మురికివాడ ప్రాజెక్టే బాబా సిద్ధిఖీ ప్రాణాలు తీసిందా?
ముంబై మహా నగరంలో పేదలు జీవించే ప్రాంతాలు మురికివాడలే.
ముంబై మహా నగరంలో పేదలు జీవించే ప్రాంతాలు మురికివాడలే. అలాంటి మురికివాడలను బాగు చేసేందుకు ప్రవేశపెట్టిన ప్రాజెక్టే మాజీ మంత్రి బాబా సిద్దిఖీ ప్రాణాలు తీసిందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. మహారాష్ట్రలో అత్యంత సంచలనం రేపుతున్న ఈ హత్యోదంతంలో హరియాణాకు చెందిన గుర్మయిల్ బల్జీత్ సింగ్, యూపీ వాసి ధర్మరాజ్‌రాజేష్ కశ్యప్ లు కాల్పులు జరిపారనే కథనాలు వస్తున్నాయి.
ఈడీ కేసులో చిక్కి.
బాబా సిద్ధిఖీపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసుంది. ముంబై మురికివాడ పునరావాస ప్రాజెక్టుకు సంబంధించి ఈ కేసు నమోదైంది. ఈడీ దర్యాప్తు జరుగుతున్న ఈ కేసులో.. సిద్ధిఖీకి ఆయన బిజినెస్ పార్ట్ నర్ తో గొడవలున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని పోలీసులు వెల్లడించారు. ఈ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. కాగా, 2000-04 మధ్యన ఎన్సీపీ-కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా.. బాబా సిద్ధిఖీ మహారాష్ట్ర హౌసింగ్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎంహెడ్ డీఏ) కు చైర్మన్ గా వ్యవహరించారు. ఈ సమయంలోనే మురికివాడ పునరావాస ప్రాజెక్టును చేపట్టారు. ఇందులో రూ.2 వేల కోట్ల అవకతవకలు జరిగాయన్న ఆరోపణలున్నాయి. 2012లో అబ్దుల్ సలామ్ అనే వ్యక్తి ఫిర్యాదుతో 2014లో సిద్ధిఖీ సహా 150 మందిపై కేసు నమోదైంది. మురికివాడ ప్రజలకు పునరావాసంలో భాగంగా ఇళ్ల కేటాయింపుల్లో భారీగా అవకతవకలు జరిగాయన్న ఆరోపణలున్నాయి. దీంతో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం 2018లో బాబా సిద్ధిఖీకి చెందిన రూ.462 కోట్ల ఆస్తిని ఈడీ అటాచ్ చేసి కేసు నమోదు చేసింది.
సల్మాన్ సాన్నిహిత్యం..
బాబా సిద్ధిఖీ బాంద్రా మాజీ ఎమ్మెల్యే. ఈయనకు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తో పాటు అనేకమంది సినీ తారలతో దగ్గరి సంబంధాలు ఉన్నాయి. అయితే సల్మాన్ క్రిష్ణ జింకలను వేటాడినందుకు అతడిపై గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పగబట్టింది. సల్మాన్ పై ఏప్రిల్ లో రెక్కీ చేసిన బిష్ణోయ్ గ్యాంగ్ విఫలమైంది. ఇప్పుడు సిద్ధిఖీని హతమార్చింది. చాలా రోజుల కిందటనే ఆయన ఇంటి వద్ద బిష్ణోయ్ గ్యాంగ్ రెక్కీ చేసింది. ముందే డబ్బు చెల్లింపులు, ఆయుధాలు పార్శిల్ లో సరఫరా జరిగిందని తేలింది. సిద్దిఖీ హత్య కేసును దర్యాప్తు చేసేందుకు ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ ముంబై వస్తోంది. అయితే, హత్య కేసులో ముంబై మురికివాడ ప్రాజెక్టు భాగస్వామి హస్తం ఉందనే కోణంలోనూ దర్యాప్తు సాగనున్నట్లు సమాచారం.