క్రిష్ణాలో 10 సీట్ల లెక్క తేలినట్లేనట!

ఇలాంటివేళ కీలకమైన క్రిష్నా జిల్లాకు సంబంధించిన పది అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది

Update: 2024-02-11 15:30 GMT

ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఓవైపు అధికార వైసీపీ తన అభ్యర్థుల విషయంపై క్లారిటీతో ఉండగా.. ప్రధాన ప్రతిపక్ష టీడీపీ విషయంలో మాత్రం ఇందుకు భిన్నమైన గందరగోళం నెలకొంది. పార్టీ పొత్తుల లెక్కలు ఒక కొలిక్కి రాకపోవటం.. జనసేనతో సీట్ల పంచాయితీ లెక్క తేలని వేళలో.. బీజేపీతో పొత్తుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు సీరియస్ గా ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటివేళ.. జిల్లాల వారీగా సీట్ల లెక్క తేల్చేందుకు కిందా మీదా పడుతున్న పరిస్థితి.

ఇలాంటివేళ కీలకమైన క్రిష్నా జిల్లాకు సంబంధించిన పది అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం మొత్తం 10 సీట్లలో ఒక సీటు జనసేనకు కేటాయించి.. మిగిలిన తొమ్మిది సీట్లను తాము తీసుకునేలా తెలుగుదేశం ప్లాన్ చేసినట్లుగా చెబుతున్నారు. టీడీపీ అభ్యర్థులను సైతం ఖరారు చేశారని చెబుతున్నారు. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. మొత్తం 10 స్థానాల్లో నూజివీడును జనసేనకు కేటాయించగా.. మరో మూడు స్థానాల్లో వైసీపీ నుంచి బయటకు వచ్చేసిన వారికి సీట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.

క్రిష్ణా జిల్లాలో మొత్తం 16 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. అందులో పది స్థానాలకు లెక్కలు తేలగా.. ఆరు స్థానాలపై మాత్రం ఉత్కంఠ నెలకొంది. పొత్తుల నేపథ్యంలో కొన్ని స్థానాల్లో నెలకొన్న సంక్లిష్టత కారణంగా వాటిపై మల్లగుల్లాలు పడుతున్నారు. మైలవరం సీటు విషయానికే వస్తే.. ఈ సీటును ఎవరికి కేటాయిస్తారన్న దానికి అనుగుణంగా పెనమలూరు అభ్యర్థి వ్యవహారం కొలిక్కి వచ్చే వీలుంది. బీజేపీతో తాజాగా పొత్తు ప్రయత్నాలు సీరియస్ గా సాగుతున్న నేపథ్యంలో.. ఆ పార్టీకి సంబంధించి ఒక సీటును ఇవ్వాల్సి వస్తుంది. అదే జరిగితే.. ఏ స్థానాన్ని ఇస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఇక.. జిల్లాలోని రెండు ఎంపీ సీట్లను టీడీపీ.. జనసేనలు చెరొకటి తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చినట్లుగా చెబుతున్నారు. జిల్లాకు చెందిన కైకలూరు... నూజివీడు అసెంబ్లీ స్థానాలు ఏలూరు ఎంపీ స్థానం పరిధిలో ఉండటం తెలిసిందే. 2019 ఎన్నికల్లో క్రిష్ణా జిల్లాలో టీడీపీ 2 ఎమ్మెల్యే స్థానాల్లో విజయం సాధించగా.. వాటిల్లో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీలో చేరటం తెలిసిందే. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావును సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆ స్థానం నుంచి కంటిన్యూ చేయనున్నారు.

నూజివీడు స్థానం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి కొలుసుపార్థసారథికి కేటాయించటం ఖరారైనట్లుగా చెబుతున్నారు. ఆయనతో పాటు వైసీపీకి చెందిన యార్లగడ్డ వెంకట్రావుకు గన్నవరం టికెట్ ను ఇవ్వనున్నట్లుగా చెబుతున్నారు. పొత్తులో భాగంగా విజయవాడ పశ్చిమ సీటును జనసేనకు కేటాయించినట్లుగా తెలుస్తోంది. ఆ పార్టీ నుంచి పోతిన వెంకట మహేశ్ బరిలోకి దిగుతారని చెబుతున్నారు.

