టీడీపీ ఆఫీసుపై దాడి.. పోలీసుల అదుపులో ఐదుగురు

కానీ.. మంగళగిరి లాంటి పట్టణంలో.. ప్రముఖంగా ఉండే పార్టీ ఆఫీసు మీద దాడికి తెగబడిన ఆరాచకంపై మాట్లాడింది లేదు. చర్యలు తీసుకున్నది లేదు.

Update: 2024-07-03 04:56 GMT

ఒక ప్రధాన రాజకీయ పార్టీకి చెందిన కేంద్ర కార్యాలయం మీద దాడికి పాల్పడటం.. పట్టపగలు అందరూ చూస్తుండగానే పలుగులు.. గునపాలు.. పెద్ద పెధ్ద రాళ్లు తీసుకొని దాడికి పాల్పడటం చూసింది లేదు. అది కూడా ఏదో మారుమూల ప్రాంతంలో అయితే అంతో ఇంతో అర్థం చేసుకోవచ్చు.

కానీ.. మంగళగిరి లాంటి పట్టణంలో.. ప్రముఖంగా ఉండే పార్టీ ఆఫీసు మీద దాడికి తెగబడిన ఆరాచకంపై మాట్లాడింది లేదు. చర్యలు తీసుకున్నది లేదు. అధికార బదిలీ జరగటం.. ప్రభుత్వం మారిన నేపథ్యంలో గతంలో చేసిన అరాచకాలపై ఇప్పుడు చర్యలు షురూ అయ్యాయి.

మూడేళ్ల క్రితం జరిగిన దాడి ఘటనకు కారణమైన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. అప్పటి సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల్ని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. నాలుగు టీంలుగా ఏర్పడిన పోలీసులు గడిచిన రెండు.. మూడు రోజులుగా నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలో పలువురి ఆచూకీని గుర్తించారు. నాడు పార్టీ హెడ్డాఫీసు మీద దాడి చేసిన దుండగుల్లో ఎక్కువ మంది గుంటూరుకు చెందిన వైసీపీ నేతలు.. కార్యకర్తలే ఎక్కువన్న విషయాన్ని గుర్తించారు.

తమను గుర్తించి.. తమ కోసం పోలీసులు వెతుకున్న విషయాన్ని గుర్తించిన నిందితులు అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయారు. మరికొందరు పార్టీ మారేందుకు వీలుగా రాయబారాలు మొదలు పెట్టారు. అలాంటి వాటిని అంగీకరించే ప్రసక్తే లేదని స్థానిక నేతలు స్పష్టం చేస్తున్నారు. నాడు దాడికి పాల్పడినవారిలో గుంటూరుకు చెందిన కార్పొరేటర్లు.. మాజీ కార్పొరేటర్లతో పాటు వైసీపీ నేతలు.. విద్యార్థి విభాగం నాయకులు పలువురిని పోలీసులు గుర్తించారు.

వారిలో పలువురిని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మిగిలిన వారి కోసం పోలీసులు గాలింపులు చేపట్టారు. అయితే.. ఇప్పటివరకు పోలీసులు వెల్లడించిన సమాచారం ప్రకారం ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లుగా వెల్లడించారు. తప్పుడు పనులు చేసిన వారు ఎవరైనా సరే.. తాత్కాలికంగా తప్పించుకోవచ్చు కానీ తర్వాతి రోజుల్లో తాము చేసిన తప్పులకు మూల్యం చెల్లించక తప్పదన్న విషయాన్ని తాజా ఉదంతం స్పష్టం చేస్తుందని చెప్పాలి.

Tags:    

Similar News