అవంతి వైసీపీని వీడనున్నారా ?

విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత అవంతి శ్రీనివాసరావు వైసీపీని వీడబోతున్నారా అంటే ప్రచారం మాత్రం అలాగే సాగుతోంది.

Update: 2024-07-13 04:11 GMT

విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత అవంతి శ్రీనివాసరావు వైసీపీని వీడబోతున్నారా అంటే ప్రచారం మాత్రం అలాగే సాగుతోంది. ఆయన పార్టీ సమీక్షలకు రావడం లేదు. గత నెల రోజులుగా ఆయన పెద్దగా హడావిడి చేయడంలేదు. భీమిలీలో 9 వేల ఓట్ల తేడాతో 2019 ఎన్నికల్లో గెలిచిన అవంతి 70 వేల పై చిలుకు తేడాతో 2024 ఎన్నికల్లో ఓటమి పాలు అయ్యారు.

ఆయనకు విద్యా సంస్థలు ఉన్నాయి. అవి భీమిలీ నియోజకవర్గం పరిధితో పాటు జిల్లాలో అనేక చోట్ల ఉన్నాయి. వైసీపీ అధికారం నుంచి దిగిపోవడంతో తన వ్యాపారాల కోసం అయినా ఆయన పార్టీ మారుతారు అని పుకార్లు షికారు చేస్తున్నాయి. అవంతి అయితే టీడీపీలో చేరాలని చూస్తున్నట్లుగా చెబుతున్నారు.

ఆయన 2014లో టీడీపీ నుంచి అనకాపల్లి ఎంపీగా గెలిచారు. 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరి భీమిలీ నుంచి గెలిచి మంత్రి అయ్యారు. మూడేళ్ళ పాటు ఆయన మంత్రిగా ఉన్నారు. ఆయన హయాంలోనే రుషికొండ మీద టూరిజం రిసార్ట్స్ ని కూల్చేసి ప్యాలెస్ ని నిర్మించే కార్యక్రమాలు జరిగాయి.

ఇవన్నీ పక్కన పెడితే అవంతి శ్రీనివాస్ తెలుగుదేశం వైపు చూస్తున్నా ఆ పార్టీ నేతలు అయితే ఆయనను చేర్చుకోవడానికి సుముఖంగా లేరని అంటున్నారు. భీమిలీ ఎమ్మెల్యేగా గంటా శ్రీనివాసరావు ఉన్నారు. ఆయనకు అవంతి తో విభేదాలు ఉన్నాయి. దాంతో పాటు ఆయన చేరిక వల్ల ఉపయోగమేంటి అన్న చర్చ కూడా ఉందని అంటున్నారు.

దాంతో టీడీపీ కాకపోతే జనసేనలోనైనా చేరాలని అవంతి చూస్తున్నట్లుగా చెబుతున్నారు. అయితే గతంలో పవన్ కళ్యాణ్ అవంతి బంతి పూబంతి చామంతి అని సెటైర్లు వేసిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటున్నారు. అంతే కాదు మంత్రిగా ఉన్న టైం లో పవన్ మీద అవంతి తీవ్ర స్థాయిలో చేసిన విమర్శలను వారు గుర్తు చేసుకుంటూ అవంతిని వద్దే వద్దు అంటున్నారు. జనసేన కూడా ఆయనను చేర్చుకోదనే అంటున్నారు.

నిజానికి ప్రజారాజ్యం నుంచే అవంతి తన రాజకీయ అరంగేట్రాన్ని స్టార్ట్ చేశారు. ఆ తరువాత ఆయన జనసేన వైపు రాలేదు అన్న బాధ అప్పట్లో ఉంది. ఇపుడు ఓడిపోయారు కాబట్టి వస్తానంటే తీసుకునే సమస్య లేదని అంటున్నారు. దీంతో బీజేపీలో చేరినా చేరవచ్చు అని అంటున్నారు.

బీజేపీకి నాయకుల కొరత ఉంది. దాంతో పాటు అవంతిని చేర్చుకునే వీలు ఉందని అంటున్నారు. అయితే ఇవన్నీ ప్రస్తుతానికి ప్రచారంగానే ఉన్నాయి. కానీ అవంతి మాత్రం వైసీపీలో కొనసాగేది లేదు అన్నది పెద్ద ఎత్తున అంతా అనుకుంటున్నారు. ఆయన వైసీపీకి దూరం పాటిస్తున్నారు అని అంటున్నారు. సో అవంతి రూట్ ఎటూ అన్నది మాత్రం అంతా ఆలోచిస్తున్న విషయంగా ఉంది.

Tags:    

Similar News