ఎన్డీయేకు బాబు మరింత కీలకం
నితీష్ కుమార్ ప్రధాని అయితే దేశం బాగుంటుందని జేడీయూ నేత, మంత్రి జమాఖాన్ చెబుతున్నారు.
ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఎన్డీయేలో ముఖ్య భాగస్వామిగా ఉన్నారు. ఎన్డీయే కూటమిలో రెండవ అతి పెద్ద పార్టీగా టీడీపీ ఉంది. బెజేపీకి 240 సీట్లు వస్తే ఆ తరూవత 16 సీట్లతో టీడీపీ ఉంది. 12 సీట్లతో నితీష్ కుమార్ మూడవ ప్లేస్ లో ఉన్నారు.
అయితే నితీష్ కుమార్ కి ప్రధాని పదవి మీద మోజు ఉందని అంటున్నారు. తాజాగా ఆయన మంత్రివర్గంలో ఒక మంత్రి ఇదే విషయం ప్రస్తావించారు కూడా. నితీష్ కుమార్ ప్రధాని అయితే దేశం బాగుంటుందని జేడీయూ నేత, మంత్రి జమాఖాన్ చెబుతున్నారు.
దీంతో నితీష్ కుమార్ విషయంలో ఎన్డీయే కూటమి పెద్దలలో అనుమానాలు అయితే ఉన్నాయని అంటున్నారు. దానికి తోడు రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తేడా కొడితే కనుక ఇండియా కూటమి మరింత ముందుకు వస్తుందని అది ఎన్డీయే మనుగడకు ఇబ్బందిగా మారినా ఆశ్చర్యపోనవసరం లేదని కూడా అంటున్నారు.
మరో వైపు చూస్తే ఎన్డీయేకు జేడీయూ టీడీపీ మద్దతు చాలా కీలకంగా ఉంది. ఇందులో 12 మందితో ఉన్న నితీష్ కనుక హ్యాండ్ ఇస్తే బాబు తో కూడిన 16 మంది ఎంపీలు మరింత కీలకం అవుతారు అని అంటున్నారు. చంద్రబాబుకు ఇప్పట్లో జాతీయ స్థాయిలోకి రావాలన్న కోరికలు అయితే లేవు అని అంటున్నారు. ఆయన ఏపీ సీఎం గా కొన్ని కార్యక్రమాలు చేయాలని చూస్తున్నారు. అమరావతి రాజధాని బాబుకు అతి ముఖ్యంగా ఉంది. దానిని ఒక రూపునకు షేపునకు తేవడం ద్వారా బాబు చరిత్రలో నిలవాలని చూస్తున్నారు.
అలాగే ఎనభై ఏళ్ళ నాటి పోలవరం ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తే కనుక బాబు కీర్తి శాశ్వతం అవుతుంది. ఎంతో మంది అధికారంలోకి రావచ్చు, ముఖ్యమంత్రులుగా ఉండవచ్చు. కానీ చిర కీర్తిని సాధించిన వారు అతి కొద్ది మంది మాత్రమే ఉంటారు. ఆ విధంగా చూస్తే కనుక చంద్రబాబు ఆ ఆలోచనతో ఉన్నారు అని అంటున్నారు.
ఈ రెండు బృహత్తరమైన కార్యక్రమాలను ఆయన తీసుకున్నారు. తన అయిదేళ్ళ పాలనలో వాటిని పూర్తి చేయాలని చూస్తున్నారు. దాని కోసం ఎన్డీయే మద్దతు అవసరం. కేంద్రం నుంచి నిధులతో పాటు పూర్తి సహకారం అందితే చాలు ఏపీలో తాను అనుకున్న పనులు సాగుతాయని బాబు భావిస్తున్నారు.
దాంతో బాబుకు కేంద్రం అండ కావాలి. అలాగే కేంద్రానికి బాబు అండ కావాలి. ఇలా పరస్పర అవగాహనతో ముందుకు పోతున్నారు. అయినా సరే దేశంలో మారుతున్న రాజకీయాన్ని బాబు గమనించకుండా ఉండరు అని అంటున్నారు.
ఎన్డీయే నానాటికీ తగ్గడం అదే ప్లేస్ లో ఇండియా కూటమి బలపడడం అన్నది కూడా టీడీపీ అధినాయకత్వం గమనిస్తోంది అని చెబుతున్నారు. ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో మరిన్నాళ్ళు ఉండాలని బాబుకు కూడా ఉంది అంటున్నారు. అయితే మధ్యలో ఏమైనా రాజకీయ పరిణామాలు జరిగితే మాత్రం ఎవరూ ఏమీ చేయలేరు అని అంటున్నారు.
మోడీ ప్రధానిగా ఉండకూడదని ఇండియా కూటమి కనుక పావులు కదిపితే అపుడు ఎన్డీయే కూటమిని రక్షించుకోవడానికి మరింత పటిష్టం చేసుకోవడానికి బాబు కీలకం అవుతారు అని అంటున్నారు. జేడీయూ బయటకు వెళ్ళినా వెంటనే మోడీ ప్రభుత్వం కూలిపోదు, కాకపోతే మ్యాజిక్ ఫిగర్ కి దగ్గరగా ఎడ్జ్ ఉంటుంది.
అందువల్ల బాబుతో సరిగ్గా ఉంటే ఆయన మద్దతుతో అధికారం కొనసాగించవచ్చు అన్నది బీజేపీ పెద్దల ఆలోచన అని అంటున్నారు. బాబు అవసరం అలా ఇపుడు కేంద్ర పెద్దలకు దండీగా పడుతోంది. ఇక హర్యానా కాశ్మీర్ ఫలితాలు రాబోతుండగా ఒక్క రోజు ముందు బాబు ఢిల్లీ వెళ్తున్నారు. దాంతో కేంద్ర పెద్దలతో ఆయన ఏమి మాట్లాడుతారు, బీజేపీ ఏమి కోరుకుంటోంది.ఆయన ఏపీకి సంబంధించి ఏమి ఆశిస్తున్నారు అన్న దాని మీద అటు ఢిల్లీ సర్కిల్స్ లోనూ ఇటు ఏపీ రాజకీయాల్లోనూ చర్చ సాగుతోంది.
ఏది ఏమైనా ఒక్క మాట ఇక్కడ ఉంది. బాబు దేశ రాజకీయాలలో తులాబారంగా మారబోతున్నారు. ఆయన ఎటు ఉంటే అటే అధికారం అన్నది వాస్తవం. ఆయన అవసరం అందరికీ ఉంది. అలా బాబు ప్రాధాన్యత మరింతగా పెరుగుతోంది అని చెప్పాల్సిందే.