Begin typing your search above and press return to search.

వేల కోట్ల కుంభకోణం.. ప్రముఖ నటి అరెస్టు!

వేల కోట్ల రూపాయల ఆన్‌లైన్‌ స్టాక్‌ ట్రేడింగ్‌ కుంభకోణానికి సంబంధించి ప్రముఖ నటి సుమిబోరా అరెస్టు అయ్యారు.

By:  Tupaki Desk   |   12 Sep 2024 7:29 AM GMT
వేల కోట్ల కుంభకోణం.. ప్రముఖ నటి అరెస్టు!
X

వేల కోట్ల రూపాయల ఆన్‌లైన్‌ స్టాక్‌ ట్రేడింగ్‌ కుంభకోణానికి సంబంధించి ప్రముఖ నటి సుమిబోరా అరెస్టు అయ్యారు. ఆమెతోపాటు ఆమె భర్త తార్కిక్‌ బోరాను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ కుంభకోణం అస్సాం రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.

ఈ నేపథ్యంలో ఇందులో హీరోయిన్‌ సుమిబోరా, ఆమె భర్త తార్కిక్‌ బోరాకు ప్రమేయముందనే ఆరోపణల నేపథ్యంలో పోలీసులు వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరూ దేశం విడిచి పారిపోయే అవకాశం ఉండటంతో పోలీసులు ఇప్పటికే వీరిపై లుక్‌ ఔట్‌ నోటీసులు జారీ చేశారు. కాగా ఈ కుంభకోణంలో ప్రధాన నిందితుడు విశాల్‌ పుకాన్‌ ను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు.

కాగా ఈ కుంభకోణం వివరాల్లోకి వెళ్తే.. స్టాక్‌ మార్కెట్‌ లో పెట్టుబడి పెట్టి భారీ లాభాలను అందిస్తామని అస్సాంలో మోసగాళ్లు ప్రజల నుంచి భారీ ఎత్తున డబ్బులు వసూలు చేశారు. పెట్టిన పెట్టుబడులపై 60 రోజుల్లోనే 30 శాతం లాభాలు అందిస్తామని చెప్పడంతో ప్రజలు భారీగా పెట్టుబడులు పెట్టారు. ఇలా ప్రజల నుంచి దాదాపు రూ.2 వేల కోట్లు వసూలు చేశారు.

ఇలా ప్రజల నుంచి సేకరించిన వేల కోట్ల రూపాయల సొమ్మును ప్రధాన నిందితుడు విశాల్‌ సినీ రంగంలో పెట్టుబడులుగా పెట్టాడు. అలాగే నాలుగు నకిలీ సంస్థలను ఏర్పాటు చేశాడు. భారీ ఎత్తున ఆస్తులను కూడా కొనుగోలు చేశాడు. ఈ కుంభకోణంలో హీరోయిన్‌ సుమిబోరా, ఆమె భర్తకు కూడా ప్రమేయముందని తేలడంతో వారిని అరెస్టు చేశారు. వీరిద్దరి ప్రమేయమున్నట్టు ప్రధాన నిందితుడు విశాల్‌ పుకాన్‌ పోలీసుల విచారణలో వెల్లడించాడు.

ఈ క్రమంలో నటి సుమి బోరాను, ఆమె భర్త తార్కిక్‌ ను పోలీసుల విచారణకు రావాలని నోటీసులు ఇవ్వగా వారిద్దరూ రాలేదు. దీంతో వారు పారిపోయే అవకాశం ఉండటంతో పోలీసులు లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేశారు.

ఈ నేపథ్యంలో నటి సుమిబోరా ఒక వీడియోను విడుదల చేశారు. ఈ కుంభకోణంతో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తమపై అసత్య ప్రచారం చేస్తున్నారని వాపోయారు. తన పరువుకు నష్టం కలిగించేలా వార్తలు ప్రచురిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఎక్కడికీ పారిపోలేదన్నారు. ఈ నేపథ్యంలో నిజానిజాల వెల్లడి కోసమే తాను, తన భర్త పోలీసుల విచారణకు సహకరించాలని నిర్ణయించుకున్నామన్నారు. అయితే ఈ వీడియోను విడుదల చేసిన రోజే సుమి బోరాను పోలీసులు అరెస్టు చేశారు.