వైసీపీకి మరో షాక్... మాజీ మంత్రి అవంతి రాజీనామా!
ఇప్పటికే మాజీ మంత్రులు, కీలక నేతలు, రాజ్యసభ సభ్యులు జగన్ కు బై బై చెప్పగా.. తాజాగా ఆ జాబితాలో మరో మాజీ మంత్రి చేరారు. ఆయనే విశాఖ వైసీపీ నేత, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్.
ఆంధ్రప్రదేశ్ లో ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం వైసీపీ నుంచి మొదలైన పార్టీ జంపింగులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే మాజీ మంత్రులు, కీలక నేతలు, రాజ్యసభ సభ్యులు జగన్ కు బై బై చెప్పగా.. తాజాగా ఆ జాబితాలో మరో మాజీ మంత్రి చేరారు. ఆయనే విశాఖ వైసీపీ నేత, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్.
అవును... వైసీపీకి మరో షాక్ తగిలింది. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. విశాఖపట్నంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా తన రాజీనామా లేఖను వైసీపీ అధ్యక్షుడు జగన్, ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డికి పంపినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా... తన వ్యక్తిగత కారణాలతోనే ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకోవడం వల్ల భీమిలి నియోజకవర్గ ఇన్ ఛార్జ్ బాధ్యతలకు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికీ రాజీనామా చేస్తున్నట్లు ముత్తంశెట్టి శ్రీనివాసరావు అలియాస్ అవంతి శ్రీనివాస్ తన రాజీనామా లేఖలో కోరారు.
ఇదే సమయంలో... "మీరు ఇచ్చిన అవకాశానికి నా ధన్యవాదములు.. నా రాజీనామాను ఆమోదించ వలసిందిగా కోరుతున్నాను" అంటూ ముగించారు.
కాగా... 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి భీమిలి అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసిన శ్రీనివాస్ 9,712 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అనంతరం జగన్ కేబినెట్ లో పర్యావరణ, అటవీ శాఖ మంత్రిగా పనిచేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి పార్టీతో అంటీముట్టనట్లే ఉంటున్నారు అవంతి శ్రీనివాస్.
ఈ క్రమంలో... గత కొంతకాలంగా ఆయన పార్టీని వీడుతున్నారంటూ ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో చివరికి తాజాగా రాజీనామా చేసేందుకు సిద్ధమై, రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడికి పంపించారు. అయితే... 2019 ఎన్నికలకు ముందు టీడీపీలో ఉన్న అవంతి.. తిరిగి పూర్వాశ్రమానికి వెళ్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది!