బోట్లు-పాట్లు.. చంద్రబాబుకు హెడేక్!
అయితే.. బ్యారేజీ మధ్యలో ఇరుక్కు పోయిన బోట్లను తొలగించడం.. చంద్రబాబు సర్కారుకు మరింత ఇబ్బందిగా మారింది.
విజయవాడలోని ప్రకాశం బ్యారేజీని బలంగా ఢీకొట్టిన ఐరన్ బోట్ల వ్యవహారం.. చంద్రబాబు సర్కారుకు తీవ్ర తలనొప్పిగా మారింది. ఈ నెల 1, 2 తేదీల్లో కృష్నానదికి ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వరద 11 లక్షలకు పైగా క్యూసె క్కుల నీరు చేరింది. ఈ సమయంలోనే నాలుగు ఐరన్ బోట్లు.. బ్యారేజీని బలంగా ఢీకొట్టాయి. దీంతో 67-69 గేట్ల మధ్య ఉన్న సపోర్టు(కౌంటర్ వెయిట్లు) తీవ్రంగా దెబ్బతింది. దీంతో అక్కడ మార్పు చేసి.. కొత్త సపోర్టును వేశారు. అయితే.. బ్యారేజీ మధ్యలో ఇరుక్కు పోయిన బోట్లను తొలగించడం.. చంద్రబాబు సర్కారుకు మరింత ఇబ్బందిగా మారింది.
ఐరన్ బోట్లు బలంగా ఉండడం.. అవి బయటకు రాలేక పోవడంతో భారీ క్రెయిన్ల ద్వారా అయినా.. బయటకు తీసుకురావాలని నిర్ణయించారు. కానీ, దానికి కూడా కుదరడంలేదు. దీంతో ఈ వ్యవహారం మరింత క్లిష్టంగా మారింది. మరోవైపు ఈ బోట్లు ఇరుక్కునిపోవడంతో ప్రవాహానికి ఇబ్బందిగా మారింది. దీంతో బోట్లను ఎక్కడికక్కడ ఛిద్రం చేసి.. బయటకు తీసుకువచ్చే పని చేపట్టారు. దీనికి గాను అనుభవం ఉన్న డైవర్లను రంగంలోకిదించారు. దీనికి నేవీ సాయం తీసుకోవాలని నిర్ణయించారు.
ప్రస్తుతం పనిచేస్తున్న విపత్తు నిర్వహణ బృందాలతో పనిసాగడం లేదు. ప్రస్తుతం ఒక్క బోటును కూడా తప్పించ లేకపోయారు. దీంతో ఇప్పుడు నేవీ సాయం తీసుకోవాలని సీఎం చంద్రబాబు తాజాగా నిర్ణయించినట్టు తెలిసింది. దీంతో ప్రక్రియనువచ్చే రెండురోజుల్లోనే వేగంగా పూర్తి చేయాలని.. దీనికి ముగింపు పలకాలని భావిస్తున్నారు. ప్రస్తుతం పది మందితో కూడిన డైవింగ్ టీమ్ నదిలోకి దిగి బోట్లను ఎక్కడికక్కడ కట్ చేస్తున్నారు. అయితే.. నది గర్భం కావడం.. లోతు ఎక్కువగా ఉండడంతో ప్రాణాపాయం పొంచి ఉందన్న వాదన కూడా వినిపిస్తోంది.
అత్యంత ద్రుఢం!
ప్రస్తుతం కృష్ణానదిలో చిక్కుకుపోయిన బోట్లు అత్యంత ద్రుఢంగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఒక్కొక్కటీ వెయ్యి టన్నుల బరువు ఉంటాయని లెక్కగట్టారు. అదేవిధంగా కోటిన్నర వరకు ఖరీదు ఉంటాయని తెలుస్తోంది. వీటిని బయటకు తీసుకువచ్చేందుకు తాజా అంచనాల ప్రకారం.. 3 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నట్టు సమాచారం. ఇదంతా కూడా సర్కారుకు అదనపు భారమేనని మంత్రులు చెబుతున్నారు. దీనిని ఎవరి ఖాతాలో వేయాలో అర్థం కావడం లేదని అంటున్నారు.