'అసెంబ్లీకి హాజరు'.. కేసీఆర్ కు ఒక రూల్..? జగన్ కు ఒక న్యాయమా..?
ఆంధ్రప్రదేశ్ లో సోమవారమే బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి.
తెలుగు రాష్ట్రాల అసెంబ్లీల్లో బడ్జెట్ ప్రవేశపెట్టే సమయం వచ్చింది. ఈ నెల 1నే కేంద్ర ప్రభుత్వం సాధారణ బడ్జెట్ ను ప్రవేశ పెట్టింది. నిరుడు ఈ సమయంలో ఎన్నికల నేపథ్యంలో కేంద్రం, తెలంగాణ, ఏపీలోనూ బడ్జెట్ ను తాత్కాలికంగా పెట్టారు. ఈసారి మూడు చోట్లా పూర్తిస్థాయిలో ప్రవేశపెట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్ లో సోమవారమే బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి.
అటు ఏపీ, ఇటు తెలంగాణలో ప్రతిపక్ష నేతలకు సంబంధించి ప్రధాన అంశం వారు అసెంబ్లీకి వస్తారా? రారా? అనే.. తెలంగాణలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి వచ్చిందే ఒక్కసారి. అది కూడా ప్రమాణ స్వీకారం చేసి వెళ్లిపోయారు. అనంతరం అరుదైన సందర్భంగా చెప్పుకోవాల్సిన అంశంగా మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. ‘ఇక భూకంపమే’ అన్న ప్రకటన చేసి వెళ్లిపోయారు. మళ్లీ ఆయన అసెంబ్లీకి రానే లేదు. తెలంగాణ ప్రభుత్వం పలుసార్లు ప్రత్యేక సమావేశాలు నిర్వహించినా కేసీఆర్ పట్టించుకోలేదు.
అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదాకు తగిన సంఖ్యలో సీట్లు లభించినా.. ఎన్నికల్లో ఓటమి తర్వాత పదవికి రాజీనామా చేసి అప్పటి ప్రగతి భవన్ నుంచి నేరుగా ఫాంహౌస్ కు వెళ్లిపోయిన కేసీఆర్ చాలాకాలంగా అక్కడే ఉంటున్నారు. ఇటీవల మాత్రమే పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. ఇక అసెంబ్లీకి హాజరు సరేసరి. మరో మాటగా చెప్పాలంటే తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి నుంచి మంత్రుల వరకు ఒకటే డిమాండ్.. ‘కేసీఆర్ అసెంబ్లీకి హాజరై మాట్లాడాలని’.. కానీ, సారు స్పందించినదే లేదు.
జగన్ మాత్రం..
ఆంధ్రప్రదేశ్ లో జగన్ కు గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్ష నేత హొదాకు తగిన సంఖ్యలో సీట్లు రాలేదు. పది శాతం సీట్లు కూడా గెలవకపోవడంతో (175 నియోజకవర్గాలకు గాను 18) కూటమి ప్రభుత్వం ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు. అసెంబ్లీ కొలువుదీరిన సమయంలో జగన్ ప్రమాణస్వీకారం చేసి వెళ్లిపోయారు. తాజాగా ఆయన బడ్జెట్ సమావేశాలకు వచ్చారు.
అనర్హత ఎలా..?
రాజ్యాంగంలోని ఆర్టికల్ 101 క్లాజ్ 4లో వరుసగా 60 రోజులు సభ్యుడు.. సమావేశాలకు హాజరుకాకపోతే సీటు ఖాళీ (వేకెంట్) అంటూ ప్రకటించే అధికారం స్పీక ర్ కు ఉందని అసెంబ్లీ ఉన్నతాధికారులు చెబుతున్నారు. వాస్తవానికి ఈ నేపథ్యంలోనే జగన్ అనర్హత భయంతోనే అసెంబ్లీకి వచ్చారని ఆయన వ్యతిరేక మీడియా ప్రచారం చేస్తోంది. అయితే, కేసీఆర్ కూడా అసెంబ్లీకి రావడం లేదు కదా..? ఆయనకూ అనర్హత ప్రమాదం ఉందా? అనే అంశంపై మాత్రం స్పందించడం లేదు. తెలంగాణలో కోరికోరి బీఆర్ఎస్ జోలికెళ్తే ఏం జరుగుతుందో ఆంధ్రా నేపథ్యం ఉన్న ప్రధాన మీడియాకు బాగా తెలుసు. అందుకనే వారు ‘కేసీఆర్ అసెంబ్లీకి రాకుంటే అనర్హత’ అనే పాయింట్ ను ఉద్దేశపూర్వకంగా ఇగ్నోర్ చేస్తున్నారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.