యలకు ఉపక్రమించిన నేపథ్యంలో మహిళా ఉద్యోగులపై ఏఐ ప్రభావాన్ని కొంత మేర తగ్గించవచ్చని ఈ అధ్యయనం సూచించింది. ఉద్యోగాల్లో రాబోయే మార్పులను ఎదుర్కొనేందుకు స్త్రీపురుషులు కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలని.. ఏఐ తో పాటు ఇతర నూతన ట్రెండ్స్ ద్వారా వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించింది.