ఇంత మెత్త‌నైతే.. క‌ష్టం బాబూ!

కానీ, చంద్ర‌బాబు మాత్రం ఇలానే వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

Update: 2024-10-01 03:00 GMT

మెత‌క‌త‌నం.. మెత్తనిత‌నం... వంటివి మంచివే. దూకుడు నిర్ణ‌యాల‌తో పోలిస్తే..ఆలోచించి.. నిర్ణ‌యం తీసుకోవ‌డం ఎలాంటిదో .. పెద్ద‌ల ముందు మెత‌క‌గా వ్య‌వ‌హ‌రించడం కూడా అంతే మంచిది. దీనిని ఎవ రూ కాద‌న‌రు. అయితే.. అన్ని వేళ‌లా మెత‌క‌వైఖ‌రి కూడా మంచిది కాదు. చేతులు కాలిపోతున్నా.. ఇంకా మౌనంగా ఉంటామంటే కుద‌ర‌దు. కానీ, చంద్ర‌బాబు మాత్రం ఇలానే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అణ‌కువ‌గా ఉంటూ.. త‌న‌ను తాను త‌గ్గించుకుంటున్నారు.

కేంద్రంలోని కూట‌మి స‌ర్కారులో భాగ‌స్వామిగా ఉన్న చంద్ర‌బాబు అక్క‌డ నుంచి నిధులు తెచ్చుకునే విష‌యంలో తాత్సారం చేస్తున్నార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. నిజానికి కేంద్రంలో మ‌ద్ద‌తు ఉన్న నేప థ్యంలో అక్క‌డ నుంచి నిధులు తెప్పించుకునేందుకు అంతో ఇంతో గ‌ద్దింపు ధోర‌ణి ఉంటే త‌ప్పేమీ లే దు. బిహార్ పాలిత జేడీయూ ఇదే ప‌ని చేస్తోంది. మ‌రి ఈ మాత్రం కూడా చంద్రబాబు చేయ‌డం లేద‌న్న టాక్ వినిపిస్తోంది.

ఈ నెల‌లో 2 కీల‌క విష‌యాలు చోటు చేసుకున్నాయి. 1) విజ‌య‌వాడ వ‌ర‌ద‌లు, కాకినాడ వ‌ర‌ద‌లు. దీనికి సంబంధించి కేంద్రానికి రూ.6880 కోట్ల ప్రాథ‌మిక ప‌రిహారం కోరుతూ.. చంద్ర‌బాబు లేఖ పంపించారు. నివే దిక కూడా ఇచ్చారు. బాధితుల‌కు.. ప‌రిహారం అందించాల్సి ఉంద‌ని, బుడ‌మేరును ప‌టిష్టం చేయాల్సి ఉంద‌ని కూడా చెప్పుకొచ్చారు. అయితే.. ఇది జ‌రిగి నెల రోజులు అయిపోయినా కూడా ఇప్ప‌టి వ‌ర‌కు.. కేంద్రం నుంచి రూపాయి కాసు కూడా రాలేదు. దీంతో వ‌ర‌ద బాధితుల‌కు ప‌రిహారం పంపిణీ నానాటికీ తీసిక‌ట్టుగా మారుతోంది. ఇప్ప‌టికి వేలాది మంది త‌మ‌కు ప‌రిహారం రాలేద‌ని.. ప్ర‌భుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు.

2) పోల‌వ‌రం నిధులు. కేంద్ర బ‌డ్జ‌ట్‌లోనే ప్ర‌తిపాదించిన 12 వేల కోట్ల‌రూపాయ‌ల‌ను ఇప్ప‌టి వ‌ర‌కు రూపాయి కూడా కేంద్రం విడుద‌ల చేయ‌లేదు. స‌రే.. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఎలా ఉన్నా.. ఇప్పుడైనా ఇవ్వాలి క‌దా! అంటే దానికి కూడా స‌మాధానం లేదు. మంత్రులు నేరుగా కేంద్రానికి విన్న‌విస్తున్నా స్పందించ‌డం లేదు. తాజాగా మ‌రోసారి 7 వేల కోట్లు ఇవ్వాలంటూ.. మంత్రి లేఖ రాశారు. అయినా.. కేంద్రం స్పందించ‌లేదు. ఈ ప‌రిణామాల‌ను గ‌ట్టిగా నిల‌దీసి.. కేంద్రం నుంచి డ‌బ్బులు తీసుకువ‌స్తే త‌ప్ప‌.. ఆయా ప‌నులు ముందుకు సాగే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. అయినా.. సీఎం చంద్ర‌బాబు మాత్రం మెత‌క‌వైఖ‌రినే ప్ర‌ద‌ర్శిస్తుండ‌డంతో ఆయ‌న‌పైనే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

Tags:    

Similar News