గల్ఫ్ లో అమెరికా భారీ యుద్ధ విమానాలు.. ఇరాన్ గుండెళ్లో రైళ్లు

మినాటో ఎయిర్‌ బేస్‌ లోని 5వ బాంబ్‌ వింగ్‌ కు చెందిన బి-52 స్ట్రాటజిక్‌ బాంబర్లను తొలుత సెంట్రల్‌ కమాండ్‌ ఏరియాకు చేరవేసింది అమెరికా.

Update: 2024-11-03 09:24 GMT

ఇజ్రాయెల్ పై అమెరికా అధ్యక్ష ఎన్నికల కంటే ముందే దాడి చేస్తామంటూ హెచ్చరించిన ఇరాన్ కు అమెరికా గట్టి సంకేతమే పంపింది. తమవ్యూహాత్మక బాంబర్లను పశ్చిమాసియాకు తరలించింది. ఇరాన్‌ దూకుడును ఏమాత్రం సహించమని తేల్చి చెప్పింది. బి-52 స్ట్రాటో ఫొర్ట్రెస్‌ .. అమెరికా కు చెందిన భారీ యుద్ధ విమానాలు ఇవి. వీటిని ఇరాన్ ను కట్టడి చేసేందుకు మోహరిస్తామని చెప్పిన 24 గంటల్లోనే అన్నంత పనీ చేసింది అగ్ర రాజ్యం.

మినాటో ఎయిర్‌ బేస్‌ లోని 5వ బాంబ్‌ వింగ్‌ కు చెందిన బి-52 స్ట్రాటజిక్‌ బాంబర్లను తొలుత సెంట్రల్‌ కమాండ్‌ ఏరియాకు చేరవేసింది అమెరికా.

తర్వాత ఫైటర్‌ జెట్లు, ట్యాంకర్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌ లు, బాలిస్టిక్‌ మిసైల్స్‌నూ తరలించింది. ఇరాన్‌ ను ఎదుర్కొనేందుకు తాము ఈ విమానాలను మోహరిస్తామని అమెరికా శుక్రవారం హెచ్చరించింది. శనివారం అంటే 24 గంటల్లోనే బి-52 స్ట్రాటో ఫొర్ట్రెస్ లు గల్ఫ్‌ చేరుకోవడం గమనార్హం.

ఇరాన్‌ కానీ.. దాని మద్దతు ఉన్న సంస్థలు అమెరికా సైన్యం లేదా తమ దేశ ప్రయోజనాలను దెబ్బతీయాలని చూస్తే అడ్డుకుని తమవారిని కాపాడుకుంటామని అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాయలం పెంటగాన్‌ ప్రతినిధి మేజర్‌ జనరల్‌ పాట్‌ రైడర్‌ స్పష్టం చేశారు.

గట్టి సమాధానం ఇస్తాం..

అమెరికా బాంబర్లను తరలిస్తున్న సంగతి తెలిసి ఇరాన్‌ మండిపడింది. అగ్ర రాజ్యానికి తాము గట్టి సమాధానం చెబుతామని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హెచ్చరించారు. ఇలాగైతే తమ అణు విధానాన్ని పునః పరిశీలించాల్సి ఉంటుందని ఖమేనీ సలహాదారు కమాల్‌ ఖర్రాజ్‌ కూడా స్ఫష్టం చేశారు. ఒకవేళ తమపై దాడికి దిగితే అణు విధానంలో మార్పులు చేస్తామనేది దీని ఉద్దేశంగా తెలుస్తోంది. ఇటీవల ఉక్రెయిన్ డ్రోన్ దాడులను ఎదుర్కొనేందుకు రష్యా సైతం ఇదే విధంగా అణు విధానంలో మార్పులు చేసిన సంగతి తెలిసిందే.

ఇజ్రాయెల్ కమాండోలు రంగంలోకి అమెరికా బాంబర్ గల్ఫ్ కు వస్తుండగా.. ఇరాన్ హెచ్చరికల నడుమ ఇజ్రాయెల్ కమాండోలు రంగంలోకి దిగారు. లెబనాన్‌ లోని పలు ప్రాంతాల్లో దాడులు చేశారు. లెబనాన్‌ తీరంలో ఓ హెజ్‌బొల్లా సీనియర్‌ ఆపరేటివ్‌ ను అదుపులోకి తీసుకొన్నారు. దీనిపై లెబనాన్‌ సైన్యం, ఐరాస శాంతి పరిరక్షక దళం దర్యాప్తు మొదలుపెట్టాయి.

Tags:    

Similar News