గాజా బడిపై దాడి.. 100 ప్రాణాలు బలి.. యుద్ధానికి ఇది ఆరంభమా?

ఇప్పటికే ఆస్పత్రులు, శరణార్థి శిబిరాలను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంటున్నట్లు కథనాలు వస్తుండగా.. తాజాగా పాఠశాలపైనా దాడి చేయడం గమనార్హం.

Update: 2024-08-10 07:41 GMT

ఓవైపు ఇరాన్..మరోవైపు హెజ్బొల్లా.. ఇంకోవైపు హమాస్ లతో పోరాడుతున్న ఇజ్రాయెల్.. మూడో ప్రపంచ యుద్ధ భయాలను మరింత రాజేస్తూ దాడులు.. ఇప్పటికే గత వారం హమాస్‌, హెజ్‌బొల్లాల కీలక నేతలను హతమార్చి.. ఉద్రిక్తతలను పెంచిన ఇజ్రాయెల్.. తాజాగా గాజాలోని ఓ పాఠశాలపై దాడి చేసినట్లు స్థానిక మీడియా కథనాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఆస్పత్రులు, శరణార్థి శిబిరాలను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంటున్నట్లు కథనాలు వస్తుండగా.. తాజాగా పాఠశాలపైనా దాడి చేయడం గమనార్హం. అయితే.. ఇజ్రాయెల్ వాదన మరోలా ఉంది. శరణార్థి శిబిరాలు, పాఠశాలలు, ఆస్పత్రుల్లో హమాస్ ఉగ్రవాదులు దాక్కుంటున్నారని చెబుతోంది.

ఇది ఎక్కడకు వెళ్తుందో?

తమ అతిథిని హతమార్చిన ఇజ్రాయెల్ పై ప్రతీకారం తప్పదని ఇరాన్ హెచ్చరిస్తున్నది. మరోవైపు లెబనాన్ నుంచి హెజ్బొల్లా దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్‌పై ఏ క్షణమైనా ఇరాన్ నుంచి కూడా దాడులు జరిగే ప్రమాదం ఉంది. దీంతో పశ్చిమాసియా మూడు ప్రపంచ యుద్ధ క్షేత్రంగా మారే ప్రమాదం ఉందనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి సమయంలోనూ గాజాపైన ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. తూర్పు గాజాలోని శరణార్థి శిబిరంగా ఉన్న పాఠశాలను లక్ష్యంగా చేసుకుంది. అంతర్జాతీయ మీడియా దీనిని ధ్రువీకరిస్తోంది. వంద మందిపైగా చనిపోయారని.. పలువురు గాయపడ్డారని స్థానిక మీడియా చెబుతోంది.

వారంలో నాలుగోది..?

ఇజ్రాయెల్ గత వారం గాజాలోని మూడు పాఠశాలలపై దాడి చేసింది. ఇటీవల 30 మంది, ఈ నెల 1న దలాల్ అల్-ముఘ్రాబీ స్కూల్‌ పై దాడిలో 15 మంది చనిపోయారు. అక్టోబరు 7న తమపై జరిగిన దాడి అనంతరం ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్లో గాజాలోని 40 వేలమంది ప్రాణాలు కోల్పోయారు. కాగా, తాజా ఘటనలో తాము దాడి చేసింది హమాస్ కమాండ్ సెంటర్ అని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. దీనిని భయంకర ఊచకోతగా హమాస్ అభివర్ణించింది.

కాగా, ఇజ్రాయెల్ హెచ్చరికలతో గాజా ప్రజలు దక్షిణ ప్రాంతంలోని ఖాన్ యూనిస్ కు వెళ్లారు. అక్కడ ఏప్రిల్‌ లో బలగాలను ఉపసంహరించుకున్న ఇజ్రాయెల్.. మళ్లీ సైన్యాలను పంపుతోంది. ఈ ప్రాంతం వీడాలని ఆదేశించింది. వేలాది మంది సురక్షిత ప్రాంతానికి తరలిపోతున్నారు. మూడు రోజుల్లోనే 60 వేల మంది పశ్చిమ ప్రాంతానికి తరలిపోయారని ఐక్యరాజ్యసమితి చెబుతోంది.

Tags:    

Similar News