చంద్రబాబు సభలో కలకలం.. పథకాలపై నిలదీసిన యువకుడు
వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆ యువకుడిని అక్కడి నుంచి తీసుకువెళ్లిపోయారు.
ముఖ్యమంత్రి చంద్రబాబుకు చేదు అనుభవం ఎదురైంది. పింఛన్ల పంపిణీకి శనివారం అన్నమయ్య రాయచోటి వెళ్లిన చంద్రబాబు అక్కడ బహిరంగ సభలో మాట్లాడారు. 8 నెలల సమయంలో తన ప్రభుత్వం చేసిన పనులు చెబుతుండగా, ముఖ్యమంత్రి వేదికకు సమీపంలోనే కూర్చొన్న ఓ యువకుడు సూపర్ సిక్స్ హామీలు ఎప్పుడిస్తారంటూ నిలదీయడం సంచలనం రేపింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆ యువకుడిని అక్కడి నుంచి తీసుకువెళ్లిపోయారు.
కూటమి 8 నెలల పాలనపై జనం విసిగిపోయినట్లు వైసీపీ ఆరోపిస్తోంది. ఎన్నికల్లో గెలుపు కోసం కూటమి నేతలు ఎన్నో హామీలు ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక చేతులు ఎత్తేస్తున్నారని విమర్శిస్తోంది. ఆ పార్టీ విమర్శలకు తగ్గట్టే శనివారం ఓ షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. ఎన్నికల హామీలు ఎప్పుడు అమలు చేస్తారంటూ ఓ యువకుడు సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునే నిలదీయడం చర్చనీయాంశంగా మారింది.
సూపర్ సిక్స్ హామీలతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటివరకు ఏ హామీ నెరవేర్చలేదని వైసీపీ విమర్శిస్తోంది. సామాజిక పింఛన్ల పెంపును గొప్పగా చెప్పుకుంటున్న ప్రభుత్వం.. మహిళలకు ఇస్తామన్నా నెలకు రూ.1500 ఏమైందని నిలదీస్తోంది. అదేవిధంగా తల్లికి వందనం, అన్నదాతా సుఖీభవ, ఉచిత బస్సు పథకాలు ఏమయ్యాయని వైసీపీ నేతలు మీడియా ముఖంగా ప్రశ్నిస్తూనే ఉన్నారు. మరోవైపు రైతు సమస్యలపైనా, విద్యార్థుల ఫీజు బకాయిలపైనా ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో వారికి బూస్ట్ ఇచ్చేలా ఓ యువకుడు సీఎం సభలోనే ప్రభుత్వంపై విమర్శలు చేయడం గమనార్హం.
కాగా, పథకాలపై తనను నిలదీసిన యువకుడిపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి అవుట్ డేటెడ్ థింకింగ్ ఉండే కుర్రాళ్లు కొంతమంది ఉంటారు. వాళ్లు చెడగొడతా ఉంటారు. ఇదే పని వీళ్లకు. మనమేమీ చేయలేం. వాళ్ల విధానాలు కూడా ఇట్లే ఉంటాయి అంటూ చంద్రబాబు స్పందించారు. మరోవైపు సీఎంను ప్రశ్నించిన తనను అదుపులోకి తీసుకోవడంపై ఆ యువకుడు కూడా ఘాటుగా స్పందించాడు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నిస్తే తప్పా, నేనేమైనా క్రిమినల్ నా అంటూ పోలీసులను నిలదీస్తుండగా, పోలీసులు అతడిని వ్యాన్లో ఎత్తిపడేయడం వీడియోలో కనిపిస్తోంది. దీంతో కూటమి పాలనపై జనంలో తిరుగుబాటు మొదలైందని ప్రతిపక్షం పెద్ద ఎత్తున ప్రచారం మొదలుపెట్టింది.