జనవరి 22న 'అయోధ్య' ఆలయం ప్రారంభం.. భారీగా ఏర్పాట్లు!

త్రేతాయుగం నాటి రామరాజ్యానికి నిలువెత్తు రూపాన్ని ఆవిష్కరించే ప్రయత్నం.. కోట్లాది మంది హిందువుల కల నెరవేరే రోజు దగ్గర్లోకి వచ్చేసింది

Update: 2023-12-09 04:02 GMT

దశాబ్దాల నిరీక్షణకు ముగింపు. రాములోరి జన్మస్థలి మీద.. ఆయన ఆలయం మీద చోటు చేసుకున్న పరిణామాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదంతా గతం. వర్తమానం వేరుగా ఉంది. భవిష్యత్తు చిత్రం కళ్ల ముందు కదలాడుతోంది. దేవతలు నిర్మించిన నగరంగా.. రాములోరు నడిచిన పవిత్ర నేలగా చెప్పే అయోధ్య నగరిలో నిలువెత్తు రాములోరి ఆలయాన్ని అత్యంత భారీగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

త్రేతాయుగం నాటి రామరాజ్యానికి నిలువెత్తు రూపాన్ని ఆవిష్కరించే ప్రయత్నం.. కోట్లాది మంది హిందువుల కల నెరవేరే రోజు దగ్గర్లోకి వచ్చేసింది. షెడ్యూల్ ప్రకారం జనవరి 22న రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఇందుకు తగ్గట్లే పనులు వేగంగా సాగుతున్నాయి. పనులు దాదాపు పూర్తి కావొస్తున్నాయి. వేద మంత్రాల నడుమ శ్రీరాముడికి ప్రాణప్రతిష్ఠ జరిగే ఈ అద్భుత కార్యక్రమానికి దేశ ప్రధాని నరేంద్రమోడీ ప్రత్యేక అతిధిగా హాజరవుతున్నారు.

ఈ కార్యక్రమానికి దేశంలోని 8వేల మంది ప్రముఖులను కూడా ఆహ్వానిస్తున్నారు. దేశ చరిత్రలో జనవరి 22, 2024 ప్రత్యేక రోజుగా మారనుంది.అయోధ్య రామమందిరం దర్శనం కోసం ఎదురుచూస్తున్న కోట్లాది మంది హిందువుల కల నెరవేరనుంది. ఇందుకోసం భారీగా ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరాన్ని దర్శించుకునే భక్తులు 70 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న జన్మభూమి కాంప్లెక్స్ లో మరో ఏడు ఆలయాన్ని సందర్శించుకునే వీలుంది.

ప్రధాని నరేంద్ర మోడీతో పాటు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్తోపాటు.. పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు పంపుతున్నారు. వివిధ రంగాల నుంచి పలువురు ప్రముఖులు వస్తున్నారు. సినీ రంగం నుంచి అమితాబ్ బచ్చన్.. అక్షయ్ కుమార్ తో పాటు ఇతర ప్రముఖులు.. పారిశ్రామిక రంగం నుంచి రతన్ టాటా.. ముఖేష్ అంబానీ.. గౌతమ్ అదానీ లాంటి ప్రముఖులతో పాటు.. క్రికెట్ రంగం నుంచి దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్.. విరాట్ కోహ్లీ లాంటి ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. అలాగే ప్రముఖ పూజారులతో పాటు మఠాధి పతులు ఇలా దాదాపు 8 వేల మంది అతిధుల్ని ఆహ్వానిస్తున్నారు.

ఆహ్వానాలు అందినవారిలో జర్నలిస్టులు.. రిటైర్డు సివిల్ సర్వెంట్లతో పాటు పద్మ అవార్డుగ్రహీతలే కాదు 50 మంది కరసేవకులకు ఆహ్వానాలు పంపారు. ఐదేళ్ల బాలుడి రూపంలో రామ్ లల్లాను ఆలయంలో కూర్చోబెడతారు. ఇందుకోసం కర్ణాటక.. రాజస్థాన్ నుంచి తీసుకొచ్చిన శిలలతో మూడు విగ్రహాల్ని తయారు చేశారు. ఈ విగ్రహాలు దాదాపు పూర్తి అయినట్లుగా చెబుతున్నారు. రామాలయంలో వినియోగించే ధ్వజ స్తంభాల నిర్మాణ పనులను అహ్మాదాబాద్ లోని సంస్థ సిద్ధం చేసింది. ఏడు ధ్వజ స్తంభాల బరువు సుమారు 5500 కేజీలు.

రామమందిరం చుట్టూ 800 మీటర్ల పొడువున నిర్మిస్తున్న రింగ్ రోడ్ చివరి దశలోకి వచ్చేసింది. ప్రాకారాల నుంచే కాదు రింగ్రోడ్డు మార్గం ద్వారా కూడా ఆలయాన్ని సందర్శించొచ్చు. ఆలయంలో ఫ్లోరింగ్ ను పాలరాయితో తీర్చి దిద్దుతున్నారు. 60శాతం ఫ్లోర్ ను మార్బుల్ తో అమర్చారు. అయోధ్య రామమందిరాన్ని 8.64 ఎకరాల్లో యూపీ సర్కారు నిర్మించింది. గర్భగుడితో పాటు ఐదు మండపాలు ఉంటాయి.

ఈ ఐదు మండపాల పేర్లు.. గుధ్ మండపం.. రంగ మండపం.. నిత్య మండపం.. ప్రధాన మండపం.. కీర్తన మండపంగా వ్యవహరిస్తారు. కొత్త రామాలయంలో శ్రీరాముడు కొలువు తీరే జనవరి 22 నుంచి 20 మంది కొత్త అర్చకులు ఆలయంలో రోజువారీగా పూజలు నిర్వహిస్తారు. ఇందుకోసం తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రస్తుతం 20 మంది కొత్త అర్చకులకు శిక్షణ ఇస్తోంది. జనవరి 22న భారీగా తరలివచ్చే భక్తుల కోసం అధికారులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.

భక్తుల వసతి కోసం అయోధ్యలో టెంట్ సిటీలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా మాజా గుప్తర్ ఘాట్ వద్ద 20 వేల ఎకరాల్లో 25 వేలమందికి వసతి కల్పించేలా నిర్మాణాలు చేస్తున్నారు. బ్రహ్మకుండ్ వద్ద 30వేల మంది.. బాగ్ బిజేసీ వద్ద 25 వేలమంది వసతితో పాటు.. కార్ సేవక్ పురం.. మణిరాం దాస్ కంటోన్మెంట్ లాంటి ప్రాంతాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు.

Tags:    

Similar News