జీతాలివ్వడానికి డబ్బులు లేవు... బాంబు పేల్చిన బాబు !
అసలే మూలిగే నక్కలా ఏపీ ఆర్ధిక పరిస్థితి ఉంటే దాని మీద తాటి పండు మాదిరిగా భారీ వానలు వరదలు వచ్చి పడ్డాయి.
ఏపీలో ఆర్ధిక పరిస్థితి దారుణంగా ఉంది. ఎంత అనుభవశాలి అయినా చంద్రబాబు ఈ గండం నుంచి గట్టెక్కడానికి చాలా కష్టపడాల్సిందే. అసలే మూలిగే నక్కలా ఏపీ ఆర్ధిక పరిస్థితి ఉంటే దాని మీద తాటి పండు మాదిరిగా భారీ వానలు వరదలు వచ్చి పడ్డాయి. దాంతో వేలాది కోట్ల నష్టం వాటిల్లింది.
బాధితులు లక్షల్లో ఉన్నారు. వారంతా ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. కేంద్ర సాయం ఇంకా ఎంతో తెలియలేదు. కానీ వరదలు వచ్చి సర్వం పోగొట్టుకున్న వారు గత ఇరవై రోజులుగా దైన్యంతో ఉన్నారు. అందుకే ఇక ఆలస్యం చేయడం భావ్యం కాదని టీడీపీ కూటమి ప్రభుత్వం వరద సాయాన్ని ప్రకటించింది.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన చంద్రబాబు తీవ్ర ఆవేదనకు గురి అయ్యారు. గత ప్రభుత్వం మొత్తం వ్యవస్థలను సర్వ నాశనం చేసింది అని ఆయన మండిపడ్డారు. కేంద్రం ఇచ్చిన నిధులను లెక్కా పత్రం లేకుండా ఖర్చు చేశారని అన్నారు. ప్రకృతి వైపరిత్యాలకు కూడా వేలాది కోట్లు గతంలో రిలీజ్ చేస్తే వాటిని కూడా ఏ లెక్కా లేకుండా ఖర్చు చేశారని అన్నారు.
అలా నాచురల్ కలామటీస్ కింద ఉన్న ఫండ్స్ కూడా ఏమీ లేకుండా పోయాయని అన్నారు. కేంద్రం అయితే తమ వద్ద డబ్బులు ఉన్నాయని అనుకుంటుందని ఆయన అంటూ తాము ఎంతటి దురవస్థలో ఉన్నామో వారికి తెలియచేస్తూ లేఖ రాస్తున్నామని బాబు అన్నారు.
ఏపీలో ఆర్ధిక పరిస్థితి చూస్తే జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవని బాబు ఒక బాంబే పేల్చారు. కేంద్రం ఆదుకోవాలని అందుకే కోరుతున్నామని అన్నారు. మరో వైపు అమరావతి రాజధానికి ప్రపంచ బ్యాంక్ నిధులే అవసరం లేదని వైసీపీ ప్రభుత్వం రాసిందని, అలాగే పోలవరానికి కేంద్రం ఇచ్చిన నిధులను కూడా వేరే వాటికి డైవర్ట్ చేసి వాడేసుకున్నారని బాబు ఆరోపించారు
ఇలాంటి వారి వల్లనే తమ ప్రభుత్వం ఇబ్బంది పడుతోందని అన్నారు. తాము అధికారంలోకి వచ్చి వంద రోజులు కూడా కాలేదని కానీ చరిత్రలో ఎరగని వరదలు వచ్చాయని దాని వల్ల ప్రతీ కుటుంబమూ ప్రతీ వ్యక్తీ కూడా పూర్తి నష్టాన్ని చూసారని బాబు అన్నారు. అందుకే వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం వరద సాయాన్ని ప్రకటించింది అని ఆయన చెప్పారు.
ఏపీలో వైసీపీ ఒక భూతమని కూడా బాబు అభివర్ణించడం విశేషం. ఆ భూతాన్ని తరిమి కొట్టాలని పూడ్చి పాతర వేయాలని ఆయన కోరారు. త్రేతాయుగం నుంచి కూడా రాక్షసులు మంచి జరిగిన చోట చెడు చేసేందుకు ప్రయత్నం చేస్తూనే ఉన్నారని కలి యుగంలోనూ అదే జరుగుతోందని తాను మాత్రం ప్రజలకు చెడ్డ చేయాలనుకుంటే ఎవరినీ వదలనని పోరాడుతాను అన్నారు. అమరావతి రాజధాని నీట మునిగింది అని తప్పుడు వార్తలు రాసి ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని బాబు హెచ్చరించడం విశేషం.
ఇవన్నీ పక్కన పెడితే జీతాలకు డబ్బులు లేవు అన్నది బాబు చెబుతున్న మాట. మరి మరో పది పన్నెండు రోజులలో సామాజిక పెన్షన్లతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, అలాగే ప్రభుత్వ పెన్షనర్లకు పెన్షలు వేలాది కోట్ల రూపాయలతో చెల్లించాలి. మరి ఏ విధంగా ఈ ప్రభుత్వం చేస్తుంది అన్నదే చర్చగా ఉంది.