'దువ్వాడ' దుమారంలో రూటు మార్చిన వైసీపీ!

దువ్వాడ వ్యవహారంలో టీడీపీ సోషల్‌ మీడియా వేదికగా వైసీపీపై తీవ్ర విమర్శలు చేస్తోంది.

Update: 2024-08-13 04:58 GMT

శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ వ్యవహారం రోజురోజుకు చిలికి చిలికి గాలివానగా మారుతున్న సంగతి తెలిసిందే. భార్య దువ్వాడ వాణి, ఇద్దరు కుమార్తెలను వదిలేసిన దువ్వాడ.. దివ్వెల మాధురి అనే మహిళతో సహజీవనం చేస్తున్న ఘటన తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ప్రశ్నించడానికి దువ్వాడ ఇంటికెళ్లిన ఆయన భార్య వాణి, కుమార్తెలపై ఆయన అసభ్య పదజాలంతో దూషించి దాడికి ప్రయత్నించిన ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

దువ్వాడ వ్యవహారంలో టీడీపీ సోషల్‌ మీడియా వేదికగా వైసీపీపై తీవ్ర విమర్శలు చేస్తోంది. ఆ పార్టీలో అంతా ఇలాంటి వారేనని ఆరోపణలు గుప్పిస్తోంది. వైసీపీ మాత్రం అది దువ్వాడ వ్యక్తిగత విషయమని.. దానిపై తాము మాట్లాడబోమని స్పష్టం చేసింది.

ఇక్కడే వైసీపీపై నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దువ్వాడ శ్రీనివాస్‌ ది వ్యక్తిగత వ్యవహారం, పర్సనల్‌ అయినప్పుడు పవన్‌ కళ్యాణ్‌ ది కూడా వ్యక్తిగత వ్యవహారం, పర్సనలే కదా అని గుర్తు చేస్తున్నారు. పవన్‌ కళ్యాణ్‌ వ్యక్తిగత జీవితంపై సాక్షాత్తూ వైసీపీ అధినేత, గత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మొదలుకుని ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు (అధికారంలో ఉన్నప్పుడు) అంతా తీవ్ర విమర్శలు చేశారు.

సాక్షాత్తూ వైఎస్‌ జగనే.. పవన్‌ కళ్యాణ్‌ కార్లను మార్చినట్టు పెళ్లాలను మారుస్తున్నాడని.. నలుగురు నలుగురు పెళ్లాలు.. నలుగురు నలుగురు పిల్లలు ఉన్నారంటూ వెకిలి వ్యాఖ్యలు చేశారని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్సీ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా రచ్చ రచ్చ అవుతున్నా దానిపై స్పందించకుండా దువ్వాడ శ్రీనివాస్‌ వ్యవహారం పర్సనల్‌ వ్యవహారమని వైసీపీ కొట్టిపారేయడం ఏమిటని నిలదీస్తున్నారు.

చివరకు దువ్వాడ శ్రీనివాస్‌ కూడా గతంలో పవన్‌ కళ్యాణ్‌ వివాహాలపై తీవ్ర విమర్శలు చేశారు. హిందూ వివాహ వ్యవస్థను, సంప్రదాయాలను పవన్‌ కాలరాస్తున్నాడని మండిపడ్డారు. ఇప్పుడు ఆయన యూటర్న్‌ తీసుకున్నారు. పవన్‌ ఏ పరిస్థితుల్లో మూడు వివాహాలు చేసుకోవాల్సి వచ్చిందో ఇప్పుడు తనకు అర్థమవుతోందన్నారు. సమస్య తన వరకు వస్తే కానీ అర్థం కాలేదన్నారు.

వాస్తవానికి పవన్‌ కళ్యాణ్‌ వైసీపీ నాయకుల విమర్శలపై ఘాటుగా స్పందించారు. తాను ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తుంటే తన వ్యక్తిగత జీవితాన్ని బయటకు లాగడం ఏమిటని గతంలో నిలదీశారు. అయినప్పటికీ వైసీపీ నేతలు పదే పదే పవన్‌ వ్యక్తిగత జీవితంపై తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చారు.

పవన్‌ కళ్యాణ్‌ న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా విడాకులు ఇచ్చి మరో వివాహం చేసుకున్నారని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. దువ్వాడ శ్రీనివాస్‌ లాగా భార్యకు విడాకులు ఇవ్వకుండానే ఇంకో మహిళతో కలిసి ఉండటం లేదని అంటున్నారు. దువ్వాడ శ్రీనివాస్‌ ది వ్యక్తిగత వ్యవహారమని తప్పించుకుంటున్న వైసీపీ, ఆ పార్టీ నాయకులు పవన్‌ కళ్యాణ్‌ విషయం కూడా అంతేనని ఎందుకు తెలుసుకోవడం లేదని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

మరోవైపు టీడీపీ నేతలు దువ్వాడ శ్రీనివాస్‌ వ్యక్తిగత విషయమై మాట్లాడబోమని అంటున్నారు. విద్యుత్‌ శాఖ మంత్రి, ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే అయిన గొట్టిపాటి రవికుమార్‌ ఇదే విషయాన్ని తెలిపారు. దువ్వాడ శ్రీనివాస్‌ వ్యవహారం ఆయన వ్యక్తిగతమని చెప్పారు. వ్యక్తిగత విషయాలను రాజకీయాల్లోకి తాము లాగబోమన్నారు. వైసీపీ నేతలు అధికారంలో ఉన్నప్పుడు తమను వేధించినా తాము అలాంటి పనులు చేయబోమని తేల్చిచెప్పారు.

Tags:    

Similar News