గెలిచే సీట్ల పై బీజేపీ పెద్ద జోక్!

119 సీట్లలో మిత్రపక్షం జనసేనకు ఎనిమిది సీట్లను కేటాయించింది. మిగిలిన 111 సీట్లలో మాత్రమే బీజేపీ పోటీచేస్తోంది

Update: 2023-11-26 10:30 GMT

నవంబర్ 30 తేదీన జరగబోయే పోలింగుకు సంబంధించి బీజేపీ పెద్ద జోక్ చేసింది. ఇంతకీ విషయం ఏమిటంటే బీజేపీ సినియర్ నేత జితేందర్ రెడ్డి మాట్లాడుతు బీజేపీ 45 నియోజకవర్గాల్లో ముందంజలో ఉన్నట్లు చెప్పారు. ఇంటెలిజెన్స్ అధికారులు నిర్వహించిన లెటెస్టు సర్వేలోనే ఈ విషయం స్పష్టమైనట్లు రెడ్డి చెప్పటం పెద్ద జోక్ తయారైంది. ముందంజలో ఉందంటే జితేందర్ ఉద్దేశ్యంలో గెలుస్తుందనే అనుకోవాలి. కాకపోతే తెలివిగా గెలుస్తామని మాత్రం ఎక్కడా చెప్పలేదు.

119 సీట్లలో మిత్రపక్షం జనసేనకు ఎనిమిది సీట్లను కేటాయించింది. మిగిలిన 111 సీట్లలో మాత్రమే బీజేపీ పోటీచేస్తోంది. పోటీచేస్తున్న సీట్లలో 45 సీట్లలో ముందంజలో ఉందా లేకపోతే జనసేనను కూడా కలుపుకుని 45 సీట్ల అన్న విషయంలో కూడా రెడ్డి క్లారిటి ఇవ్వలేదు. పోలింగ్ నవంబర్ 30వ తేదీ కాకుండా కౌంటింగ్ డిసెంబర్ 3వ తేదీన మాత్రమే బీజేపీ సత్తా తెలుస్తుందని జితేందర్ చెప్పటమే విచిత్రంగా ఉంది. నిజానికి పోలింగ్ అయిపోయిన తర్వాత రోజు విషయం చూచాయగా తెలిసిపోతుంది.

పోలింగ్ జరిగిన రోజు పూర్తి విషయం బయటపడదు. అయితే తర్వాత రెండు మూడు రోజులకు మెల్లిగా అసలు విషయం బయటకు వస్తుంది. పోలింగ్ జరిగిన రోజున ఓట్లన్నీ తమకే పడ్డాయనే ప్రతి పార్టీ నేత అభ్యర్ధులతో చెబుతారు. తర్వాత రెండు మూడు రోజులకే ఎక్కడ పడింది, ఎక్కడ ఓట్లు పడలేదన్న విషయాలు బయటకు వస్తాయి. దాంతో కౌంటింగ్ మొదలయ్యే సమయానికే ఫలితాలపై చూచాయగా విషయం తెలిసిపోతుంది.

ఇక్కడ విషయం ఏమిటంటే 45 నియోజకవర్గాల్లో గెలుపు తమదే అన్నట్లుగా జితేందర్ మాట్లాడారు. కానీ గట్టి అభ్యర్ధులు పోటీచేస్తున్న నియోజకవర్గాలే 45 లేవు. ఏ సంస్ధ చేసిన సర్వేలో కూడా బీజేపీ గెలుచుకోబోయే సీట్ల సంఖ్య సింగిల్ డిజిట్ దాటలేదు. అంటే హోలుమొత్తంమీద బీజేపీ మహాయితే 4 లేదా 5 సీట్లలో గెలిస్తే చాలా ఎక్కువనే అందరు చెప్పుకుంటున్నారు. సర్వేల్లో కూడా అదే తేలుతోంది. గ్రౌండ్ లెవల్ సమాచారం ఇలాగుంటే జితేందర్ మాత్రం 45 సీట్లలో బీజేపీ గెలుస్తుందన్నట్లుగా బిల్డప్ ఇవ్వటం పెద్ద జోక్ గా మారింది.

Tags:    

Similar News