ఎస్... వైసీపీకి నిజంగా అంత సీన్ లేదా...?
ఐదేళ్లు అధికారంలో ఉన్న వైసీపీ ఏమీ చేయలేదని.. అంతా విధ్వంసమే చేసిందని అధికార పార్టీ నాయకులు ఇతర పక్షాలు కూడా.. వ్యాఖ్యానిస్తున్నాయి.
ఏపీలో అధికారం కోల్పోయిన తర్వాత.. వైసీపీ పరిస్థితి.. అరిటాకులా మారిపోయిందని ఆ పార్టీ నాయకు లు వ్యాఖ్యానిస్తున్నారు. ఐదేళ్లు అధికారంలో ఉన్న వైసీపీ ఏమీ చేయలేదని.. అంతా విధ్వంసమే చేసిందని అధికార పార్టీ నాయకులు ఇతర పక్షాలు కూడా.. వ్యాఖ్యానిస్తున్నాయి. అయితే..దీనికి దీటుగా ఎవరూ కౌంటర్ ఇవ్వకపోవడం.. ఒకరిద్దరు మాత్రమే బయటకు రావడంతో ఇప్పుడు ఈ విషయంపై అధినేత జగన్ దృష్టి పెట్టారు.
''ఔనా.. వైసీపీ నిజంగానే ఏమీ చేయలేదా? మరి మనం చేసింది ఏంటి? అధికార పక్షం ప్రచారాన్ని ప్రజ లు విశ్వసించే పరిస్థితి వచ్చే లోపే మనం ఏచేశామన్న విషయాన్ని ప్రజలకు మీరు ఎందుకు వివరించ లేక పోతున్నారు? '' అని గత రెండు రోజులుగా జగన్ తన పార్టీ నాయకులకు.. తలంటుతున్నారు. ఇదే సమయంలో ఆయన కొన్ని స్టాటిస్టిక్స్‌ను కూడా నాయకులకు అందిస్తున్నారు. వీటిని తీసుకుని ప్రజల్లోకి వెళ్లండి! అని దిశానిర్దేశం చేస్తున్నారు.
అయితే.. ఇలా ఇప్పుడే వెళ్తే.. ఎలా? అని కొందరు వ్యాఖ్యానించారు. యువ నాయకుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అయితే.. కొంత దూకుడుగా వ్యాఖ్యానించినట్టు సమాచారం. ఇప్పుడు కాదు సర్..ఒక నెల రోజులు ఆగి అప్పుడు ప్రజల్లోకి వెళ్తే బాగుంటుందని సూచించారు. ఆయన సూచనలకు మెజారిటీ నాయకులు కూడా.. తలూపారు. దీంతో ఇప్పటికిప్పుడు నాయకులు ప్రజల మధ్యకు వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఇప్పుడే ప్రజల మద్యకు వస్తే.. ఓడిపోయిన నేపథ్యంలో వ్యతిరేక ప్రచారం చేస్తున్నారనే కామెంట్లు వస్తాయన్నది బైరెడ్డి సూచన.
మరికొందరు నాయకులు జగన్‌కు చెప్పకపోయినా.. చేసింది చెప్పుకొనేందుకు అప్పుడే ప్రయత్నించి ఉంటే బాగుండేదని .. కానీ, తమకు అవకాశం లేకుండా చేశారని వ్యాఖ్యానించారు. అంతా వలంటీర్లే చూసుకుంటారు.. అనే ధోరణి తోనే చేసింది కూడా చెప్పుకోలేక పోయారని చెబుతున్నారు. నాడు - నేడు, ఆర్బీకేలు, సచివాలయాల ఏర్పాటు, 1.30 లక్షల మంది ఉద్యోగాలు.. ఇంటింటికీ రేషన్, పింఛను వంటి కార్యక్రమాలను కూడా.. తాము ప్రచారం చేసుకోలేక పోయామని వారు చెబుతున్నారు. అయితే.. ఇప్పటికి ప్పుడు ప్రజల మధ్యకు వెళ్లొద్దన్నది వీరి వాదన కూడా! మరి ఏం చేస్తారో చూడాలి.