అమ్మా-కొడుకు, అన్నా-త‌మ్ముడు.. టీడీపీకి గ‌ట్టి స‌వాల్‌!

ఇద్ద‌రూ వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకుని ఒక‌రు అసెంబ్లీ, మ‌రొక‌రు పార్ల‌మెంటులో అడుపు పెట్టాల‌ని భావిస్తున్నారు.

Update: 2024-01-01 03:00 GMT

అటు అమ్మ‌.. ఇటు కుమారుడు.. ఇద్ద‌రూ రాజ‌కీయాల్లో రాణించాల‌నేదే కోరిక‌. పైగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ యం ద‌క్కించుకుని ఇద్ద‌రూ ఒకే సారి అసెంబ్లీలో అడుగు పెట్టాల‌నేది ప్ర‌ధాన ఆకాంక్ష‌. ఈ నేప‌థ్యంలో ఇద్ద రూ కూడా.. త‌మ త‌మ వ్యూహాల‌తో ముందుకు సాగుతున్నారు. అయితే.. పార్టీ ప‌రిస్థితి మాత్రం దీనికి భిన్నంగా ఉంది. మ‌రోవైపు.. అన్న‌-త‌మ్ముడు ప‌రిస్థితి కూడా అలానే ఉంది. ఇద్ద‌రూ వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకుని ఒక‌రు అసెంబ్లీ, మ‌రొక‌రు పార్ల‌మెంటులో అడుపు పెట్టాల‌ని భావిస్తున్నారు.

వీరి విష‌యంలోనూ టీడీపీ ప‌రిస్థితి ఇబ్బందిగానే ఉంది. దీంతో ఏం చేయాలో తెలియ‌క‌.. టీడీపీ స‌త‌మ‌తం అవుతోంది. విష‌యం ఏంటంటే.. ఉమ్మ‌డి అనంతపురం జిల్లాల్లో రెండు కీల‌క కుటుంబాలు రాజ‌కీయాల్లో ఉన్నారు. ఈ రెండు కూడా.. టీడీపీలోనే ఉండ‌డం గ‌మ‌నార్హం. వారే ఒక‌టి ప‌రిటాల కుటుంబం.. రెండోది జేసీల కుటుంబం. ప‌రిటాల ఫ్యామిలీ నుంచి అమ్మ ప‌రిటాల సునీత‌, కుమారుడు శ్రీరాంలు ఇద్ద‌రూ అసెంబ్లీ టికెట్లు కోరుతున్నారు. ఇంకో మాట‌లో చెప్పాలంటే ప‌ట్టుబ‌డుతున్నారు.

సునీత రాప్తాడుకు ఇంచార్జ్‌గా ఉన్నారు. శ్రీరాం ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ఇంచార్జ్‌గా ఉన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ‌కు ఈ రెండు ఇవ్వాల‌నేది వీరు చేస్తున్న డిమాండ్‌. కానీ, పార్టీ మాత్రం మీకు రెండు ఇస్తే.. మిగిలిన జిల్లాల్లోనూ ఇదే ప‌రిస్థితి ఉంటుంద‌ని.. కాబ‌ట్టి ఏదో ఒక‌టి తేల్చుకోవాల‌ని సూచిస్తోంది. కానీ, తల్లీ కొడుకులు మాత్రం త‌మ పంతమే నెగ్గించుకునేందుకు రెడీ అవుతున్న‌ట్టు పార్టీలో చ‌ర్చ సాగుతోంది. ఇక‌, ఇదే జిల్లాలోని తాడిప‌త్రి అసెంబ్లీ, అనంత‌పురం పార్ల‌మెంటు సీటును జేసీ బ్ర‌ద‌ర్స్ కుమారులు జేసీ అస్మిత్‌, ప‌వ‌న్ కుమార్‌లు కోరుతున్నారు.

వాస్త‌వానికి గ‌త ఎన్నిక‌ల్లో తాడిప‌త్రి నుంచి జేసీ అస్మిత్‌రెడ్డి, అనంత‌పురం పార్ల‌మెంటు స్థానం నుంచి ప‌వ‌న్‌కుమార్‌రెడ్డి పోటీ చేశారు. అయితే.. వారు వైసీపీ హ‌వాలో ఓడిపోయారు. ఇక‌, వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ సేమ్ సీట్లు ఆఫ‌ర్ చేయాల‌ని ప‌ట్టుబ‌డుతున్నారు. కానీ, ఏదో ఒక‌టి మాత్ర‌మే ఇస్తామ‌ని.. పార్టీ తేల్చి చెబుతోంది. జ‌న‌సేన‌-టీడీపీ పొత్తులో భాగంగా తాడిప‌త్రి కానీ, అనంత‌పురం పార్ల‌మెంటును కానీ వ‌దులు కోవాలని అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల్లో తేల్చి చెప్పిన‌ట్టు తెలిసింది. దీంతో వారు ఎటూ తేల్చ‌లేక‌.. పార్టీ పై ఒత్తిడి పెంచుతున్న‌ట్టు స‌మాచారం. మ‌రి చంద్ర‌బాబు ఏం చేస్తారో చూడాలి.

Tags:    

Similar News