కేజ్రీ ఇక బయటకు.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ కేసులోనూ బెయిల్

ఇప్పుడు ఆ కేసులోనూ బెయిల్ దక్కింది. దీంతో తిహాడ్‌ జైలు నుంచి వచ్చి ఢిల్లీ సీఎం కుర్చీలో కూర్చోనున్నారు.

Update: 2024-09-13 06:06 GMT

హమ్మయ్య.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్వేచ్ఛా వాయువులు పీల్చుకోనున్నారు. గత ఆరు నెలలుగా మధ్యలో రెండు వారాలు తప్ప తిహాడ్ జైలు గోడలకు పరిమితమైన ఆయన ఎట్టకేలకు బయటకు రానున్నారు. ఢిల్లీ మద్యం విధానం కేసులో ఆయనకు భారీ ఊరట దక్కనుంది. వాస్తవానికి కేజ్రీకి అటుఇటుగా రెండు నెలల కిందటే రెగ్యులర్ బెయిల్ వచ్చింది. కానీ, అది ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసులో.. ఇక రేపు బయటకు రానున్నారు అని అనుకుంటుండగా.. ఆప్ శ్రేణులు సంబరాలు చేసుకుంటుండగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) రంగంలోకి దిగింది. తాము నమోదు చేసిన కేసు సంగతి ఏమంటూ కోర్టును ఆశ్రయించింది. దీంతో అప్పుడు కేజ్రీ విడుదల నిలిచిపోయింది. ఇప్పుడు ఆ కేసులోనూ బెయిల్ దక్కింది. దీంతో తిహాడ్‌ జైలు నుంచి వచ్చి ఢిల్లీ సీఎం కుర్చీలో కూర్చోనున్నారు.

కవితతో పాటు ఒకరివెంట ఒకరికి తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సహా ఢిల్లీ మద్యం కేసులో నిందితులు ఒకరి వెంట ఒకరికి బెయిల్ లభిస్తోంది. ఈ క్రమంలో కేజ్రీకీ దక్కింది. కాగా, ఈ కేసులో నగదు అక్రమ చలామణీ కింద మద్యం వ్యాపారి సమీర్ మహేంద్ర, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) వాలంటీర్ చన్‌ప్రీత్ సింగ్‌ ఢిల్లీ హైకోర్టు మూడు రోజుల కిందట బెయిల్ ఇచ్చింది. అంతకుముందు ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, విజయ్ నాయర్ బయటకు వచ్చారు. వాస్తవానికి కవిత, కేజ్రీ తర్వాత ఏప్రిల్ 12న చన్ ప్రీత్ ను ఈడీ అరెస్టు చేసింది. గోవా ఎన్నికల్లో అతడు ఆప్ మనీ మేనేజ్ మెంట్ ను చూశాడని.. ఇది సౌత్ గ్రూప్ నుంచి చేరినదేనని ఈడీ ఆరోపించింది. సమీర్ ను 2022 సెప్టెంబర్ 28నే అరెస్టు చేసింది. హైదరాబాద్ కు చెందిన వ్యాపారి అరుణ్‌ రామచంద్ర పిళ్లైని కవితను అరెస్టు చేసిన సమయంలోనే అరెస్టు చేశారు. వీరందరికీ ఇటీవలి కాలంలో బెయిల్ వచ్చింది. ఇప్పుడు కేజ్రీకీ లభించింది.

హరియాణా ఎన్నికల ప్రచారంలోకి..

ఆప్ ఇప్పటికే ఢిల్లీ, పంజాబ్ లో అధికారంలో ఉంది. హరియాణాలోనూ ఈ పార్టీ ప్రభావం కచ్చితంగా ఉంటుంది. 90 స్థానాలున్న ఈ రాష్ట్రంలో ఆప్.. కాంగ్రెస్ తో పొత్తు కుదుర్చుకోలేదు. ఇప్పటికే 20 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మరోవైపు కేజ్రీవాల్ హరియాణా ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. దీంతో ఆప్ మరింత గట్టి పోటీ ఇవ్వగలదు. హరియాణలో పదేళ్లుగా బీజేపీనే అధికారంలో ఉంది. ఇప్పుడు ఆ పార్టీ ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. కాంగ్రెస్ కు సానుకూల పవనాలు కనిపిస్తున్నాయి. రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, బజరంగ్ పూనియా వంటివారి మద్దతు, రైతుల అండతో కాంగ్రెస్ కు పైచేయి కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో ఆప్ నేరుగా పోటీ చేయడం ఎవరి అవకాశాలను దెబ్బతీస్తుందో చూడాలి.

Tags:    

Similar News