ఎంతో చేయాలని ఉంది.. కానీ ఖజానా ఖాళీ : సీఎం చంద్రబాబు

ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేయాల్సివుందని, కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెప్పుకొచ్చారు.

Update: 2025-02-15 17:30 GMT

రాష్ట్ర ప్రజలకు ఎంతో చేయాలని ఉంది.. కానీ, ఆర్థిక పరిస్థితి సహకరించడం లేదు. గల్లా పెట్టి మొత్తం ఖాళీ అయిపోయిందని ముఖ్యమంత్రి చంద్రబాబు తన నిస్సహాయతను వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన 8 నెలల్లో ఎన్నో పథకాలను అమలు చేశామని సీఎం గుర్తు చేశారు. సామాజిక పింఛన్ల పెంపు, ఉచిత గ్యాస్ సిలిండర్లు, అన్నా క్యాంటీన్ల ద్వారా ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేస్తున్నట్లు చెప్పారు. ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేయాల్సివుందని, కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెప్పుకొచ్చారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు తాజా వ్యాఖ్యలుతో సంక్షేమ పథకాల అమలుపై మరోమారు చర్చ జరుగుతోంది. ఎన్నికల్లో సూపర్ సిక్స్ హామీలిచ్చి బంపర్ విక్టరీ సాధించిన కూటమి ప్రభుత్వం కొద్ది హామీలను మాత్రమే నెరవేర్చిందని విపక్షం విమర్శిస్తోంది. సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయాలని పట్టుబడుతోంది. ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఇలా హామీలపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మరోమారు చంద్రబాబు వ్యాఖ్యలు హీట్ పుట్టిస్తున్నాయి.

గత ప్రభుత్వంలో సంపద పెరగలేదని చెబుతున్న సీఎం చంద్రబాబు.. ఐదేళ్లలో రూ.10 లక్షల కోట్లు అప్పులు చేశారని ధ్వజమెత్తారు. అప్పులు తీర్చడానికే మళ్లీ అప్పులు చేయాల్సివస్తోందని సీఎం చెబుతున్నారు. వైసీపీ హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని పదేపదే చెబుతున్న సీఎం.. గత ప్రభుత్వంలో జరిగిన విధ్వంసాన్ని సరిచేస్తున్నామని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో హామీలు అమలు ప్రభుత్వానికి సవాల్ గా మారింది. ఇక బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు చంద్రబాబు చేసిన తాజా వ్యాఖ్యలు.. ఈ ఏడాది కొన్ని హామీలు అమలు అయ్యే పరిస్థితి లేదా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయని అంటున్నారు.

Tags:    

Similar News