ఏపీలో ఈ 9 నియోజకవర్గాల ప్రత్యేకత ఇదే!
ఆంధ్రప్రదేశ్ లో 2024 ఓటర్ల తుది జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం జిల్లాల వారీగా విడుదల చేసిన సంగతి తెలిసిందే
ఆంధ్రప్రదేశ్ లో 2024 ఓటర్ల తుది జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం జిల్లాల వారీగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఏపీలోని జిల్లాల వారీగా తుది ఓటర్ల జాబితాలను సీఈఓ ఆంధ్రా వెబ్ సైట్ లో అందుబాటులోకి తీసుకొచ్చిట్లు ఎన్నికల కమిషన్ పేర్కొంది. ఇందులో... అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా తుది ఓటర్ల జాబితాలను అందుబాటులో ఉంచింది. ఈ సమయంలో అత్యధిక ఓటర్లు ఉన్న జిల్లాలు, అత్యల్ప ఓటర్లు ఉన్న నియోజకవర్గాల జాబితా తెరపైకి వచ్చింది.
అవును... ఏపీలో తుది ఓటరు జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ జాబితా ప్రకారం రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 4 కోట్ల 8 లక్షల 7 వేల 256 గా ఉండగా... వీరిలో పురుష ఓటర్లు 2 కోట్ల 9 వేల 275 కాగా, మహిళా ఓటర్ల సంఖ్య 2 కోట్ల 7 లక్షల 37 వేల 65. ఇక.. థర్డ్ జెండర్ ఓట్ల సంఖ్య 3482 గా ఉండగా... సర్వీస్ ఓటర్ల సంఖ్య 67,434 గా ఉంది!
వాస్తవంగా... గత అక్టోబర్ 27న ఎన్నికల సంఘం ముసాయిదా ఓటర్ జాబితాను విడుదల చేసింది. అయితే... తుది జాబితాలో ఓటర్ల సంఖ్య ఆ ముసయిదా ఓటర్ల సంఖ్యకంటే పెరిగింది. ఆ పెరుగుదల సుమారు 6 లక్షల మేర ఉండటం గమనార్హం. ఇక ఇటీవల విడుదల చేసిన ఓటర్ల తుది జాబితాను జిల్లాలు, నియోజకవర్గాలు, గ్రామాల స్థాయిలో ప్రచురించింది ఎన్నికల కమిషన్.
ఆ సంగతి అలా ఉంటే... తాజాగా ఈసీ వెల్లడించిన ఓటర్ల జాబితాలో... కర్నూలు జిల్లాలో అత్యధికంగా 20,16,396 ఓట్లు ఉండగా... అత్యల్పంగా అల్లూరి జిల్లాలో 7,61,538 ఓట్లు ఉన్నాయి. ఇదే సమయంలో... అత్యల్ప ఓటర్లు ఉన్న నియోజకవర్గాలు తెరపైకి వచ్చాయి. అంటే... రెండు లక్షల ఓట్ల కంటే తక్కువగా ఉన్న నియోజకవర్గాలు అని భావించొచ్చన్నమాట.
ఇందులో భాగంగా... పెడన నియోజకవర్గంలో అత్యల్పంగా 1,65,828 ఓట్లు ఉండగా... తక్కువ ఓటర్లు ఉన్న నియోజకవర్గాలుగా తర్వాత స్థానాల్లో... నరసాపురం (1,68,259).. ఆచంట (1,78,755).. పామర్రు (1,83,242).. కొవ్వూరు (1,83,516).. మాడుగుల (1,87,777).. పార్వతీపురం (1,88,532).. బాపట్ల (1,89,088).. కుప్రాం (1,93,123) ఉన్నాయి.