ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త...మరి పనిచేసేది ఎవరు బాబూ?
గత పదిహేను రోజులుగా ఇదే విషయం మీద ప్రభుత్వం మంత్రులు అంతా మాట్లాడుతున్నారు
టీడీపీ కూటమి ప్రభుత్వం కొత్త నినాదం ప్రతీ కుటుంబంలో ఒకరిని పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దుతామని. ఈ నెల 2న అనకాపల్లి జిల్లా పర్యటనలో చంద్రబాబు తొలిసారి ఈ నినాదాన్ని ఇచ్చారు. గత పదిహేను రోజులుగా ఇదే విషయం మీద ప్రభుత్వం మంత్రులు అంతా మాట్లాడుతున్నారు
నిజానికి ఇది అందమైన నినాదం. కానీ ఆచరణలో ఈ నినాదం విధానంగా మారితే ఏమి జరుగుతుంది అన్నది కూడా ఆలోచించాలి కదా అని అంటున్నారు. రతన్ టాటా స్పూర్తితో ప్రతీ కుటుంబంలో ఒకరిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు ప్రకటించారు. అది బాగానే ఉంది. కానీ ప్రతీ ఒక్కరూ పల్లకీ ఎక్కితే మోసే బోయీలు ఎవరు అన్న చర్చ ఇపుడు సాగుతోంది.
ఒక పారిశ్రామికవేత్త వస్తే వందల వేలాదిగా ఉద్యోగాలు వస్తాయి.దాని వల్ల ఆర్ధిక పరిపుష్టి జరుగుతుంది, పారిశ్రామిక ప్రగతి సాధ్యపడుతుంది. అయితే అందరూ రాజులే అన్నట్లుగా ఇండస్ట్రియలిస్టులు అయితే ఇక ప్రజలు ఎవరు పనిచేసే వారు ఎవరు అన్నది లాజిక్ తో వేసే ప్రశ్నే కదా అని అంటున్నారు
ప్రభుత్వం ఉన్నతాశయాన్ని అర్ధం చేసుకోవాల్సిందే. అందరినీ గొప్పవారుగా చేయాలన్నది కూడా మంచిదే కానీ అందరూ పై మెట్టు మీదకు వస్తే మిగిలిన చోట్ల కూడా జనాలు కనిపించాలి కదా అన్నదే ఇక్కడ ప్రశ్నగా ఉంది. ఇంతకీ కూటమి ప్రభుత్వం పారిశ్రామిక విధానం మీద చేసిన ప్రకటన సంగతి చూస్తే ప్రతీ కుటుంబంలో ఒకరిని పారిశ్రామికవేత్తగా చేయాలన్నది ఆచరణలో సాధ్యం చేస్తామని చెబుతోంది.
చిన్న మధ్య తరహా సూక్ష్మ తరహా ప్రాజెక్టులను పెద్ద ఎత్తున ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని చెబుతోంది. ఇక దానికి తగినట్లుగా వ్యవవస్థలను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తామని చెబుతోంది. రానున్న అయిదేళ్లలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చేలా చూడడమే కాదు పారిశ్రామికీకరణ ఏపీ అంతటా విస్తరించి చేస్తామని చెబుతోంది.
నిజంగా ప్రభుత్వం ఉద్దేశ్యం మంచిదే అనుకున్నా ఈ నినాదం మాత్రం లాజిక్ కి అందడం లేదని అంటున్నారు. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేస్తామని చెబుతోంది. అలాగే పోర్టు ఆధారిత పరిశ్రమలకు కూడా పెద్ద పీట వేస్తామని అంటోంది.
ఈ విధంగా చూస్తే కనుక ప్రభుత్వం ఏపీలో పారిశ్రామిక విప్లవానికి నాందీ ప్రస్తావన చేయబోతోంది. నిజానికి పరిశ్రమలు కావాలి. అలాగే వ్యవసాయం సహా ఇతర రంగాలు బాగు పడాలి. ఒక్క పరిశ్రమలే అంతటా విస్తరిస్తే కాలుష్యం తో పాటు దాని వల్ల జరిగే ఇబ్బందులు కూడా ఉంటాయని అంటున్నారు.
అదే సమయంలో పరిశ్రమలలో పనిచేసేందుకు మానవ వనరులు కూడా ఉండాల్సిన అవసరం ఉంది కదా అని అంటున్నారు. ఏది ఏమైనా చంద్రబాబు ప్రభుత్వం ఏపీని అభివృద్ధిని చేయాలన్న ఆలోచనలను లక్ష్యాలను ఎవరూ తప్పు పట్టేది లేదు, ప్రభుత్వం ఆరాటాన్ని కూడా ఎవరూ తక్కువగా అంచనా వేయలేరు. కానీ అందమైన నినాదాలు కొన్ని ఆచరణలో సాధ్యపడతాయా అన్నదే అంతా చర్చిస్తున్నారు. అందులో భాగమే పారిశ్రామికవేత్తలు ప్రతీ ఇంట్లో ఉండడం అన్నది. సో ఈ విషయంలో ప్రభుత్వం ఆలోచనలు ఇంకా ఏమి ఉన్నాయో కూడా చూడాల్సి ఉంది.