అధికారపక్షం వర్సెస్ ప్రతిపక్షం.. అసెంబ్లీలో ఆ అంశంపై వాడివేడి చర్చ

సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే.. తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-12-09 11:06 GMT

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా ప్రారంభం అయ్యాయి. సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే.. తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వాడివేడి చర్చ సాగింది. తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై ప్రతిపక్ష పార్టీలు పలు సందేహాలు వెల్లడించాయి.

తెలంగాణ చరిత్ర ఉన్నంత వరకు తెలంగాణ తల్లి నిలిచిపోవాలని ఉద్వేగంతో చెప్పారు రేవంత్ రెడ్డి. ఇప్పటివరకు రాష్ట్రంలో తెలంగాణ తల్లికి అధికారిక గుర్తింపు లేదన్నారు. అలాంటి గుర్తింపు కోసమే తాము తాపత్రయపడ్డామని చెప్పారు. తెలంగాణ తల్లి అంటే భావన కాదని, నాలుగు కోట్ల ప్రజల భావోద్వేగం అని పేర్కొన్నారు. అలాంటి తల్లి విగ్రహావిష్కరణ నేడు సచివాలయంలో జరుపుకోబోతున్నామని తెలిపారు. మన సంస్కృతి, సంప్రదాయాల నిలువెత్తు తల్లి.. తెలంగాణ తల్లి విగ్రహం అని పేర్కొన్నారు.

తెలంగాణ ధీర వనితలు చాకలి ఐలమ్మ, సమ్మక్క సారలమ్మ స్ఫూర్తితో తెలంగాణ తల్లి విగ్రహం రూపొందించామని రేవంత్ చెప్పారు. పీఠంలో నీలి రంగు, గోదావరి, కృష్ణమ్మల గుర్తులు అమర్చినట్లు తెలిపారు. టీజీ తెలంగాణ ఆత్మగౌరవం ప్రతీక అని చెప్పారు. ఉద్యమం సందర్భంగా స్ఫూర్తి ఇచ్చిన జయజయహే తెలంగాణ రాష్ట్ర గీతంగా మార్చుకున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చి పదేళ్లు గడిచినా ప్రత్యేక గీతం లేదన్నారు. తెలంగాణ తల్లి దేవత రూపంలో ఉండాలా.. తల్లి రూపంలా ఉండాలా అన్న చర్చ సైతం జరిగిందని స్పష్టం చేశారు. దేవుత గుడిలో ఉంటుందని, తల్లి ఇంట్లో ఉంటుందని, అందుకే మేధావులు, కవుల సూచనల మేరకు తెలంగాణ తల్లి విగ్రహానికి ఇలా రూపకల్పన చేశామని తెలిపారు.

సభ ప్రారంభంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై మాట్లాడారు. ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రకటించారు. అయితే దీనిపై బీజేపీ నేతలు అభ్యంతరం తెలిపారు. తెలంగాణ తల్లి విగ్రహం అభయహస్తం ఇస్తున్నట్లు కాకుండా కాంగ్రెస్ హస్తం గుర్తులా ఏర్పాటు చేశారని అభ్యంతరం తెలిపారు. అలాగే.. ఆకుపచ్చ చీరతో ఏర్పాటు చేయడం బాగానే ఉన్నప్పటికీ పూర్తిగా కాంగ్రెస్ కలర్ కొట్టొచ్చేలా ఉన్నదన్నట్లు చెప్పారు. బీజేపీ ఎమ్మెల్యే పాయల శంకర్ మాట్లాడుతూ.. తెలంగాణ తల్లి విగ్రహంపై అన్ని పార్టీల అభిప్రాయం తీసుకుంటే బాగుండేదని సూచించారు. తెలంగాణ తల్లి నెత్తిపై బతుకమ్మ ఉంటే బాగుండు అని అభిప్రాయం చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గేయం, చిహ్నం, విగ్రహం మార్చారని, అన్ని మార్చుతున్న సర్కార్ ప్రభుత్వ ఉద్యోగులను ఇబ్బంది పెట్టే 317 కూడా మార్చాలని కోరారు. ఏదైనా మార్చే అధికారం మీకు ఉన్నదని, కానీ పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు అందరి అభిప్రాయాలు తీసుకోవాలని సూచించారు. దీనిపై మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. గత పదేళ్లుగా తెలంగాణ తల్లి గత పాలకులు ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు. గత పాలకులు తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసుకొచ్చే ముందు అన్ని పార్టీల అభిప్రాయం ఏమైనా తీసుకుందా అని ప్రశ్నించారు. పదేళ్లుగా ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఒక్కొక్కటిగా పరిష్కారం చేసుకుంటూ వస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో అన్ని జిల్లా కేంద్రాల్లో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని సూచించారు.

కమ్యూనిస్టు నేత కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ... ఆ నాడు తెలంగాణ విగ్రహ ఆవిష్కరణకు అప్పటి ప్రతిపక్ష పార్టీలను కేసీఆర్ పిలిచారా అని నిలదీశారు. తెలంగాణ తల్లి విగ్రహం రూపకల్పనలో అన్నిపక్షాలను పరిగణలోకి తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, నాటి ఉద్యమ స్ఫూర్తి, పోరాట పటిమ అంశాలను పరిగణలోకి తీసుకోవాలని కానీ అలా చేయలేదన్నారు. ఏడాది పాలనను రివ్యూ చేసుకోవాలని, అప్పుడు ఇప్పుడు ఒకేలా లేదని స్పష్టం చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందిస్తూ.. బీఆర్ఎస్ నాయకులు అసెంబ్లీ బయట పిచ్చి వేషాలు వేస్తున్నారని హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణ తల్లి విగ్రహం ప్రారంభం కార్యక్రమంలో ప్రతిపక్షాలు కీలక పాత్ర పోషించాలని చెప్పామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో తప్ప రాష్ట్రంలో ఏ పార్టీలోనూ తెలంగాణ పదం లేదని, తమ పార్టీని టీపీసీసీ అని అంటారని తెలిపారు. తెలంగాణ గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ పార్టీకి లేదన్నారు. కాగా.. ఈ ఒక్క రోజు రాజకీయాలు వద్దంటూ మంత్రి శ్రీధర్ బాబు వారికి అప్పీల్ చేశారు.

Tags:    

Similar News