తమిళనాడు గవర్నర్ గా రాజు గారు ?
సుప్రీం కోర్టు దాకా తమిళనాడు గవర్నర్ వివాదం నడిచింది. దాంతో దేశ అత్యున్నత న్యాయ స్థానం కీలక తీర్పు ఇచ్చింది.;

సుప్రీం కోర్టు దాకా తమిళనాడు గవర్నర్ వివాదం నడిచింది. దాంతో దేశ అత్యున్నత న్యాయ స్థానం కీలక తీర్పు ఇచ్చింది. గవర్నర్ వద్ద పెండింగులో బిల్లులు ఉంచడం మీద కచ్చితమైన ఆదేశాలు ఇచ్చింది. రెండోసారి అదే బిల్లు ప్రభుత్వం పంపిస్తే ఆమోదించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఇక దాని మీద కూడా నిర్ణీత కాల పరిమితిని విధించింది.
ఈ మొత్తం ఎపిసోడ్ లో తమిళనాడు గవర్నర్ ఆర్ ఎన్ రవి ఇబ్బందులలో పడ్డారు. అక్కడ స్టాలిన్ వర్సెస్ రాజ్ భవన్ గా కొన్నాళ్ళుగా నడుస్తోంది. ఎట్టకేలకు సుప్రీంకోర్టు జోక్యంతో ఒకేసారి పది బిల్లులు గవర్నర్ అముమతి లేకుండా ఆమోదం పొందాయి. ఈ క్రమంలో రవి విషయంలో కేంద్రం కూడా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం పడింది అని అంటున్నారు.
ఇక రవి తమిళనాడుకు 15వ గవర్నర్ గా 2021 సెప్టెంబర్ 18న బాధ్యతలు స్వీకరించారు. ఆయన పదవీకాలం 2026 దాకా ఉంది. అయితే దేశంలో కొన్ని చోట్ల గవర్నర్ల పదవీ కాలం మరి కొద్ది కాలంలో ముగుస్తోంది అని అంటున్నారు. వాటితో పాటే తమిళనాడు గవర్నర్ ని మార్చాలని చూస్తున్నారు అని అంటున్నారు.
అలా చేయడం వల్ల తమిళనాడులో పూర్వ స్థితిని తేవచ్చు అని ఆలోచన చేస్తున్నారుట. ఇక అక్కడ ఆర్ఎస్ఎస్ వాసనలతో ఉన్న వారు గవర్నర్లు కాకుండా ఉంటేనే బెటర్ అని ఆలోచిస్తున్నారుట. అదే టైం లో 2026 లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ మనిషి అన్న ముద్ర లేకుండా రాజ్యాంగం పట్ల పూర్తి అంకితభావంతో వ్యవహరిస్తూ ఉండేవారికే చాన్స్ ఇవాలని అనుకుంటున్నారు.
అలా తమిళనాడు గవర్నర్ పదవిని మిత్ర పార్టీలకే ఇస్తారని చర్చ సాగుతోంది. ఈ క్రమంలో తెలుగుదేశం వైపు అందరి చూపు పడుతోంది. తెలుగుదేశం పార్టీకి గవర్నర్ పదవి ఒకటి ఇవ్వాలని బీజేపీ పెద్దలు ఆలోచిస్తున్నారు అన్నది చాలా కాలంగా ఉంది. ఇపుడు టీడీపీకి చెందిన వారికే ఈ కీలక రాష్ట్రంలో రాజ్ భవన్ పగ్గాలను అందిస్తారు అని అంటున్నారు.
దాంతో టీడీపీ నుంచి ఎవరు తమిళనాడు కొత్త గవర్నర్ అయ్యేది అన్న చర్చ మొదలైంది. ముఖ్యంగా ఇద్దరు పేర్లు అయితే టీడీపీలో గవర్నర్ పదవి కోసం నానుతున్నాయి. ఆ ఇద్దరూ టీడీపీలో సీనియర్ మోస్ట్ లీడర్లు. అందులో ఒకరు విజయనగరం జిల్లాకు చెందిన కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు. మరొకరు మాజీ మంత్రి యనమల రామక్రిష్ణుడు.
అయితే టీడీపీ పెద్దల మొగ్గు అశోక్ గజపతిరాజు మీదనే ఉంది అని అంటున్నారు. దాంతో ఆయనకే తొందరలో తమిళనాడు గవర్నర్ సింహాసనం దక్కుతుందని ప్రచారం అయితే సాగుతోంది. ఇక ప్రధాని నరేంద్ర మోడీకి కూడా అశోక్ అంటే ప్రత్యేకమైన అభిమానం ఉన్నాయి. ఆయన తొలి కేబినెట్ లో అశోక్ పౌర విమాన యాన మంత్రిగా పనిచేశారు. ఆయన పనితీరు నరేంద్ర మోడీకి బాగా నచ్చింది అని చెబుతారు.
దీంతో అన్ని రకాలుగా సానుకూలతలు అశోక్ కి ఉన్నాయని అంటున్నారు. అశోక్ విషయం చూస్తే ఏనాడూ పార్టీ గీత దాటలేదు. అలాగే ఆయన విధేయుడిగా ఉన్నారు. ఆయన పట్ల బాబుతో పాటు లోకేష్ ఇద్దరూ కూడా పూర్తిగా అనుకూలంగా ఉన్నారు అని అంటున్నారు. మొత్తానికి చూస్తే చాలా తొందరలోనే అశోక్ గజపతిరాజు తమిళనాడు రాజ్ భవన్ లోకి ప్రవేశించబోతున్నారు అని ప్రచారం అయితే పెద్ద ఎత్తున సాగుతోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.