మైలవరం సీటుపై పడిన పీటముడి తెలుగుదేశం పార్టీకి తలనొప్పిగా మారినట్లుగా చెప్పాలి. ఈ నియోజకవర్గంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రస్తుతం టీడీపీ ఇన్ ఛార్జిగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో దేవినేనిపై గెలిచిన వైసీపీ ఎమ్మెల్యే వసంత క్రిష్ణ ప్రసాద్ సైకిల్ ఎక్కేందుకు ఆసక్తిని చూపుతున్నారు. దీంతో.. ఈ ఇద్దరిలో ఎవరికి టికెట్ ఇవ్వాలన్న దానిపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు తేల్చుకోలేకపోతున్నట్లు చెబుతున్నారు. విజయవాడ సిటీని అనుకొని ఉన్న పెనమూరు సీటుకు అభ్యర్థి ఎంపిక తేలకపోవటంతో.. మైలవరంలో టికెట్ ఒకరికి వచ్చి.. ఇంకొకరిని పెనమలూరుకు షిఫ్టు చేయాలన్నట్లుగా పార్టీ భావిస్తోంది. అయితే.. జనసేన, బీజేపీతో సీట్ల సర్దుబాటు ఒక కొలిక్కి రాని నేపథ్యంలో ఈ రెండు స్థానాలపై ఉత్కంట నెలకొంది.

అవనిగడ్డ, పెడన సీట్లను టీడీపీ అభ్యర్థులు ఆశిస్తుండగా.. ఇందులో అవనిగడ్డను జనసేన ఆశిస్తోంది. దీంతో.. ఆ స్థానాన్ని జనసేనకు ఇస్తారా? టీడీపీ పోటీ చేస్తుందా? అన్నది తేలాల్సి ఉంది. కైకలూరు సీటు విషయంపై క్లారిటీ రావటానికి మరికొంత టైం తీసుకుంటుందని చెబుతున్నారు. గతంలో ఇదే స్థానం నుంచి బీజేపీ నుంచి మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహించటంతో.. ఈ స్థానాన్ని బీజేపీ ఆశించే వీలుందంటున్నారు. అయితే.. ఇదే సీటు కోసం టీడీపీ నుంచి పెన్మత్స వెంకటేశ్వరరాజు.. మాజీ ఎంపీ మాగంటి బాబు పోటీలో ఉన్నారు. దీంతో.. ఈ సీటుకు సంబంధించిన టికెట్ ఎవరికి దక్కుతుందన్నది ఇప్పుడు ఉత్కంటగా మారింది. ఉమ్మడి క్రిష్ణా జిల్లాకు సంబంధించిన 16 స్థానాల్లో 9 స్థానాల్లో టీడీపీ అభ్యర్థుల జాబితా ఒక కొలిక్కి రాగా.. ఒక స్థానం జనసేనకు ఖాయమని చెబుతున్నారు. మిగిలిన వాటిపై క్లారిటీ రావాల్సి ఉంది.

ఇప్పటికే కొలిక్కి వచ్చినట్లుగా చెబుతున్న పది స్థానాల విషయానికి వస్తే..

నియోజకవర్గం టీడీపీ అభ్యర్థులు

మచిలీపట్నం కొల్లు రవీంద్ర

గుడివాడ వెనిగళ్ల రామ్మోహన్

గన్నవరం యార్లగడ్డ వెంకట్రావు

పామర్రు వర్ల కుమార్ రాజా

విజయవాడ తూర్పు గద్దె రామ్మోహన్ రావు

విజయవాడ సెంట్రల్ బొండా ఉమా మహేశ్వరరావు

నందిగామ తంగిరాల సౌమ్య

జగ్గయ్యపేట శ్రీరాం రాజగోపాల్ తాతయ్య

నూజివీడు కొలుసు పార్థ సారథి

విజయవాడ పశ్చిమ జనసేన అభ్యర్థి

Tags:    

Similar News