అలా చేస్తే అయోధ్య హనుమాన్ గఢీ ప్రసాదం ఇంటికే!
భక్తుల రద్దీ తీవ్రంగా పెరటమే కాదు.. అయోధ్యలో బాలరాముడ్ని దర్శించుకున్న తర్వాత హనుమాన్ గఢీ ఆలయానికి వెళ్లే వారి సంఖ్య మరింత పెరిగింది.
అయోధ్యలో బాలరాముడ్ని ప్రతిష్ఠించిన తర్వాత ఆ పుణ్య క్షేత్రానికి పెద్ద ఎత్తున భక్తులు వెళుతున్న సంగతి తెలిసిందే. అయోధ్య పట్టణానికి చారిత్రక ప్రాశస్త్యం ఏళ్లకు ఏళ్లుగా ఉన్నప్పటికి.. బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ తర్వాత మాత్రం ఆ పట్టణ ధశ తిరిగిపోయిన పరిస్థితి. భక్తుల రద్దీ తీవ్రంగా పెరటమే కాదు.. అయోధ్యలో బాలరాముడ్ని దర్శించుకున్న తర్వాత హనుమాన్ గఢీ ఆలయానికి వెళ్లే వారి సంఖ్య మరింత పెరిగింది. ఈ ఆలయంలో అమ్మే ప్రసాదం భక్తులు సొంతం చేసుకునే అవకాశం లేకుండా పోతోంది.
దీంతో.. దర్శనం అయినప్పటికీ ప్రసాదం మాత్రం అందుబాటులోకి రాకపోవటంపై భక్తులు అసంత్రప్తికి గురవుతున్నారు. ఈ క్రమంలో హనుమాన్ గఢీ ప్రసాదం భక్తుల ఇంటికి నేరుగా డెలివరీ అయ్యే కార్యక్రమానికి పోస్టల్ శాఖ తెర తీసింది. అయోధ్య హనుమాన్ గఢీ ప్రసాదం కావాల్సిన వారు ఎవరైనా సరే.. దగ్గర్లోని తమ పోస్టాఫీసుకు వెళ్లి.. డిప్యూటీ పోస్ట్ మాస్టర్.. అయోథ్య ధామ్ 224123 చిరునామాతో ఈ మనీ ఆర్డర్ పంపాలి. ప్రసాదం డెలివరీ కావాల్సిన చిరునామాను అందించాలి. ఈ అడ్రస్ లో పిన్ కోడ్.. ఫోన్ నెంబరు తప్పనిసరి.
ఇలా ఆర్డర్ చేసిన తర్వాత స్పీడ్ పోస్టులో భక్తుల ఇళ్లకే నేరుగా ప్రసాదాన్ని పంపుతామని పోస్టల్ శాఖ స్పష్టం చేస్తోంది. ఇంతకూ హనుమాన్ గఢీ ప్రసాదం ధర ఎంత? అంటే.. దానికి సమాధానం రూ.251గా నిర్ణయించారు. హనుమాన్ గఢీ ప్రసాదం అందలేదన్న నిరాశకు లోను కాకుండా ఉండేందుకు.. భక్తుల సౌలభ్యం కోసం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా పోస్టల్ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. సో.. హనుమాన్ గఢీ ప్రసాదం కావాలంటే దగ్గర్లోని పోస్టాఫీసుకు వెళితే సరి.