''రాహుల్‌కు 50 ఏళ్లు నిండాయి.. ఒంటరి తనాన్ని అనుభవిస్తున్నారు.. ఏదైనా..''
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నాయకుల మాటలు సంచలనాలకు వేదికగా మారుతున్నాయి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నాయకుల మాటలు సంచలనాలకు వేదికగా మారుతున్నాయి. అధికార బీఆర్ ఎస్, ఆ పార్టీ మిత్రపక్షం ఎంఐఎం..ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని ఉద్దేశించి.. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ''రాహుల్‌కు 50 ఏళ్లు నిండాయి.. ఒంటరి తనాన్ని అనుభవిస్తున్నారు.. రాహుల్‌ను ఒంటరితనం తినేస్తోంది. ఈ ఒంటరితనాన్ని అధిగమించాలంటే రాహుల్ చికిత్స చేయించుకోవాలి. హైదరాబాద్‌లో చాలా మంది మంచి వైద్యులున్నారు. ఎవరి దగ్గరకు వెళ్లాలో నేను చెబుతాను. రాహుల్ అక్కడికి వెళ్లి చికిత్స చేయించుకోవచ్చు'' అని కామెంట్ చేశారు.
రీజనేంటి?
ప్రస్తుత తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ ఎస్, ఎంఐఎం, బీజేపీ మూడూ ఒక్కటేనని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ కూడా ఇదే విమర్శలు చేస్తున్నారు. ఎంఐఎం.. బీఆర్ ఎస్ పార్టీకి బీ-టీం అని వ్యాఖ్యానించారు. ఈ విమర్శలపైనే ఓవైసీ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అదేసమయంలో రాహుల్‌కు అనేక ప్రశ్నలు సంధించారు.
ఓవైసీ ఏమన్నారంటే..
''రాహుల్ గాంధీకి 50 ఏళ్ల వయసు దాటింది. ఇప్పుడాయన ఒంటరితనంతో బాధపడుతున్నారు. ఆయన వెంటనే చికిత్స చేసుకోవాల్సిన అవసరం ఉంది. నాకు తెలిసిన మండి డాక్టర్లు ఉన్నారు. వారికి చూపిస్తా'' అని ఓవైసీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక, ఇదేసమయంలో పలు అంశాలపైనా రాహుల్‌ను ఆయన నిలదీశారు.
+ మైనారిటీల గురించి రాహుల్ ఎందుకు మాట్లాడరు.
+ ఆర్టికల్ 370 రద్దుపై రాహుల్ ఎందుకు మాట్లాడరు?
+ ట్రిపుల్ తలాక్ పై ఎందుకు మాట్లాడరు?
+ దేశవ్యాప్తంగా ముస్లింలపై మూకుమ్మడి హత్యలు జరుగుతున్నాయి, దానిపై ఎందుకు మాట్లాడరు?
+ ముస్లిం రిజర్వేషన్లపై ఎందుకు మాట్లాడరు.
+ ఈ విషయాలపై మాట్లాడేందుకు రాహుల్ ఎందుకు భయపడుతున్నారు?
''ప్రతి హింసాకాండను రాహుల్ గాంధీ ఖండిస్తారు. అయితే కాంగ్రెస్ పాలిత రాజస్థాన్‌లో జునైద్, నసీర్ హత్యకు గురైనప్పుడు అక్కడికి ఎందుకు వెళ్లలేదు. ఎందుకు ఖండించలేదు. రాహుల్ నిజానికి సాఫ్ట్ హిందుత్వాన్ని అనుసరించడం లేదు. హిందుత్వ భావజాలాన్ని అనుసరిస్తున్నారు'' అని ఓవైసీ మండిపడ్డారు.