ట్రంప్ కు భారీగా పెరిగిన విజయావకాశాలు.. నెటిజన్ల ప్రశంసలు!
అయితే... ఈ కాల్పుల ఘటన అనంతరం ట్రంప్ విజయావకాశాలు భారీగా పెరిగాయని అంటున్నారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ఓ దుండగుడు కాల్పులు జరిపిన ఘటన ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో గాయపడిన ట్రంప్ ని ఆస్పత్రికి తరలించారు. దుండగుడి కాల్పుల్లో ట్రంప్ చెవికి గాయమైంది. అయితే... ఈ కాల్పుల ఘటన అనంతరం ట్రంప్ విజయావకాశాలు భారీగా పెరిగాయని అంటున్నారు.
అవును... పెన్సిల్వేనియాలోని ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ఓ దుండగుడు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే.. ఈ ఘటన తర్వాత ట్రంప్ విజయావకాశాలు భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. పలు సర్వే సంస్థలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నారు.
ఇందులో భాగంగా... దాడి జరిగిన అనంతరం ట్రంప్ పై ప్రజల్లో ఒక్కసారిగా సానుభూతితో కూడిన సానుకూలత ఏర్పడినట్లు చెబుతున్నారు. ఈ క్రమలో ఒక్కసారిగా ఆయనకు 8శాతం మద్దతు పెరిగినట్లు పోల్ స్టర్ నివేదిక పేర్కొంది. దీంతో జో బైడెన్ కంటే ఆయన బాగా ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. ట్రంప్ అధ్యక్షుడిగా గెలిచేందుకు 70% అవకాశాలున్నట్లు అంచనా వేసింది.
ఇదే సమయంలో ట్రంప్ విజయావకాశాలు పెరగడంతో కార్పొరేట్ సంస్థలు.. ఆయన ప్రచారానికి భారీగా విరాళాలు ఇవ్వడం మొదలుపెట్టాయని చెబుతున్నారు. ఇప్పటికే స్పేస్ ఎక్స్ అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్.. ట్రంప్ ప్రచారం కోసం భారీ విరాళం ఇచ్చినట్లు కథనాలొచ్చిన సంగతి తెలిసిందే.
మరోపక్క సోషల్ మీడియాలో ట్రంప్ కు ఫాలోయింగ్ మరింత పెరిగిందని అంటున్నారు. పైగా ఆ వయసులో బుల్లెట్లు దూసుకొచ్చినా కూడా భయపడలేదు సరికదా.. పైకి లేచి "ఫైట్.. ఫైట్.." అంటూ నినాదాలు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి.
దీంతో... ట్రంప్ ఆత్మస్థైర్యంపై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. నెటిజన్లు పొగడ్తలతో ముంచేస్తున్నారు. ఈ స్థాయిలో గట్స్ ఉన్న వ్యక్తి అధ్యక్షుడు కావాలంటూ నెటిజన్లు, ఆయన అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.