మంత్రి గారి మేనల్లుడికే అక్కడ సీటు...!?
వైసీపీకి ఉత్తరాంధ్రాలో గట్టి పట్టున్న జిల్లాగా విజయనగరాన్ని చెప్పుకుంటారు. 2019 ఎన్నికల్లో మొత్తం క్లీన్ స్వీప్ చేసింది ఈ జిల్లాలోనే
వైసీపీకి ఉత్తరాంధ్రాలో గట్టి పట్టున్న జిల్లాగా విజయనగరాన్ని చెప్పుకుంటారు. 2019 ఎన్నికల్లో మొత్తం క్లీన్ స్వీప్ చేసింది ఈ జిల్లాలోనే. ఈసారి కూడా మెజారిటీ సీట్లు వైసీపీవే అన్న అంచనాలు ఉన్నాయి. విజయనగరం వైసీపీకి పెద్ద దిక్కుగా సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ ఉన్నారు.
అయితే వైసీపీ జిల్లా ప్రెసిడెంట్ గా జిల్లా పరిషత్ చైర్మన్ గా బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు ఉన్నారు. ఈసారి ఆయనను అసెంబ్లీకి పోటీ చేయించాలని వైసీపీ అధినాయకత్వం గట్టిగా భావిస్తోంది. నిజానికి 2019 ఎన్నికల్లోనే ఆయన ఎక్కడ కోరుకుంటే అక్కడ సీటు ఇచ్చేందుకు కూడా వైసీపీ పెద్దలు మొగ్గు చూపారు.
అయితే ఆనాడు తాను ప్రచారానికే పరిమితం అవుతానని పార్టీని గెలిపిస్తానని మజ్జి శ్రీను చెప్పారు. ఇక ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మజ్జి శ్రీనుకు జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని ఇచ్చారు. ఇపుడు ఆయనకు కీలకమైన అసెంబ్లీ సీటు ఇవ్వడానికి వైసీపీ హై కమాండ్ సీరియస్ గా ఆలోచిస్తోంది అని అంటున్నారు.
మంత్రి బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న చీపురుపల్లి నుంచి ఈసారి మజ్జి శ్రీనుని పోటీ చేయించాలని పార్టీ ఒక డెసిషన్ కి వచ్చింది అని ప్రచారం అయితే సాగుతోంది. చీపురుపల్లి నుంచి బొత్స మూడు సార్లు గెలిచారు. దశాబ్ద కాలం పైగా ఆయన మంత్రిగా వివిధ ప్రభుత్వాలలో పనిచేశారు.
ఇదిలా ఉంటే బొత్స సేవలను పార్టీ కొరకు అలాగే ఆయనను పార్లమెంట్ కి పంపించడం ద్వారా అక్కడ కూడా వినియోగించుకోవాలని వైసీపీ హై కమాండ్ చూస్తోంది అని అంటున్నారు. బొత్సకు ఎంపీగా పోటీ చేయడం గెలవడం కొత్త కాదు, ఆయన బొబ్బిలి నుంచి గతంలో ఎంపీగా కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచారు.
ఇపుడు బొత్సను విజయనగరం లోక్ సభ నుంచి పోటీ చేయిస్తారు అని అంటున్నారు. బొత్స వంటి సీనియర్ నేత ఎంపీగా పోటీలో ఉంటే మొత్తం ఆ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ సీట్లు కూడా సులువుగా గెలుచుకోవచ్చు అన్నది వైసీపీ మాస్టర్ ప్లాన్ గా చెబుతున్నారు.
దాంతో బొత్స ఈసారి అసెంబ్లీకి కాకుండా ఎంపీగా చేస్తారా అన్న చర్చ అయితే విజయనగరం వైసీపీ వర్గాలలో గట్టిగా వినిపిస్తోంది. మరో వైపు చూస్తే బొత్స తాను ఎంపీగా పోటీ చేయడానికి సుముఖంగా ఉన్న తన సొంత సీటు చీపురుపల్లి నుంచి కుమారుడు బొత్స సందీప్ ని దించాలని చూస్తున్నారు అని అంటున్నారు.
అదే కనుక నిజమైతే మజ్జి శ్రీనుకు వేరే అసెంబ్లీ సీటుని చూపించాల్సి ఉంటుంది. అయితే ఈసారి ఎన్నికలు కీలకంగా మారడంతో అనుభవం కూడా అవసరం అన్న లెక్కన మజ్జి శ్రీనుకే ఓటేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. ఇక బొత్స వారసుడికి 2029 దాకా వేచి ఉండక తప్పదని కూడా అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో..