మోడీ, టీటీడీపై ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మరోసారి వార్తల్లో నిలిచారు. తిరుమల తిరుపతి దేవస్థానం, వక్ఫ్ బోర్డులపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మరోసారి వార్తల్లో నిలిచారు. తిరుమల తిరుపతి దేవస్థానం, వక్ఫ్ బోర్డులపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పైనా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా ముస్లిం, నాన్ ముస్లిం అంటూ ఆయన కామెంట్స్ చేశారు. టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు చేసిన కామెంట్స్‌పై ఒవైసీ ట్వీట్ ద్వారా స్పందించారు.
వక్ఫ్ బోర్డులో నాన్ ముస్లింలను సైతం సభ్యులుగా చేర్చాలని ప్రధాని నరేంద్ర మోడీ బిల్లు తెచ్చారని, మరి తిరుమల తిరుపతి దేశస్థానం బోర్డులో అందరూ హిందువులే ఉండాలని అనడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. హిందువులకు టీటీడీ ఎంత పవిత్రమో.. ముస్లింలకు వక్ఫ్ బోర్డు కూడా అంతే కదా అని నిలదీశారు. అలాంటి చోట ఇతరులను ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు.
‘ప్రధాని మోడీ ఏదైతే వక్ఫ్ బోర్డు బిల్లు తెచ్చారో.. అది కేవలం వక్ఫ్ బోర్డును కాపాడేందుకు తీసుకురాలేదు. వక్ఫ్‌ని కాపాడేందుకు కాదు దానిని లూటీ చేసేందుకు తీసుకొచ్చారు’ అని సెన్సేషనల్ వ్యాఖ్యలు చేశారు. వక్ఫ్ భూములకు యజమాని అల్లా అయితే.. ఆ భూములకు యజమాని కలెక్టర్, తాను అని మోడీ అంటున్నారని ఎద్దేవా చేశారు. టీటీడీ బోర్డులో హిందువులు ఉండాలనేది వందశాతం కరెక్ట్. అలాగే.. వక్ఫ్ బోర్డులోనూ వందశాతం ముస్లింలే ఉండాలని సమన్యాయం. టీటీడీకి మద్దతు తెలిపిన మీరు వక్ఫ్ బోర్డు విషయంలో ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారని నిలదీశారు.
కొత్తగా బాధ్యతలు స్వీకరించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మాట్లాడుతూ.. టీటీడీలో పనిచేసే వారంతా హిందువులే అయి ఉండాలన్నారు. ఈ వ్యాఖ్యలకు కౌంటర్‌గా ఒవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ప్రధానిని టార్గెట్ చేస్తూ ఆయన మాట్లాడారు. వక్ఫఓ బోర్డులు, కౌన్సిళ్లలో ముస్లింయేతరులను తీసుకొచ్చేందుకు ఎన్టీయే ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. దీనికి బీఆర్ నాయుడు చేసిన వ్యాఖ్యలతో ఒవైసీ ముడిపెట్టారు. అలాగే.. వక్ఫ్ బోర్డులో అవకతవకలపైనా ఒవైసీ స్పందించారు. ఆలయ బోర్డులు, దేవాదాయ శాఖలోనూ అవకతవకలు జరుగుతున్నాయని ఆయన బదులిచ్చారు.