కీలక పదవిలో అయ్యన్న రెండవ కుమారుడు ?
ఆయనకు 2024 ఎన్నికల్లో అనకాపల్లి లోక్ సభ టికెట్ ని ఇవ్వాలని అయ్యన్న కోరారు కానీ సాధ్యపడలేదు.
ఉమ్మడి విశాఖ జిల్లాలో సీనియర్ రాజకీయ నాయకుడిగా ఉన్న స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తన రాజకీయ వారసులను రెడీ చేసే పనిలో ఉన్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు విజయ్ ఇప్పటికే టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఆయనకు 2024 ఎన్నికల్లో అనకాపల్లి లోక్ సభ టికెట్ ని ఇవ్వాలని అయ్యన్న కోరారు కానీ సాధ్యపడలేదు.
అయితే ఆయనకు ఒక మంచి నామినేటెడ్ పదవి అయితే సిద్ధంగా ఉందని అంటున్నారు. తొందరలో జరిగే నామినేటెడ్ పదవుల పందేరంలో విజయ్ కి ప్రాధాన్యత ఇస్తారని ప్రచారం సాగుతోంది. ఇక అయ్యన్న రెండవ కుమారుడు రాజేష్ నర్శీపట్నం మునిసిపాలిటీలో కౌన్సిలర్ గా ఉన్నారు
నర్శీపట్నం మునిసిపాలిటీ వైసీపీ చేతిలలో ఉంది. అయితే అందులో నుంచి ఇద్దరు కౌన్సిలర్లు టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎన్నికల ముందు ఒక కౌన్సిలర్ చేరిపోయారు. దాంతో తాజాగా చేరికలతో కూటమి బలం నర్శీపట్నం మునిసిపాలిటీలో పెరుగుతుంది అని అంటున్నారు
దాంతో ఎస్సీ మహిళా రిజర్వుడు చైర్ పర్సన్ పోస్టుని తమ పార్టీకి చెందిన వారికి ఇస్తూనే కీలకమైన వైస్ చైర్మన్ పదవిని రెండవ కుమారుడు రాజేష్ కి ఇప్పించడానికి అయ్యన్న మార్క్ పాలిటిక్స్ తెర వెనక జోరుగా సాగుతోంది అని అంటున్నారు. కౌన్సిల్ లో అయ్యన్న ఇప్పటికె ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ప్రమాణం చేశారు. ఆయన సతీమణి పద్మావతి కూడా కౌన్సిలర్ గా ఉన్నారు. అంటే అయ్యన్నతో పాటు సతీమణి, కుమారుడు ఒకేసారి కౌన్సిల్ లో కనిపిస్తారు అన్న మాట.
దాంతో పాటు వైస్ చైర్మన్ గా రాజేష్ ని గెలిపించడం ద్వారా నర్శీపట్నం మునిసిపాలిటీని పూర్తిగా తమ వైపుగా తిప్పుకోవాలని అయ్యన్న కుటుంబం చూస్తోంది. నర్శీపట్నం మునిసిపాలిటీయే నియోజకవర్గం రాజకీయాలకు మూలం. ఇక్కడ రాజకీయం గుప్పిట పట్టిన వారే ఎమ్మెల్యేలుగా గెలుస్తారు.
ఒకపుడు నర్శీపట్నం పంచాయతీగా ఉండేది. అప్పట్లో అయ్యన్న తాత అమ్మ కూడా సర్పంచులుగా పనిచేశారు. అలా తమ వంశీకులకు నర్శీపట్నం మున్సిపాలిటీ రాజకీయంగా అచ్చి వస్తోందని ఆ సెంటిమెంట్ తో రెండవ కుమారుడిని కూడా రాజకీయ వారసుడిగా రెడీ చేసేందుకు అయ్యన్న చూస్తున్నారు అని అంటున్నారు.
తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని అయ్యన్న ఇప్పటికే ప్రకటించారు. తన పెద్ద కుమారుడికి లోక్ సభ టికెట్ ని చిన్న కుమారుడుకి ఎమ్మెల్యే టికెట్ ని ఆయన కోరనున్నారు అని అంటున్నారు. మొత్తానికి జిల్లా తెలుగుదేశం రాజకీయాల్లో పెద్దాయనగా ఉన్న అయ్యన్న తన వారసులను నాయకులుగా చేసి పార్టీకి అందించాలని చూస్తున్నారని అంటున్నారు. ఈ ప్రయత్నంలో ఆయన విజయవంతం అయితే మిగిలిన సీనియర్ నేతలు కూడా ఆయనను అనుసరించే అవకాశాలు ఉంటాయని అంటున్నారు.