ఆ విషయంలో చంద్రబాబు, నితీశ్ మధ్య తేడా ఏంటంటే.. అయ్యన్నపాత్రుడి షాకింగ్ కామెంట్స్
స్పీకర్ల సదస్సుకు ఇటీవల బిహార్ వెళ్లొచ్చిన ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన కామెంట్స్ చేశారు.
స్పీకర్ల సదస్సుకు ఇటీవల బిహార్ వెళ్లొచ్చిన ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మధ్య చాలా తేడా ఉందంటున్నారు అయ్యన్న. చంద్రబాబు, నితీశ్ ఇద్దరూ పాత మిత్రులు. ఇప్పుడు కేంద్రంలోని ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వాములు. ఈ ఇద్దరి భుజాలపైనే మోదీ ప్రభుత్వం ఆధారపడి ఉన్న విషయం తెలిసిందే.. ఇలాంటి పరిస్థితుల్లో స్పీకర్ అయ్యన్నపాత్రుడు చేసిన కామెంట్స్ ఆసక్తి రేపుతున్నాయి.
ఇటీవల బిహార్ వెళ్లిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు అక్కడి ప్రభుత్వ పనితీరును అడిగి తెలుసుకున్నారట. ముఖ్యమంత్రి నితీశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపైనా ఆరా తీశారట. ఈ క్రమంలో బిహార్ రాష్ట్రంలో వృద్ధాప్య పింఛన్లపై అయ్యన్నకు ఓ ఆసక్తికరమైన విషయం తెలిసిందని అంటున్నారు. ఆ రాష్ట్రంలో వృద్ధులకు కేవలం రూ.400 మాత్రమే పింఛనుగా ఇస్తున్నారు. కానీ, ఇదే సమయంలో ఏపీలో రూ.4 వేల పెన్షన్ పంపిణీ చేస్తున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య ఒకే పథకం విషయంలో పది రెట్లు తేడా ఉన్నట్లు గమనించిన అయ్యన్నపాత్రుడు ఆశ్యర్యపోయారు. ఇదే విషయాన్ని రిపబ్లిక్ డే సందర్భంగా వెల్లడించిన స్పీకర్ ఏపీ సీఎం చంద్రబాబు గ్రేట్ అంటూ ప్రశంసలతో ముంచెత్తారు.
కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ, బిహార్ రాష్ట్రాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏది అడిగినా కాదనకుండా చేస్తోంది. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఏపీ, బిహార్ రాష్ట్రాలకు ప్రత్యేకంగా ఆర్థిక భరోసా ఇస్తోంది. ఎంత ఆర్థిక భారం ఉన్నా, సంక్షేమ కార్యక్రమాల అమలు విషయంలో చంద్రబాబు రాజీ పడటం లేదని స్పీకర్ అయ్యన్నపాత్రుడు చెబుతున్నారు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా సామాజిక పింఛన్లను చూపుతున్నారు. ఏపీలో వృద్ధులు, వితంతువులకు రూ.4 వేలు, దివ్యాంగులకు రూ.6 వేలు పంపిణీ చేస్తున్నారు. ఈ విషయంలో బిహార్ ముఖ్యమంత్రి కన్నా ఏపీ సీఎం బెటర్ అంటూ ప్రశంసించి తన అభిమానాన్ని చాటుకున్నారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు.