కేజ్రీ సంచలన నిర్ణయం.. రెండ్రోజుల్లో రాజీనామా

సీఎం హోదాలో ఉంటూ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి ఆరు నెలలు జైల్లో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.

Update: 2024-09-15 08:08 GMT

సీఎం హోదాలో ఉంటూ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి ఆరు నెలలు జైల్లో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఎవరూ అనుకోని విధంగా.. జైల్లో ఉంటూనే సీఎంగా కొనసాగిన ఆయన బెయిల్ పై వచ్చిన రెండు రోజుల్లో సంచలన ప్రకటన చేశారు. బెయిల్ కోసం చాలా ప్రయత్నాలు చేసి ఆఖరికి బయటకు వచ్చిన కేజ్రీ.. సీఎంగా మరో నాలుగు నెలలు టర్మ్ ఉండగానే పదవి నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నారు.

నిర్దోషిగా నిరూపణ అయ్యేవరకు..

మద్యం కేసులో కేజ్రీని.. ఈ ఏడాది మార్చి నెలలో ఈడీ అరెస్టు చేసింది. తొమ్మిదిసార్లు సమన్లు ఇచ్చినా స్పందించకపోవడంతో అదుపులోకి తీసుకుంది. అప్పటినుంచి తిహాడ్ జైలులో ఉన్న ఆయన మే నెలలో తాత్కాలిక బెయిల్ పై విడుదలయ్యారు. జూలైలో ఈడీ కేసులో బెయిల్ వచ్చి.. విడుదల అవుతారని భావిస్తుండగా సీబీఐ ఎంటరై అరెస్టు చేసింది. మళ్లీ బెయిల్ ప్రయత్నాలు విఫలమవుతూ రాగా.. ఎట్టకేలకు మొన్న శుక్రవారం ఉపశమనం దక్కింది. అయితే, ఇంతలోనూ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. రెండు రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. నిర్దోషిగా నిరూపించుకునే దాక పదవిలో కొనసాగనని స్పష్టం చేశారు. ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం కార్యకర్తలతో కేజ్రీ సమావేశమయ్యారు.

మిగతావారూ త్వరలో బయటకు

జైలుకు పంపి తనను దెబ్బకొట్టాలని ప్రయత్నించినా.. జైలులో తన మనోధైర్యం వందరెట్లు పెరిగిందని బెయిల్ నుంచి బయటకు వచ్చాక కేజ్రీ వ్యాఖ్యానించారు. తాజాగా మాట్లాడుతూ భగవంతుడు ఇచ్చిన ధైర్యంతో శత్రువులతో పోరాడతామని చెప్పారు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడే ముందుకునడిపించాడని పేర్కొన్నారు. సత్యేందర్ జైన్, అమానతుల్లా ఖాన్ జైల్లోనే ఉన్నారని.. త్వరలోనే వారు బయటకు వస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు.

Tags:    

Similar News