వైఎస్ జగన్ కు అయ్యన్న పాత్రుడి ఆఫర్!!

ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలో వైసీపీ 11 సీట్లకు పరిమితమైన సంగతి తెలిసిందే.

Update: 2024-08-10 11:35 GMT

ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలో వైసీపీ 11 సీట్లకు పరిమితమైన సంగతి తెలిసిందే. దీంతో కూటమి నేతలు చెబుతున్నట్లు 10శాతం సీట్లు కూడా రానందుకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా రాని పరిస్థితి! అయితే ఈ విషయంపై ఇప్పటికే జగన్ స్పీకర్ కు లేఖ రాయడం, హైకోర్టును ఆశ్రయించడం తెలిసిందే.

దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్ష నేత హోదా ఇస్తామంటేనే అసెంబ్లీకి వస్తామని చెప్పడం సరైన ఆలోచన కాదని.. పులివెందుల ఎమ్మెల్యేగా ఆ ప్రాంత ప్రజల సమస్యలను ప్రస్థావించేందుకు జగన్ అసెంబ్లీకి రావాలని కూటమి నేతలు చెబుతున్నారు. అయితే... అసెంబ్లీలో ఎక్కువ సమయం తనకూ ఇవ్వాల్సి వస్తుందనే ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడం లేదని జగన్ చెబుతున్నారు.

ఈ నేపథ్యలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు తాజాగా స్పందించారు. ఇందులో భాగంగా.. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అసెంబ్లీకి రావాలని నిర్ణయించుకుంటే అసెంబ్లీలో మాట్లాడేందుకు తగినంత సమయం ఉంటుందని తెలిపారు. రూల్స్ ప్రకారం ఆయనకు ఇవ్వాల్సినంత సమయం ఇస్తామని తెలిపారు.

అవును... జగన్ ఇప్పుడు ముఖ్యమంత్రి కాదని గుర్తుచేస్తూ.. ఆయన కేవలం ఎమ్మెల్యే మాత్రమే అని చెబుతూ.. అందరి సభ్యుల్లాగానే ఆయన కూడా అసెంబ్లీ వచ్చి తన నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలపై మాట్లాడవచ్చని.. ఎమ్మెల్యేగా మాట్లాడేందుకు ఆయనకు తగిన సమయం దొరుకుతుందని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు.

ఇదే సమయంలో... ప్రతిపక్ష హోదా లేదనే కారణంతో జగన్ అసెంబ్లీని బహిష్కరించడం సరికాదని స్పీకర్ తెలిపారు. ఇదే క్రమంలో... పదవులు శాశ్వతం కాదని, తనను అసెంబ్లీకి ఎన్నుకున్న ప్రజల సమస్యలకు ప్రాతినిధ్యం వహించాల్సిన బాధ్యత జగన్ పై ఉందని స్పీకర్ అన్నారు. మాట్లాడే అవకాశం రాదనే భావనలో జగన్ ఎందుకు ఉన్నారని అయ్యన్న ప్రశ్నించారు.

ఇదే సమయంలో... జగన్ మాత్రమే కాదు, వైసీపీ ఎమ్మెల్యేలందరికీ సమస్యలు లేవనెత్తే అవకాశం ఉంటుందని.. పార్టీ బలాబలాలకు అనుగుణంగా మాట్లాడేందుకు సమయం కేటాయిస్తామని స్పీకర్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యేగా అసెంబ్లీకి రానని చెప్పడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు!

Tags:    

Similar News