అయ్యన్న కొడుకు పెద్దల సభలోకి ?

ఉన్నత విద్యావంతుడిగా ఉన్న విజయ్ ఎంపీగా పార్లమెంట్ లో అడుగు పెట్టాలని చూస్తున్నారు. ఆయన తన మనసులో అభిప్రాయాన్ని కూడా పలుమార్లు ఈ విధంగానే వ్యక్తం చేశారు.

Update: 2024-11-30 03:44 GMT

ఉమ్మడి విశాఖ జిల్లా నర్శీపట్నం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ స్పీకర్ గా ఉన్న సీనియర్ మోస్ట్ లీడర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు విజయ్ కి జాక్ పాట్ తగుతోందా అంటే అవును అని ప్రచారం అయితే ఉంది. ఆయనను కోరి మరీ పెద్దల సభకు పంపిస్తున్నారు అని అంటున్నారు.

టీడీపీకి దక్కే రెండు ఎంపీ సీట్లలో ఒకదానిని బీసీలకు ఇవ్వాలని చూస్తున్నారని టాక్. అది కూడా ఉత్తరాంధ్రాకు కేటాయిస్తారని తెలుస్తొంది. తొలుత ఈ సీటుని విజయనగరం జిల్లాకు చెందిన కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజుకు ఇవ్వాలని ఆలోచించినా ఆయనను గవర్నర్ గా పంపించాలని టీడీపీ అధినాయకత్వం డిసైడ్ చేసినట్లుగా తెలుస్తోంది.

దాంతో ఆ సీటుని బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన అయ్యన్న కుటుంబం నుంచి భర్తీ చేస్తారని అంటున్నారు. లోకేష్ కి అత్యంత సన్నిహితుడుగా ఉంటూ ఆయన యంగ్ టీం లో మెంబర్ గా కొనసాగుతున్న విజయ్ కి 2024 ఎన్నికల్లో అనకాపల్లి నుంచి ఎంపీగా టికెట్ దక్కాల్సి ఉంది. అయితే కూటమిలో పొత్తుల సమీకరణలు కుదరకపోవడంతో ఆయనని అలా పక్కన పెట్టాల్సి వచ్చింది.

ఉన్నత విద్యావంతుడిగా ఉన్న విజయ్ ఎంపీగా పార్లమెంట్ లో అడుగు పెట్టాలని చూస్తున్నారు. ఆయన తన మనసులో అభిప్రాయాన్ని కూడా పలుమార్లు ఈ విధంగానే వ్యక్తం చేశారు. ఇపుడు ఆయనకు ఆ అవకాశాన్ని కల్పించాలని పార్టీ భావిస్తోంది అని అంటున్నారు.

రాజ్యసభకు మూడు సీట్లు ఉంటే ఒకదానిని జనసేనకు ఇచ్చి మిగిలిన రెండింటినీ టీడీపీ తీసుకుంటుందని చెబుతున్నారు. టీడీపీ ఒక సీటుని ఓసీకీ మరో సీటుని బీసీకి ఇవ్వడం ద్వారా సామాజిక న్యాయాన్ని పాటించాలని చూస్తోంది.

ఇక బీసీ నేతగా సీనియర్ గా ఉన్న యనమల రామక్రిష్ణుడు కూడా రాజ్యసభ కోసం చూస్తున్నరు. అయితే ఆయన ఎమ్మెల్సీ పదవీ కాలం ఇంకా ఉంది. దాంతో ఆయనను 2026లో ఏర్పడే ఖాళీల నుంచి పెద్దల సభకు పంపిస్తారు అని అంటున్నారు. మొత్తానికి చూస్తే ఉత్తరాంధ్రకు బీసీకి ఇచ్చే కోటాలో కచ్చితంగా విజయ్ పేరు ఉంటుందని అంటున్నారు.

ఇక మంత్రిగా ఈసారి అవకాశం దక్కుతుందని భావించిన అయ్యన్న స్పీకర్ పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దాంతో ఆయనకు పార్టీ ఈ విధంగా న్యాయం చేసినట్లుగా ఉంటుందని కూడా అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే ఉత్తరాంధ్రా నుంచి టీడీపీ తరఫున రాజ్యసభకు వెళ్ళిన వారు ఇటీవల కాలంలో అయితే ఎవరూ లేరని అంటున్నారు.

గతంలో చాలా మంది రాజ్యసభ కోసం ప్రయత్నం చేసినా కుదరలేదు. ఇపుడు మాత్రం టీడీపీ ఈ చాన్స్ ని కోరి ఇవ్వాలని అనుకుంటోంది. కూటమికి భారీ మెజారిటీ ఇచ్చి అక్కున చేర్చుకున్న ఉత్తరాంధ్రకు పెద్దల సభలో వాయిస్ ఉండాలని పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం విజయ్ కి ప్లస్ పాయింట్ అవుతుంది అని అంటున్నారు. అన్నీ అనుకూలిస్తే ఆయనే పెద్దల సభలో రేపటి ఎంపీ అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News